Home జాతీయ వార్తలు టీచర్లు ప్రెజెంట్.. విద్యార్థులు ఆబ్సెంట్

టీచర్లు ప్రెజెంట్.. విద్యార్థులు ఆబ్సెంట్

School

శ్రీనగర్ : కశ్మీర్ లోయలో దాదాపు పక్షం రోజుల తరువాత సోమవారం స్కూళ్లు తెరుచుకున్నాయి. 370 అధికరణ రద్దు పరిణామంతో విధించిన ఆంక్షలను సడలించడంతో పునః ప్రారంభమైన విద్యాసంస్థలకు టీచర్లు అత్యధిక సంఖ్యలో వచ్చారు. విధులలో తిరిగి చేరారు. అయితే విద్యార్థుల హాజరీ తక్కువగానే ఉంది. లోయలో పలు కీలక ప్రాంతాలలో భద్రతా బలగాలను మొహరించి ఉం చారు. శ్రీనగర్‌లో 190 ప్రాధమిక పాఠశాలలను తెరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే నగరంలో 15వ రోజు కూడా దాదాపుగా అన్ని ప్రైవేటు స్కూళ్లు మూసి ఉన్నాయి. గత కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉండటంతో తల్లిదండ్రులు ఎందుకొచ్చిన సమస్య అని పిల్లలను స్కూళ్లకు పం పించలేదని వెల్లడైంది. అయితే స్కూళ్ల పునఃప్రారంభంతో పలు ప్రాంతాలలో స్కూలు బస్సులు, చిన్నారులు యూనిఫారాలలో బారులు తీరి నిలబడటంతో వీధులలోచాలా రోజులుగా కనబడని సందడి నెలకొంది. ఇతర ప్రాంతాలలో విద్యార్థుల హాజరీబాగానే ఉన్నా శ్రీనగర్‌లో పరిస్థితి వేరే విధంగా ఉంది. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాలేదని,ఈదశలో పిల్లలను స్కూళ్లకు పంపించడం కష్టం అని బాటామాలూలోని మహారాజాపోరా నివాసి అబ్దుల్ అజీ జ్ చెప్పారు. చిన్నారులను ఇప్పుడు స్కూళ్లకుపంపించడం తొందరపాటే అవుతుందని ఫరూక్‌అహ్మద్ తెలిపారు.
హోంమంత్రి అమిత్ షాతో అజిత్ దోవల్ భేటీ
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్ ధోవల్ ఇక్కడ హోం మంత్రి అమిత్ షాను సోమవారం కలిశారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి హోం మంత్రికి తెలియచేశారు. జమ్మూ కశ్మీర్‌లో దాదాపు పదిరోజులు ఉండి, పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వచ్చిన అజిత్ తొలిసారిగా హోం మంత్రిని కలిసి తన అనుభవాలను వివరించారు. తాను దాదాపుగా అన్ని ప్రాంతాలకు వెళ్లానని , ప్రజలతో కలిసి వారి సాధకబాధకాలను తెలుసుకున్నానని పేర్కొన్నారు. అమిత్ షాతో అజిత్ ధోవల్ భేటీ సమయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వివిధ ప్రాంతాలలో ఆంక్షలు, శాంతి భద్రతల పరిరక్షణకు చేపట్టిన చర్యలు, సాధారన జనజీవిత అంశాలు ఇతర విషయాలు ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దు తరువాతి పరిణామాలతో జమ్మూ కశ్మీర్‌లో ఈ నెల 5వ తేదీ నుంచి పలు రకాల ఆంక్షలు విధించారు. కమ్యూనికేషన్ నిలిపివేతతో ఇంటర్నెట్, ల్యాండ్, మొబైల్ ఫోన్లు పనిచేయకుండా పొయ్యాయి. జమ్మూ ప్రాంతం, కశ్మీర్ లోయలోని కొన్ని చోట్ల ఆంక్షలను క్రమేపీ సడలించారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాలలో ఆంక్షలు అమలులోనే ఉన్నాయి.

 Schools open in Kashmir valley