Thursday, November 7, 2024

ఫిబ్రవరి 1నుంచి బడులు

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరి 1నుంచి 9, ఆపై తరగతులకు

మరింత ప్రయోజనకరంగా ధరణి

పాస్‌పోర్ట్ ఆధారంగా ఎన్‌ఆర్‌ఐ రిజిస్ట్రేషన్లకు అవకాశం
మార్పులు, చేర్పులు వారం రోజుల్లో పూర్తి చేయాలి
సాదా బైనామాలను కలెక్టర్లు స్వయంగా పరిష్కరించాలి
రెవెన్యూ సంస్కరణల వల్ల స్పష్టత వస్తోంది
ధరణి 100 శాతం విజయవంతం
మంత్రులు, కలెక్టర్లతో ప్రగతిభవన్ సమీక్షలో సిఎం

CM KCR Says Salary hike to Govt Employees

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిదవ తరగతి నుండి ఆ పై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించాలని సిఎం ఆదేశించారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతులను నిర్వహించాలన్నారు. ఈ లోగా అన్ని విద్యా సంస్థలను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను, వాటిలోని టాయిలెట్లను సిద్ధం చే యాలన్నారు. అవన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థలు నిర్వహించక చాలా రోజులు అవుతున్నది కాబట్టి అందులోని సామాగ్రినంతటినీ శుభ్రపరచాలని సిఎం అన్నారు. అప్పుడు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలు, వంట సామాగ్రి పురుగుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాకును సరి చూసుకోవాలన్నారు. మొత్తంగా ఈ నెల 25లోగా విద్యా సంస్థలను తరగతులు నిర్వహించడానికి అనుగుణంగా సిద్ధం చేయాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి తదితర హాస్టళ్లను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పస్తుతం కోవిడ్‌కు వ్యాక్సిన వస్తున్న నేపథ్యంలో సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

అలాగే రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ధరణి పోర్టల్‌లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సిఎం ఆదేశించారు. మంత్రులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు, ఆయాశాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. దీని కారణంగా పెద్దఎత్తున ఘర్షణలు, వివాదాలు తలెత్తేవన్నారు. ప్రధానంగా రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడం వల్ల కలిగే అనర్ధాలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో వీటిని సమగ్రంగా రూపుమాపేందుకు, ప్రతి గుంటకూ యజమాని ఎవరో స్పష్టంగా తెలిసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని ఆయన వెల్లడించారు. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టం తదితర సంస్కరణల ఫలితంగా భూ యాజమాన్య విషయంలో స్పష్టత వస్తున్నదని చెప్పారు. భూ రికార్డుల నిర్వహణ, అమ్మకాలు, కొనుగోళ్లు తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా, అవినీతి రహితంగా, ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వందకు వంద శాతం విజయవంతమైందని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
ధరణి పోర్టల్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలి
వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటు కలిగించేందుకు అవసరమైన మార్పులను వారం రోజుల్లోగా ధరణి పోర్టల్ లో చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్లే స్వయంగా పూనుకొని సత్వరం పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయిన వ్యవసాయ భూముల మ్యుటేషన్ ను వెంటనే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పెండింగ్ మ్యుటేషన్ల కోసం తాజాగా దరఖాస్తులు తీసుకోవాలని, వారం రోజుల్లోగా మ్యుటేషన్లు చేయాలని కోరారు. “ధరణి పోర్టల్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని ఆదేశించారు. ఇందుకోసం తక్షణం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలన్నారు.
ఎన్నారైలకు పాస్‌పోర్టు ఆధారంగా రిజిస్ట్రేషన్లు
ఎన్నారైలకు తమ పాస్ పోర్ట్ నంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ధరణి పోర్టల్ లో అవకాశం కల్పించాలని సిఎం కెసిఆర్ సూచించారు. కంపెనీలు, సొసైటీలు కొనుగోలు చేసిన భూములకు కూడా పాస్ బుక్ పొందే విధంగా ధరణిలో వెసులుబాటు కల్పించాలన్నారు. గతంలో ఆధార్ కార్డు నంబరు ఇవ్వనివారి వివరాలను ధరణిలో నమోదు చేయలేదన్నారు. అలాంటివారికి మరోసారి అవకాశం ఇచ్చి, ఆధార్ నంబరు నమోదు చేసుకొని పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. ఏజెన్సీ ఏరియాల్లోని ల్యాండ్ ట్రాన్స్ ఫర్ రెగ్యులేషన్స్ వివాదాలన్నింటినీ జిల్లా కలెక్టర్లు నెల రోజుల్లో పరిష్కరించాలన్నారు. అలాగే స్లాట్ బుకింగ్ చేసుకున్నవారు తమ బుకింగ్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి, రీ షెడ్యూల్ చేసుకోవడానికి ధరణిలోనే అవకాశం కల్పించాలని సిఎం సూచించారు. నిషేదిత భూముల జాబితాను ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులతో సవరించాలన్నారు. కోర్టు తీర్పులకు అనుగుణంగా మార్పులు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల నుండి సేకరించిన భూమిని కూడా వెనువెంటనే నిషేధిత జాబితాలో చేర్చాలి. కోర్టు కేసులు మినహా పార్ట్ – బిలో చేర్చిన అంశాలన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు.
దరఖాస్తులను కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలి
సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి, పరిష్కరించాలన్నారు. ధరణి పోర్టల్‌లో జిపిఎ, ఎస్‌పిఎ, ఎజిపిఎ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే జిల్లాస్థాయి ట్రిబ్యునల్ లో ఇప్పటివరకు రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అలాగే రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ కిందిస్థాయి అధికారులకు అప్పగించి, కలెక్టర్లు చేతులు దులుపుకుంటే ఆశించిన ఫలితంరాదని. కాబట్టి కలెక్టర్లే అన్ని విషయాల్లో స్వయంగా పరిశీలన జరిపి, నిర్ణయాలు తీసుకోవా లని ముఖ్యమంత్రి అన్నారు.

Schools to Reopen from Feb 1 in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News