Home ఎడిటోరియల్ రామన్ స్ఫూర్తిగా సామాన్యుల దరికి విజ్ఞాన శాస్త్ర ఫలాలు

రామన్ స్ఫూర్తిగా సామాన్యుల దరికి విజ్ఞాన శాస్త్ర ఫలాలు

  • నేడు సైన్స్ దినోత్సవం

C-V-Raman

మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో 1903లో ఒక రోజు జరిగిన సంఘటన. పధ్నాలుగేళ్ల కుర్రవాడు ఆ కళాశాలలో బి.ఏ. తరగతిలో కూర్చున్నాడు. అతన్ని గమనించిన ప్రొఫె సర్ ఈలియట్ ఆశ్చర్యపోయాడు. ఏదైనా స్కూలు పిల్లవాడు కాలేజీకి వచ్చాడనుకున్నా డు. అదే విషయాన్ని అతడిని ప్రశ్నించాడు. అప్పుడే ఆయనకు తెలిసింది పద్నాలుగేళ్ల ఆ కుర్రాడు ప్రెసిడెన్సీ కళాశాలలో డిగ్రీ చదువు తున్నాడని. ప్రొఫెసర్ ఆ విషయాన్ని ప్రశ్నిం చడంతో అతడికి కళాశాలలో గుర్తింపు వచ్చింది చిన్న వయస్సులోనే కాలేజీలో చదువుతున్న విద్యార్థిగా.
అదే కళాశాల. మరో మూడేళ్ల అనంతరం 1906లో జరిగిన సంఘ టన. డిగ్రీ పూర్తయిన అనంతరం ఆ విద్యార్థి అక్కడే పోస్టు గ్రాడ్యు యేషన్‌లో చేరాడు. అంతర్జాతీయ స్థాయి పత్రిక ‘ఫిలసాఫికల్ మ్యాగ జైన్’కి ‘అసౌష్టవ వివర్తనం దీర్ఘ చతురస్రాకార రంధ్రం వల్ల ఏర్పడే వర్ణపట రేఖలు’ అనే అంశంపై ఒక పరిశోధనాపత్రాన్ని పంపించాడు. కాంతి ప్రవర్తనను వెల్లడించే పరిశోధనాపత్రమది. అనంతరం కూడా మరో పత్రాన్ని అదే పత్రికలో ప్రచురణకు పంపించాడు. ఈ రెండూ ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనా పత్రాలను చదివిన బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి విజేత లార్డ్ రేలీ ఆ విద్యార్థికి ఒక లేఖ రాశాడు. ఆ లేఖపై ఉన్న చిరునామా ‘ప్రొఫెసర్ రామన్’ అని. నోబెల్ బహుమతి విజేత కూడా ఆశ్చర్యపోయిన పరిశోధనా పత్రం అది. అందుకే టీనేజి కుర్రాడిని ప్రొఫెసర్‌గా భ్రమించాడు ఆయన.
ఈ రెండు సంఘటనల్లో పేర్కొన్న కుర్రాడే అనంతర కాలంలో భౌతిక శాస్త్రవేత్తగా ప్రఖ్యాతి గాంచాడు. నోబెల్ బహుమతి సాధించాడు. ‘భారతరత్న’మయ్యాడు. ఆయనే చంద్రశేఖర వెంకట రామన్.
అత్యంత సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, నోబెల్ బహు మతి సాధించిన సర్ చంద్రశేఖర వెంకట రామన్ జీవితం మనకందరికీ స్ఫూర్తి కలిగిస్తుంది. సముద్రపు నీలిరంగు మర్మాన్ని కాంతి శాస్త్రకోణం తో పరిశీలించి, నిగ్గు తేల్చిన ధీశాలి ఆయన. ఆయన పేరుతో చరిత్ర సృష్టించిన రామన్ ఎఫెక్ట్‌ను ప్రపంచానికి వెల్లడి చేసిన రోజును జాతీయ సైన్సు దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
రామన్ 1888 నవంబరు 7వ తేదీన తమిళనాడులోని తిరుచిరా పల్లిలో చంద్రశేఖరన్ రామనాథన్ అయ్యర్, పార్వతీ అమ్మాళ్ దంపతు లకు రెండవ సంతానంగా జన్మించారు.
రామన్‌కు నాలుగేళ్ల వయసున్నప్పుడు చంద్రశేఖరన్ అయ్యర్‌కు లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. దాంతో ఆ కుటుంబం విశాఖపట్టణానికి మకాం మార్చింది. దాంతో రామన్ ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖ పట్టణంలో జరిగింది. పన్నెండేళ్లకే మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. పద్నా లుగేళ్లకే మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అడుగు పెట్టారు. ఆ కళా శాలలో ఆ బ్యాచ్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైనవారిలో మొదటి శ్రేణి సాధించింది ఆయనొక్కరే. ఆంగ్లంలో, భౌతికశాస్త్రంలో స్వర్ణ పతకాలు సాధించారు సి.వి.రామన్. ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఆయనను యు.కె.లో మాస్టర్స్ డిగ్రీ చేయవలసిందిగా సూచించారు అక్కడి ప్రొఫెసర్లు. కానీ, వైద్య పరీక్ష చేసిన సివిల్ సర్జన్ ఆయన ఆరోగ్యం యు.కె. వాతావర ణానికి సహకరించదని చెప్పడంతో ప్రెసిడెన్సీ కళాశాలలోనే ఎం.ఎ. కోర్సులో చేరారు. పంతొమ్మిదేళ్ల వయసులో 1907లో పి.జి. పూర్తి చేశారు.
ఆ తర్వాత సోదరుని ప్రోత్సాహంతో సివిల్ సర్వీసు పరీక్షలో ఉత్తీర్ణు లయ్యారు. ఆర్థిక శాఖలో అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్‌గా ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం చేయడం భౌతిక శాస్త్రంపై ఆయనకున్న అమితమైన ఆసక్తిని ఏమాత్రం తగ్గించలేదు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే సాయం వేళల్లో ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ సంస్థలో పరిశోధనలు కొనసాగించారు.
భౌతికశాస్త్రంపై బాల్యంలో మొగ్గ తొడిగిన ఆసక్తి ఉద్యోగ బాధ్యత లను నిర్వర్తించే సమయంలో మరింత చిగురించింది. తండ్రి భౌతికశాస్త్ర అధ్యాపకుడు కావడం వల్ల బాల్యంలోనే భౌతికశాస్త్రం ఆయనకు అభిమాన విషయమైంది. తల్లి పార్వతీ అమ్మాళ్‌కు సంగీతంపై ప్రీతి. వీణ వాయించడంలో ఆమె నేర్పరి. చిన్నప్పటినుండి సంగీతాన్ని వింటూ ఉన్న రామన్‌కు ధ్వనిశాస్త్రంపై ప్రత్యేక శ్రద్ధ ఏర్పడింది. ఈ విధంగా తల్లిదండ్రుల నుండి భౌతికశాస్త్రంపై ఆసక్తిని ఏర్పరచుకున్న రామన్ తండ్రి ద్వారా అనేక పుస్తకాలు పొంది, చదవడం అలవాటు చేసుకున్నా రు. ఆ విధంగా తనకున్న శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంచుకో గలిగారు. జర్మన్ శాస్త్రవేత్త హెల్మ్‌హోల్డ్, బ్రిటిష్ శాస్త్రవేత్త లార్డ్ రేలే ధ్వని శాస్త్రంపై చేసిన పరిశోధనలు ఆయనను ఎంతగానో ప్రభావితం చేశాయి.
ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్‌లో సాయం వేళ ల్లోను, ఆదివారం, ఇతర సెలవు రోజుల్లోనూ పరిశోధనలు చేస్తున్నా ఆయన జ్ఞాన తృష్ణ తీరలేదు. దాంతో ఆర్థికశాఖలో ఉన్నతోద్యోగానికి రాజీనామా చేసి, కలకత్తా విశ్వ విద్యాలయంలో 1917లో భౌతికశాస్త్ర ఆచార్యుడిగా చేరారు. ఆచార్యుడిగా పనిచేస్తున్న సమయంలో తాను కృషిచేసిన సంగీత పరికరాల ధ్వని రహస్యాలపై 1921లో లండన్‌లో ఉపన్యాసం ఇచ్చారు. “ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడివి కాదల్చుకున్నావా” అని అక్కడి ప్రేక్షకుల్లో ఒకరు రామన్‌తో వేళాకోళం ఆడారు. దాంతో తన పరిశోధనలపై మరింత పట్టు బిగించారు. ఆసక్తిని ధ్వని శాస్త్రం నుండి కాంతి శాస్త్రంవైపుకు మరల్చారు. తిరుగు ప్రయాణం లో ఓడలో ప్రయా ణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం రెండూ నీలిరంగులో ఉండడం ఆయనను ఆలోచింపజేసింది. ఈ ఆలోచనే ‘రామన్ ఎఫెక్ట్’గా ప్రఖ్యాతి గాంచిన కాంతి పరిక్షేపణ సిద్ధాంత ఆవిష్క రణకు దారి తీసింది. పార దర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించి నప్పుడు అది తన స్వభావాన్ని మార్చు కుంటుందని 1928 ఫిబ్రవరి 28న ఆయన నిరూపించారు. ఇదే విషయాన్ని 1928 మార్చి 16న బెంగళూరులో జరిగిన శాజ్ఞుల సదస్సు లో శాజ్ఞులకు చూపించారు. అతి తక్కువ ఖర్చుతో ఈ దృగ్వి షయాన్ని నిరూపించడం అపూర్వమని శాస్త్రజ్ఞులు ఆయనను అభినందించారు.
చంద్రశేఖర వెంకట రామన్ 1924లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న సి.వి. రామన్‌ను 1929లో బ్రిటిష్ ప్రభుత్వం నైట్‌హుడ్ బిరుదుతో సత్క రించింది. ఈ పరిశోధన ఫలితంగా 1930లో ఆయనకు నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. 1934లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంచాలకునిగా నియమితులయ్యారు. 1947 లో స్వాతంత్య్రానంతరం మొట్టమొదటి జాతీయ ప్రొఫెసర్‌గా ప్రభుత్వం ఆయనను నియమించింది. 1948లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఉద్యోగవిరమణ అనంతరం బెంగుళూరులో రామన్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పారు. 1970 నవంబరు 21న మరణించేవరకు ఆయన ఆ సంస్థలో పరిశోధనలు చేశారు.
1954లో భారతప్రభుత్వం సర్వోన్నతమైన ‘భారతరత్న’ పుర స్కారం అందజేసింది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సి.వి. రామన్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, ఆయన వల్ల స్ఫూర్తిని పొందా లి. విజ్ఞాన శాస్త్ర ఫలాలను సామాన్యుల దాకా చేరేందుకు మనం కృషిచేయాలి.