Friday, April 19, 2024

సైన్సు కలహాలు సృష్టించదు!

- Advertisement -
- Advertisement -

Science does not create strife!

 

‘మత విశ్వాసాలు మనిషిని మూర్ఖునిగా తయారు చేస్తాయి” అని ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్, రిచర్డ్ డాకిన్స్, అబ్ర హం థామస్ కోపూర్, పెరియార్ ఇ.వి. రామస్వామి లాంటి గొప్పవాళ్లు ఎంతో మంది చెప్పారు. అది నిజమేనని ఈ దేశ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు రుజువు చేశారు. ఏ మతాన్ని అనుసరించకపోయినా, ఏ దేవుణ్ణి ప్రార్థించకపోయినా జరిగే నష్టం గాని, ప్రమాదం గానీ ఏదీ లేదు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

హిందూ మతాన్ని అనుసరించని క్రైస్తవులకు, ముస్లింలకు, బౌద్ధులకు, జైనులకు హిందూ దేవుళ్ల వల్ల అపాయం లేదు. అలాగే క్రైస్తవాన్ని నమ్మని హిందు, ముస్లిం ఇంకా ఇతర మతాల వారికి క్రైస్తవుల దేవుడి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. నష్టమూ లేదు. ముస్లింల దేవుడు అల్లాను నమ్మని ఇతర మతస్థులకు ఆయన ఏమో చేస్తాడన్న భయం లేదు. ఇదంతా విశ్వాసాలకు సంబంధించింది. అందుకే మత విశ్వాసాలు లేకపోయినంత మాత్రాన జరిగే ప్రమాదాలు లేవు. విశ్వాసమున్నంత మాత్రాన జరిగే మంచీ లేదు. రుజువుల్లేని నమ్మకాలకు, భ్రమలకు విలువ ఉండదు.

సైన్స్ ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో ముందుకు వస్తోందని ఎవరో అంటే ఓ మత విశ్వాసకుడికి వళ్లు మండింది. ‘ఏం మతాలేం తక్కువ తిన్నాయా? కొత్త కొత్త దేవుళ్లను సృష్టించుకోవడం లేదా?” అని ప్రశ్నించాడు. నిజమే కదా? మనుషులు మాత్రమే మతాలు పాటిస్తారు. మత మార్పిడిలు చేసుకుంటారు. అంతేకాదు, దేవుళ్లను కూడా మార్చుకుంటారు. యూదుల దేవుడు యెహోవాను విడగొట్టే కదా ముస్లింలు, క్రైస్తవులు ఏర్పడ్డారు. బుద్ధుని బోధనలేవో బాగున్నాయని అనిపించే కదా హిందువులు ఆయన్ని దశావతారాల్లో చేర్చుకున్నారూ?

సమాజంలో అతి నిరాడంబరంగా జీవించిన షిరిడి సాయిబాబాకు లేని శక్తులు ఆపాదించి, వెండి, బంగారు కిరీటాలు పెట్టి హిందూ దేవుణ్ణి చేశారూ? పూజారులు సంస్కృత శ్లోకాలతో పూజలు చేస్తున్నారు. సాయంత్రం కాగానే హారతి, భజన, హుండీ లో డబ్బులు… అంతా ఓ వ్యాపారం. దానికి మళ్లీ టెలివిజన్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారాలు. మత మార్పిడులు మనుషులలోనే కాదు దేవుళ్లలో కూడా జరిగాయని తెలుస్తూనే ఉంది. అంటే ఇవన్నీ మతాల్లో జరిగిన నిత్యనూతన పరిణామాలన్న మాట!
సైన్సుకు మతానికీ సైన్సుకు ఆధ్యాత్మికతకు ఏదో సంబంధం ఉందని మాయ మాటలు చెప్పే పిచ్చివాళ్లు కొందరుంటారు. నిజానికి అలాంటిదేమీ లేదు. ఇవి ఒక దానికి ఒకటి పూర్తి వ్యతిరేకం. సైన్సు జనాన్ని ఊహల్లో, భ్రమల్లో ఉంచదు. జనాన్ని విడగొట్టదు. సైన్సు ఫలితంగా ఒక కొత్త వ్యాక్సిన్ లేదా ఒక కొత్త వస్తువు వాడుకలోకి వచ్చిందంటే అది సర్వమానవాళికి అందుతుంది. కాని తమ దేశం వారికి, తమ ప్రాంతం వారికి లేదా తమ మతస్థులకు, తమ కులస్థులకు మాత్రమే అందుబాటులోకి రావాలని అది కోరుకోదు. సైన్సు జనంలో ద్వేషం రగిలించదు. మత కలహాల వలె సైన్సు కలహాలు చరిత్రలో ఎక్కడా నమోదు కాలేదు. మన కళ్ల ముందు కూడా జరగడం లేదు.

సైన్సుకు మతంతో అవసరముంది అని ఏ శాస్త్రవేత్తా చెప్పలేదు. అయితే సైన్సును అంగీకరిస్తూనే, దాని మూల సూత్రాన్ని, స్ఫూర్తిని పక్కకు నెట్టి, సైన్సును పూర్తిగా ఉపయోగించుకుంటూ తమతమ మౌఢ్యాన్ని ప్రచారం చేసుకుంటున్న మత గురువులు, మత బోధకులు, సద్గురువులు, బాబాలు, పీఠాధిపతులు, అమ్మలు, ప్రవచనకారులూ ఎంతో మంది ఉన్నారు. వీరిలో కొంత మంది మంచి ఇంగ్లీషు మాట్లాడుతూ మనువాదాన్ని ప్రచారం చేస్తుంటారు.

మరి కొందరు గొప్ప అభ్యుదయ వాదుల్లాగా మాట్లాడుతూ, సైన్సును పొడగుతూ భగవంతుడి ఉనికిని బలపరుస్తుంటారు. మామూలు మత విశ్వాసకుల కన్నా ఇలాంటి వారు సమాజానికి చాలా ప్రమాదం. వారి ఉపన్యాసాల్లోని అంతరార్థాన్ని అందులోని మోసాన్ని జనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారంతా మన కళ్ల ముందే కనబడుతున్నారు. వీళ్లు సోషల్ మీడియా ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయడానికి ఎక్కువ తాపత్రయ పడుతుంటారు. నియంత్రణ లేకపోవడం వల్ల సోషల్ మీడియాను మత కాలుష్యానికి గురి చేస్తున్నది వీళ్లే!

సమాజంలో మంచి చెడు ఉన్నట్లుగానే సైన్సూ మతమూ ఉన్నాయి. గణితంలో ప్లస్ గుర్తూ మైనస్ గుర్తూ ఉన్నాయి. భౌతిక శాస్త్రం ప్రకారం ధన విద్యుత్ రుణ విద్యుత్‌లు ఉన్నాయి. చెప్పొచ్చేదేమంటే సైన్సు ప్లస్ గుర్తు మతం మైనస్ గుర్తు. బ్యాంకు ఖాతాలో క్రెడిట్ డెబిట్‌లు ఉంటాయి. క్రెడిట్ అయ్యింది సమృద్ధిగా ఉంటే, వాళ్లు సంపన్నులుగా ఉంటారు. డెబిట్‌లు ఎక్కువయిన వాళ్లు దివాలా తీస్తారు. మానవ జీవితంలో సైన్సు క్రెడిట్ లాంటి దయితే, మతం డెబిట్ లాంటిది. ఇక్కడ క్రెడిట్, డెబిట్‌లు డబ్బుకు సంబంధించిన అంశాలు కాదు, మానవీయ విలువలకు సంబంధించినవి!

సృష్టిలోని జీవరాసులన్నీ దైవ భావనతో సంబంధం లేకుండా బతుకుతున్నాయి. మనిషి మాత్రమే దేవుడనే అవివేకపు నమ్మకం దగ్గర ఆగిపొయ్యాడు. అయితే ఈ ఆధునిక కాలంలో మనిషి దాన్ని కూడా గ్రహించుకున్నాడు. పైగా సరిచేసుకునే దిశలో ముందుకు నడుస్తున్నాడు. కోటాను కోట్ల జీవుల మధ్య ఒకడైన మనిషి తన మేధస్సుతోనే ఈ ‘బ్లూ ప్లానెట్’ పై ఆధిపత్యం సాధించిన మనిషి విశ్వాంతరాళాల్ని శోధిస్తున్న మనిషి తన తప్పు తాను తెలుసుకుంటున్నాడు. ఆ క్రమం లో కొంత సమయం పడితే పట్టొచ్చుగాక బూజుపట్టిన తన పురాతన భావజాలాన్ని తప్పక వదిలించుకుంటాడు. పైగా రాబోయే తరాల్ని అందుకు దూరంగా ఉంచి పెంచుకుంటాడు.

ఈ రోజు ప్రకృతి రహస్యాలనన్నింటికీ సైన్సు జవాబు చెపుతున్నా, వాటన్నిటిని పక్కన పెట్టి, ఎప్పుడో అనాది కాలంలో తన పూర్వీకులు రూపొందించిన దేవుడికి/ మత విశ్వాసాలకు చెక్క భజన చేస్తాడా? ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకోలేని ఆది మానవుడి కల్పనలకే ప్రాధాన్యమిస్తాడా? ఇవ్వడు గాక ఇవ్వడు. కేవలం మానవీయ విలువలకే ప్రాధాన్యమిస్తాడు. ప్రశ్నించే తత్వమే సైన్స్ అని, అదే నూతన ఆవిష్కరణలకు కారణమవుతోందని తెలిసిన ఆధునికుడు ప్రశ్నించే తత్వాన్ని పెంచుకుంటాడే గాని, అణచిపెట్టడు. ఎందుకంటే ప్రశ్నను అణిచేస్తే జాతి పురోగమించదు. నేటి ఆధునిక సామాన్యుడికి ఉన్న సౌకర్యాలు ఒకనాటి చక్రవర్తులకైనా లేవు కదా? అదెలా సాధ్యమవుతూ వచ్చిందీ అంటే కచ్చితంగా అది సైన్సు వల్లనే అన్నది గ్రహించుకోవాలి!

స్వాతంత్య్రానంతరం దేశంలో పేదరికం, అవినీతి రూపు మాపబడలేదు. అక్షరాస్యత పూర్తిగా సాధించబడ లేదు. అయితే కొన్ని కొన్ని రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధిస్తూనే వచ్చాం. కాని, కొన్నేళ్ల క్రితం ప్రచార ఆర్భాటాలతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం దేశాన్ని కొంత మంది సంపన్నుల చేతుల్లో పెట్టింది. పక్కన పాకిస్థాన్ ముస్లిం రాజ్యంగా భాసిల్లుతోంది. గనుక ఈ ప్రభుత్వం ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని చూస్తోంది. అందుకే తిరోగమన మార్గాన్ని ఎంచుకుంది.

ఇతర దేశాల నుండి ఇంత వరకు మనకు అందుతూ వస్తున్న వైజ్ఞానిక ఫలితాలు ఎందుకూ పనికిరానివని, ఈ గడ్డ మీద రుషులు, యోగులు ఏనాడో వాటిని కనుగొన్నారని వితండవాదం చేస్తోంది. పురాణ కావ్యాల్లో ఉన్న కల్పనల్ని వాస్తవాలుగా భ్రమింప చేస్తోంది. ఈ ప్రభుత్వానికి రాజ్యాం గం మీద గాని, కోర్టుల మీద గాని గౌరవం లేదు గనక, అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేసింది. మరీ ముఖ్యంగా రెండు, మూడు సంవత్సరాలుగా జరుగుతున్న జాతీయ సైన్సు కాంగ్రెస్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా అశాస్త్రీయ ధోరణులకు, పిట్ట కథలకు పెద్ద పీట వేయడం ఘోరమైన విషయం! వైజ్ఞానిక స్ఫూర్తిని దెబ్బ తీసే కుట్ర బాహాటంగా జరుగుతూ ఉంది.

నీతి మంతుడైన మనిషే అవినీతికి పాల్పడుతున్నాడు. ప్రజల్ని రక్షించాల్సిన రక్షకుడే/ పరిపాలకుడే వారికి భక్షిస్తున్నాడు. లేదా శిక్షిస్తున్నాడు. ఇతరులకు సహాయపడాల్సిన మనిషే వారిని చంపుతున్నాడు. స్త్రీలను గౌరవించాల్సిన మనిషే వారిపై లైంగిక దాడులు చేస్తూ క్రూరంగా చంపుతున్నాడు. కొంత మంది పరిశోధనల్లో నిమగ్నమై జీవితాలు త్యాగం చేసి నూతన ఆవిష్కరణలు మానవాళికి ధారపోస్తున్నారు. మరి కొందరు వాటిని పూర్తిగా అనుభవిస్తూ ‘మతం దేవుడు’ అనే మూఢత్వంలో మునిగిపోతున్నారు. అంతేకాదు, ఆ మూఢత్వాన్ని సిగ్గు లేకుండా జనంలో ప్రచారం చేస్తున్నారు. దాని వల్ల వాళ్లు లాభపడడమే గాని, జనానికేం ఉపయోగం ఉండదు.

అలాంటి వారిని సత్కరించే జనం కూడా ఆలోచించాలి. తమను వేల ఏళ్ల నాటి పనికిరాని భావజాలంలోకి తీసుకుపోతున్నందుకు గౌరవించుకుంటున్నారా ఏమిటి? జనం హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభిస్తే ఇలాంటి వారి దుకాణాలు మూతపడతాయి. ఈ సమాజాన్ని నేటి ఇరవై ఒకటవ శతాబ్దంలోకి తీసుకొచ్చిన శాస్త్రవేత్తల, ఉపాధ్యాయు ల, సైన్సు కార్యకర్తల, రచయితల కృషిని గుర్తించి గౌరవించుకోవడం అవసరం! ఇది మనిషిలోని ప్లస్ మైనస్‌ల పోట్లాట. ధన విద్యుత్ రుణ విద్యుత్‌ల మధ్య ఘర్షణ. సైన్సుకూ మతానికీ జరుగుతూ వస్తున్న భీకర పోరాటం!!

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News