*‘మన తెలంగాణ’ కథనంతో కదిలిన యంత్రాంగం
*పోలీసుల రక్షణలో నిర్మాణాలను పడగొట్టిన అధికారులు
*అధికారులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్న భూ మాఫీయా
మన తెలంగాణ/ వరంగల్‌బ్యూరో
వరంగల్ నగరంలోని అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారులు కొరడా ఝులిపించారు. ఇటీవల వరంగల్ ములుగురోడ్‌లో పట్టా భూములను కబ్జా చేస్తూ, కోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ అక్రమంగా చేసిన నిర్మాణాలపై ‘మనతెలంగాణ’ వరుస కథనాలను రాసింది. వీటిపై స్పందించిన వరంగల్ మహానగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను పడగొట్టారు. భూ మాఫీ యా అధికారులపై రాజకీయ, అధికారికంగా ఒత్తిళ్లు తీసుకొస్తుండడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల సహాయం తీసుకొని వెళ్లి అక్రమ నిర్మాణాలను పడగొట్టారు. ములుగురోడ్‌లోని 42 విభజన సర్వే నంబర్లు 42ఎ,42-2లో పట్టాభూమిని కలిగి ఉన్న కూసం సారంగపాణికి చెందిన స్థలంలో కొంత మంది భూమాఫీయా అక్రమంగా నిర్మాణాలను చేశారు. వీటిపై సదరు భూ యజమాని మట్టెవాడ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయించడంతోపాటు జిల్లా కోర్టును ఆశ్రయించారు. జిల్లా కోర్టులో కూడా సారంగపాణికి అనుకూలంగానే కోర్టు ఉత్తర్వులను ఇచ్చింది. వాటిని పోలీసులకు చూపించి కేసు నమోదు చేయించినప్పటికి వాటిని బేఖాతరు చేస్తూ సారంగపాణి స్థలంలో అక్రమంగానిర్మాణాలు చేశారు. వీటిపై మనతెలంగాణలో కథనాలను జనవరి 12, జనవరి 28న రాయడం జరిగింది. వీటిపై స్పందించిన వరంగల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల సహాయం తీసుకొని జెసిబిని తీసుకపోయి పడగొట్టారు.
* అధికారులపై భూ మాఫీయా ఒత్తిళ్లు
అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు పడగొట్టినప్పటికి భూమాఫీయాకు చెందిన వ్యక్తులు తిరిగి నిర్మాణాలకు చేసేందుకు తీవ్ర మైన ఒత్తిళ్లను తీసుకొస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొంత మంది నాయకులతో అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. గతంలో కూడా నగరంలో అనేక ప్రాంతాలలో టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను పడగొట్టిన తరువాత వారిపై కార్పొరేటర్ల ద్వారా, అధికార టిఆర్‌ఎస్ పార్టీ నేతలతో ఒత్తిళ్లు తీసుకొచ్చి తిరిగి నిర్మాణాలను చేసే ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా ములుగు రోడ్‌లో పడగొట్టిన అక్రమ నిర్మాణ స్థలంలో కూడా తిరిగి నిర్మాణం చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.