Thursday, April 25, 2024

సామాజిక న్యాయమేనా?

- Advertisement -
- Advertisement -

SCs and STs do not get social justice

 

షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారిపై నాలుగు గోడల మధ్య, జనాంతికంగా చేసే అవమానకర వ్యాఖ్యలను నేరపూరితమైనవిగా పరిగణించరాదని, బయటి వారు సాక్షులుగా లేని అటువంటి దూషణలు దోషం కిందికి రావని ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నాడిచ్చిన తీర్పు ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాల నిరోధక చట్టం పదునును పలచబరుస్తుందని చెప్పవచ్చు. డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్ హోదాకు తక్కువ గాని అధికారి దర్యాప్తు చేసి అనుమతి మంజూరు చేస్తే తప్ప ఎస్‌సి, ఎస్‌టి చట్టం కింద అరెస్టులు చేయరాదని, అలాగే నిందితులు ప్రభుత్వ ఉద్యోగులైనప్పుడు వారి పై అధికారి అనుమతి తీసుకోకుండా అరెస్టు జరపరాదని సుప్రీంకోర్టు 2018 మార్చిలో ఇచ్చిన తీర్పు కూడా తీవ్ర విమర్శకు గురయింది. దానిపై దేశ వ్యాప్తంగా అలజడి రేగి ఆందోళనలు వెల్లువెత్తడంతో ఆ తీర్పును ప్రభావ రహితంగా చేస్తూ అదే ఏడాది ఆగస్టులో పార్లమెంటు సవరణ చట్టం చేసింది.

దాని మీద దాఖలైన అప్పీళ్లను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. తక్షణ అరెస్టు అవకాశాన్ని మళ్లీ కల్పించింది. అలాగే ముందస్తు జామీనుకు వీలులేకుండా చేసింది. తాజాగా న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వర రావు, హేమంత గుప్తా, అజయ్ రస్తోగీలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన నాలుగు గోడల మధ్య దూషణలకు మినహాయింపు తీర్పు పర్యవసానాలెలా ఉంటాయో చూడాలి. దేశంలో వందల ఏళ్లుగా కఠిన సామాజిక శాసనంగా అమలైన కుల వ్యవస్థ స్వాతంత్య్రానంతరం సర్వ సమాన హక్కులతో కూడిన రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్న తర్వాత కూడా చెక్కు చెదరకుండా కొనసాగుతున్నది. ఆ నిచ్చెన మెట్ల సామాజిక నిర్మాణంలో అడుగునున్న ఎస్‌సి, ఎస్‌టిలపై ఉన్నత కులాల వారు ఇప్పటికీ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలలో ఈ దురన్యాయం మితిమించి సాగుతున్నది. దేశంలోని ఇతర ప్రదేశాలలో కూడా ఈ దుర్మార్గం నిరాఘాటంగా జరిగిపోతున్నది.

ఈ దుస్థితిని అరికట్టడం కోసం 1989 సెప్టెంబర్‌లో అప్పటి ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టిలపై అత్యాచారాల నిరోధ చట్టాన్ని పార్లమెంటు ఆమోదంతో తీసుకు వచ్చింది. అయితే ఈ చట్టాన్ని పగ సాధింపు సాధనంగా దుర్వినియోగ పరుస్తున్న సంఘటనలు పెచ్చుమీరుతున్నాయనే ఫిర్యాదులు రావడంతో సుప్రీంకోర్టు దాని కింద నిర్దోషులు శిక్షను అనుభవించకుండా చేయాలని తలచి ఇటువంటి తీర్పులను ఇస్తున్నది. తాజా ఉదంతంలో ఉత్తరాఖండ్‌లో ఒక భూవివాదంలో ఒక ఎస్‌సి మహిళపై ఆమె ఇంటి నాలుగు గోడల మధ్య అవమానకర వ్యాఖ్య చేశాడని హితేశ్ వర్మ అనే వ్యక్తిపై దాఖలైన కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అంతకు ముందు ఆ రాష్ట్ర హైకోర్టు ఈ కేసును రద్దు చేయడానికి నిరాకరించింది. అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగమవుతున్న సందర్భాలు అక్కడక్కడా ఉంటే ఉండవచ్చు. కాని ఈ చట్టం తీసుకు రావడానికి దారి తీసిన పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత తీవ్ర రూపం ధరించాయి.

ఇటువంటి నేపథ్యంలో చట్టం దుర్వినియోగం కాకుండా చేసేందుకు ఇతరేతర మార్గాలను అన్వేషించాలే గాని సామాజిక దురన్యాయానికి పాల్పడుతున్న శక్తులను అదుపు చేసి రాజ్యాంగ నీతికి అనుగుణంగా మార్చడానికి, కుల వివక్షను నిర్మూలించడానికి జాతి విస్తృత ప్రయోజనాన్ని ఆశించి తీసుకు వచ్చిన చట్టాన్ని ప్రభావ రహితం చేయించే తీర్పులను వెలువరించడం దేశ అత్యున్నత న్యాయస్థానం చేయదగిన పని కాదనే అభిప్రాయం కలగడం సహజం. వర్ణ వ్యవస్థలో కింది కులాలపై న్యూనతా భావం అనేది పెకలించడానికి వీలులేనంతగా వేళ్లూనుకుపోయింది. ఇప్పటికీ ఆ వ్యవస్థ నిర్దేశించిన ఉచ్ఛనీచ తేడాలను పాటిస్తున్న సమాజం కింది వర్గాల వారిపై వివక్ష చూపడాన్ని సులభంగా వదులుకోదని రూఢి అవుతున్నది. ఎస్‌సిలకు చెందిన యువతులపై అత్యాచారాలు, యువకులకు శిరోముండనాలు, కులం పేరుతో దూషించడం, పై కులాల అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉదంతాలలో దళిత యువకులను వేధించడం, హతమార్చడం వంటి సంఘటనలు కొన్నైనా తరచూ వార్తలకెక్కుతున్నాయి.

దేశంలో నెలకొన్న తిరోగమన రాజకీయ నేపథ్యం కూడా ఇందుకు పరోక్షంగానైనా దోహద పడుతున్నది. గో రక్షణ చట్టాలు, నీతులు తోలు పరిశ్రమను ఆధారం చేసుకొని బతుకుతున్న ఎస్‌సి కులాల వారిపై దౌర్జన్యాలకు దారి తీస్తున్నాయి. మొత్తంగా కుల వ్యవస్థ దుర్నీతి గ్రామీణ భారతంలో ఎస్‌సి, ఎస్‌టిలకు రక్షణను ఇప్పటికీ దుర్లభంగానే చేస్తున్నది. అందుచేత ఈ దుర్మార్గాన్ని అరికట్టడానికి ఉన్నత న్యాయస్థానాలు ఊతమివ్వాలేగాని దాని కోరలను పదును పెట్టకూడదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News