Home తాజా వార్తలు యాదాద్రిలో ఉలుల సవ్వడి

యాదాద్రిలో ఉలుల సవ్వడి

రాయితో అద్భుత కళారూపాలుగా సృష్టిస్తున్న శిల్పులు
విగ్రహాలన్నీ కృష్ణశిలతోనే తయారు
రెండేళ్లుగా శ్రమిస్తున్న దాదాపు 800 మంది శిల్పకళాకారులు
ప్రధాన స్థపతి పర్యవేక్షణలో జరుగుతున్న పనులు
మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి

Yadadri

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆ గుట్టమీద బండలు బద్దలవుతున్నాయి. ఒక వైపు ముడి రాయిని కత్తిరించే కట్టర్లు, మరో వైపు సుత్తి, ఉలి చప్పుళ్ల మధ్య నల్లని శిలలు అద్భుత శిల్పాలుగా మారుతున్నాయి. మనసును లక్ష్యంపైనే పెట్టి రాయిని అద్భుత రూపాలుగా మార్చే పనిలో దేశం నలుమూలల నుండి వచ్చిన శిల్పులు అద్భుత కళా విన్యాసం చేస్తున్నారు. దాదాపు 800 మంది శిల్పకళాకారులు గత రెండేళ్లుగా యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. అపూర్వమైన కృష్ణ శిలలను అద్భుత కళారూపాలుగా మార్చే పనిలో క్షణం తీరిక లేకుండా, లక్ష్యంపైనే ధ్యాస పెట్టి, దుమ్ము, ధూళిలో పనిచేస్తున్నారు. ముడి రాయి నుంచి విగ్రహాన్ని తయారు చేయాలంటే ఆ పనిని 124 భాగాలుగా విభజించుకుంటారు. స్థపతులు చెప్పిన కొలతల ప్రకారం రాయిపై మార్కింగ్ వేసుకొని, దాన్ని తిరిగి ఎనిమిది నుంచి పది సార్లు సరిచేసుకుంటూ చివరికి శిల్పానికి అనుగుణంగా ఉండే దశకు తీసుకువస్తారు. యాదాద్రి కొండపైన 2.33 ఎకరాల స్థలంలో జరుగుతున్న ఆలయ నిర్మాణంలో విగ్రహాలన్నీ కృష్ణ శిలతోనే తయారు చేస్తున్నారు.

రెండు వేల ఏండ్ల వరకు చెక్కు చెదరవు : కృష్ణ శిల దొరికే ప్రాంతంలోని మట్టినమూనాలను సేకరించి, చెన్నై, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పరీక్షలు చేయించిన తరువాతే వాడుతున్నారు. దాదాపు రెండు వేల ఏళ్ల వరకూ ఈ శిలకు క్షయం ఉండదని ఆ పరీక్షల్లో తేలింది. గత 500 ఏళ్లలోనే దేశంలోని ఏ ప్రాంతంలోనూ ఇలాంటి ఆలయం నిర్మించలేదని స్థపతులు అంటున్నారు. రెండు లక్షల టన్నుల రాయితో శిల్పాలను చెక్కుతున్నా రు పనులన్నీ వైష్ణవాచారం, ఆగమ, శిల్ప, వాస్తు శాస్త్రం ఆధారంగానే జరుగుతున్నాయంటున్నారు కళాకారులు. ఈ పనులన్నీ ప్రధాన స్థపతి సుందర్‌రాజన్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

స్త్రీ,పురుష శిలలు : ఆలయ నిర్మాణంలో వాడే శిలలను పురుషశిల, స్త్రీశిల, మధ్యస్థ శిలలంటారు. స్త్రీ,పురుష శిలలను భూమిలోపల నుండి తీస్తారు వీటినే కృష్ణశిలంటారు. దేవతా విగ్రహాలకు వాడుతారు. ఈ శిలను గుంటూ రు, ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఉన్న గురిజేపల్లి, కోటప్పకొండ ప్రాంతం నుంచి సేకరిస్తున్నారు. ఎండాకాలంలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం ఇవ్వడం ఈ కృష్ణశిలల ప్రత్యేకత. ప్రధానాలయమంతా కృష్ణశిలతోనే నిర్మించడం దేశంలోనే ప్రథమం
శిల్పికి రోజుకు రూ.2వేలు : ఉదయం ఏడు గంటలకే మొదలయ్యే వారి దినచర్య సాయంత్రం ఏడున్నర తర్వాత ముగుస్తుంది. మధ్యాహ్న భోజనం తర్వాత అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం మినహా శిల్పాలకు ప్రాణం పోసే పనిలోనే నిత్యం నిమగ్నమవుతారు. రాయిని శిల్పంగా మార్చే క్రమం లో పనులను బట్టి వీరికి రోజుకు రూ.1200 నుండి, రూ.2,000 వరకు పారితోషికం ఇస్తున్నారు.

150 మంది ముస్లిం శిల్పులు : ‘మా తాతల కాలం నుంచి దేవతా విగ్రహాల తయారీలోనే మా కుటుంబాలు బతుకుతున్నాయి, రెండేళ్లుగా యాదాద్రి పనులు చేస్తున్నాం. ఆలయాలే కాదు మసీదులు కూడా కడతాం, మహబూబ్‌నగర్ , కల్వకుర్తిలో చర్చిని నిర్మించాం. 150 మంది కళాకారులు ఈ పనిలో ఉన్నారు. మాకు మతంతో సంబంధం లేదు. పనే దైవం. యాదాద్రి ఆలయ మహారాజగోపురాన్ని నిర్మించడం మా పూర్వజన్మ సుకృతం’ అని సంతోషంగా అంటున్నారు, మండపాల నిర్మాణంలోబిజీగా ఉన్న షేక్‌బాబూలాల్, మహమ్మద్ యూనిస్, వీరందరిదీ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, తురకపాలెం గ్రామం.

ఇటలీ వెలుగులు : యాదాద్రి ఘాట్‌రోడ్డు వెంట అమర్చిన లైట్లను ఇటలీకి చెందిన నెరీ అనే సంస్థ ప్రత్యేకంగా తయారుచేసింది. కస్టమైజ్డ్ లైటింగ్ తయారీలో 75 ఏండ్ల అనుభవమున్న ఈ సంస్థ సంస్క తి, సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యుద్దీపాలను ఏర్పాటు చేయటంలో పేరుగడించింది.వీటిని ఇటలీనుంచి యాదాద్రికి తీసుకురావటానికి మూడు నెలల సమయం పట్టిం ది. క్యాస్ట్ ఐరన్ లైటింగ్‌పోల్‌లో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నమూనా ఏర్పాటు చేసి భక్తులకు ఇరువైపులా కనిపించేలా ఏర్పాటు చేయటం విశేషం. విద్యుత్ దీపాల్లో ఎల్‌ఈడీ పిక్చర్ కారణంగా విద్యుత్ వృథా కాకుండా ఉంటుంది. అతి తక్కువ విద్యుత్ వాడకంతో చిమ్మచీకటిలో కూడా పుష్కలమైన కాంతి వెదజల్లుతుంటుంది. యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఘాట్‌రోడ్డు అద్భుతమైన విద్యుత్ దీపాల వెలుగులో భక్తుల మనసు దోచుకోనున్నది. సాధారణ విద్యుత్‌లైట్లతో పోలిస్తే నెరీ ఎల్‌ఈడీ లైట్ల వల్ల 50 శాతం విద్యుత్ ఆదా అవుతుంది. రెండేండ్లలో ఈ విద్యుత్ లైట్ల ఏర్పాటు కోసం ఖర్చు చేసిన వ్యయం మిగిలినట్లవుతుందని అధికార వర్గాలంటున్నాయి.

నియమ నిష్టలు…

ఆలయ  శిల్పాలను చెక్కేటపుడు వీరు  కఠిన నియమాలను పాటిస్తారు. ఉదయమే స్నానాదికాలు పూర్తి చేసుకొని మాత్రమే పనిని ప్రారంభిస్తారు. పనిలో ఉన్నప్పుడు మాంసం, మద్యం ముట్టరు.

యంత్రుడి సాయం…
‘గతంలో ఒక ఆళ్వార్ విగ్రహాన్ని దాదాపు నలుగు రైదుగురు మనుషులు రాత్రింబవళ్లు కష్టపడి ఏడాది కాలం పాటు చెక్కేవాళ్లం. నేటి సాంకేతిక నైపుణ్యం, యంత్రాలు వల్ల పని సులువై, నాలుగైదు నెలల్లోనే పూర్తి చేస్తు న్నామని ఓ శిల్పి అన్నారు.

కొలతలు వేసి ఇస్తారు

‘పేపర్ మీద వేస్తున్న బొమ్మ సరిగా రాకపోతే రబ్బరుతో చెరిపి మరోసారి వేయొచ్చు. కాని రాతిని శిల్పంగా చెక్కేటప్పుడు అలా కుదరదు. స్థపతులు రాయిని కొలతలు వేసి ఇస్తారు. దానికి అనుగుణంగా శిల్పాన్ని చెక్కుతాం. ప్రధానమైన శిల్పాలు చెక్కేటపుడు సాధ్యమైనంత వరకు అనుభవం ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తారు’ హేమాద్రి(శిల్పి)
అందరూ కాక పోయినా కొం దరు తప్పనిసరిగా పంచె ధరిస్తారు. నరసింహమూర్తి, పరశురాముడు వంటి రౌద్రంగా ఉండే విగ్రహాలు చెక్కుతున్నపుడు శిల్పులు శాంతి మంత్రం జపించడం ఆనవాయితీగా వస్తోంది. సంజీవ్(శిల్పి)

80శాతం పనులు పూర్తి

ఒకే రకం కృష్ణ శిలతో మొత్తం లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిర్మించడం దేశంలోనే ప్రథమం. కాకతీయుల తర్వా త నిర్మాణం జరుగుతున్న అద్భుత శిల్ప సౌందర్యం ఇది. గర్భాలయం, ప్రధానాలయం శ్లాబు కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ఆళ్వార్ల శిలారూపాలతో కూడిన స్తంభాలు, కాకతీయ స్తంభాలు కొలువు తీరాయి. ప్రస్తుతం సుదర్శన గోపురాల నిర్మాణం జరుగుతోంది. దాదాపు 80శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు శిల్పుల కోసం రూ.2కోట్లు ఖర్చుచేశాం. దసరా నాటికి మొత్తం పూర్తి చేయాలనే లక్ష్యంతో అందరం కష్టపడి పని చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.900కోటు. ఇప్పటి వరకు 500 కోట్లు వ్యయం అయింది’
‘యాడా’ వైస్ ఛైర్మన్ జి. కిషన్ రావు

సరిహద్దులు లేని శిల్పకళ

భుక్తి కోసం చేపట్టే ఏ పనైనా భక్తితో చేయాల్సిందే.  దీనికి కు లం, మతంతో పనిలేదు. భిన్న ప్రాంతాల, మతాల కళాకారులిక్కడ పనిచేస్తున్నారు. కళకు మతం అంటదు, ఓ బృహత్కార్యాన్ని భుజస్కందాలపై వేసుకొని తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు నుండి 600మంది శిల్పులు, మరో రెండొందల కూలీ లు, ఇక్కడ శ్రమిస్తున్నారు    స్థపతి ఆనందాచారి వేలు