Home జాతీయ వార్తలు 50 ఏళ్లలో 8.5 సెం.మీ పెరిగిన సముద్ర నీటి మట్టం

50 ఏళ్లలో 8.5 సెం.మీ పెరిగిన సముద్ర నీటి మట్టం

Minister-Babul

రాజ్యసభలో కేంద్ర పర్యావరణ మంత్రి బాబుల్ సుప్రియో వెల్లడి
కోస్తా తీరంలో సునామీ, తుపాన్లు, వరదలు ముంచుకొచ్చే ప్రమాదం

న్యూఢిల్లీ : భారత కోస్తా తీరంలో సముద్ర జలాల నీటిమట్టం గత 50 ఏళ్లలో 8.5 సెం.మీ వరకు పెరిగిందని కేంద్ర పర్యావరణ మంత్రి బాబుల్ సుప్రియో మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. ఒక ప్రశ్నకు స్పందిస్తూ భూతాపం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి సముద్ర జలాలు ఉప్పొంగి అనేక నగరాలు ముంపునకు గురవుతాయని చెప్పారు. కోస్తా తీరంలో ఏటా సముద్ర మట్టం సరాసరిన 1.70 ఎంఎం వంతున పెరుగుతోందని, ఈమేరకు గత 50 ఏళ్లలో సముద్ర మట్టం 8.5 వంతున పెరిగిందని అన్నారు. 2003 నుంచి 2013 మధ్య గత దశాబ్ద కాలంలో ఉత్తర హిందూ మహాసముద్రం మట్టంలో కూడా తేడా వచ్చినట్టు ఏటా 6.1 మిమీ వంతున సముద్ర మట్టం పెరుగుతున్నట్టు శాటిలైట్ ఆల్టిమెట్రీ , మోడల్ నమూనాలు సూచించాయని చెప్పారు.

సముద్ర మట్టాలు పెరగడం సునామీ, భారీ తుపాన్లు, వరదలు వంటి అనేక వైపరీత్యాలకు దారి తీస్తుందని, తీరం లోని పల్లపు ప్రాంతాలు ముంపునకు కోతకు గురవుతాయని పేర్కొన్నారు. సముద్ర సగటు నీటి మట్టం బట్టి లోతట్టు ప్రాంతాల ముంపు ఉంటుందని, నీటి మట్టం కన్నా తక్కువగా లోతట్టు ప్రాంతాలు ఉన్నప్పుడు ముంపు తప్పదని, అయితే భూమి కుంగిపోవడం వల్ల కూడా ముంపు సంభవిస్తుందని చెప్పారు. ఉదాహరణకు డైమండ్ హార్బర్ వద్ద భూమి కుంగిపోవడం వల్లనే సముద్ర నీటి మట్టం అక్కడ భారీ స్థాయిలో పెరిగిందని, కాండ్లా, హాల్దియా, పోర్టుబ్లెయిర్ ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుందని వివరించారు.

Sea level along Indian coast rose by 8.5 cm in last 50 years