Home తాజా వార్తలు ఇవిఎంలా… బ్యాలెటా?

ఇవిఎంలా… బ్యాలెటా?

SEC holds review meeting on GHMC elections

జిహెచ్‌ఎంసి ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు
కొవిడ్ నేపథ్యంలో మార్గదర్శకాలు

మన తెలంగాణ/ హైదరాబాద్: కరోనా నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) కసరత్తును ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారధి శుక్రవారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన జిహెచ్‌ఎంసి పాలకవర్గాల పదవీకాలం ముగియనున్నందున ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ భేటీలో జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి జ్యోతి బుద్ధప్రకాశ్ ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా కొవిడ్ ఉన్నందున ఇవిఎంలు వినియోగించాలా లేక బ్యాలెట్ బాక్సులు వాడాలా అనేదానిపై తీవ్రంగా చర్చించారు. కరోనా నేపథ్యంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా వచ్చే సమస్యలు, సవాళ్లపై చర్చించారు.

ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్, ర్యాండమేజైషన్, సిబ్బంది వంటి ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. ఓటర్ల జాబితా ఎటువంటి లోపాలు లేకుండా, పారదర్శక ఎన్నికల ప్రక్రియ కోసం ఫేస్ రికగ్నజేషన్ సాప్ట్‌వేర్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. గత ఎన్నికల్లో 45.29 శాతం మాత్రమే పోలింగ్ నమోదైందని, ఈసారి పోలింగ్ శాతం పెరిగేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కొవిడ్ 19 నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలని ఆదేశించారు. అక్టోబర్ రెండో వారంలో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సమావేశం కావాలని నిర్ణయించారు. సమావేశ నిర్ణయాలకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులు, ఇఆర్‌ఒలు తగిన సూచనలు జారీ చేయాలని అదనపు సిఇఒకు పార్థసారధి సూచించారు.

SEC holds review meeting on GHMC elections