Home తాజా వార్తలు ముఖ్య నిర్ణయాలు?

ముఖ్య నిర్ణయాలు?

second installment of Raithu bandhu check decided date

ప్రగతి సభకు ముందు నేడు జరిగే లో కీలక సంకల్పాలు ప్రకటించే అవకాశం 

మహిళా స్వయంసహాయక బృందాలకు రుణపరిమితి పెంపు, రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీ తేదీ నిర్ణయం, గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ నుంచి రూ.10 వేల కోట్ల రుణ సదుపాయంపై చర్చ

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో జరగనుంది. ఇందుకు సాధారణ పరిపాలన శాఖ రెండు సెక్షన్లలో ఎజెండాను ఖరారు చేసింది. తొలి విభాగంలో ఆర్థిక, రెవెన్యూ, సాగునీటిపారుదల, రోడ్లు, భవనాలు, న్యాయశాఖలకు సంబంధించిన నూతన అంశాలు, ‘పార్ట్ బి’లో పలు శాఖలు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన (ర్యాటిఫికేషన్) అంశాలు ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని అంశాలు ఎజెండాగా ఉంటాయని అధికారుల సమాచారం. కొంగరకలాన్‌లో జరుగుతున్న ప్రగతి నివేదన సభకు సంబంధించిన అంశాలతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, వివిధ సెక్షన్ల ప్రజలకు ప్రభుత్వం తరఫున కొత్తగా రూపొందించనున్న సంక్షేమ పథకాలు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలకు అవసరమైన మార్పులు తదితర విధానపరమైన నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలిసింది.

మహిళా స్వయం సహాయక బృందాలకు రుణ పరిమితి పెంపు, రైతుబంధు రెండవ విడత పంపిణీని ఎప్పటి నుంచి చేపట్టాలనేదానిపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. రాష్ట్ర భూగర్భ జలవనరుల అభివృద్ధి సంస్థకుఅవసరమైన సుమారు పదివేల కోట్ల రూపాయలను గ్రామీణ విద్యుద్దీకరణ సంస్థ నుంచి రుణం రూపంలో సమకూర్చుకునే అంశంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఈ నిధులతో దేవాదుల, సీతారామ, కంతనపల్లి, ఇందిరమ్మ వరదలకాల్వ తదితర ప్రాజెక్టులకు అవసరమైన పనులకు ఖర్చుచేసే అంశంపైన కూడా చర్చ జరగనున్నట్లు తెలిసింది. అడ్వొకేట్ జనరల్ రాజీనామా ఆమోదంతో పాటు కొత్తగా నియమితులైన శివానంద ప్రసాద్ ఉత్తర్వులకు ఆమోదం, రోడ్డు భవనాలకు శాఖ అవసరాలకు మూడు వేల కోట్ల రూపాయల మేర రుణాన్ని పొందడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలిసింది.
ఆత్మగౌరవ భవన్‌లకు ఆమోదం!
వివిధ వెనకబడిన సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి చేసిన ప్రకటనకు అనుగుణంగా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. శాసనసభ, శాసనమండలి, కార్యదర్శి కార్యాలయంలో పలు పోస్టులకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. వైద్యారోగ్య శాఖలోమహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30 పడకల స్థాయికి ఆధునికీకరించడం, అరబిందో ఫార్మా కంపెనీకి ఎకరానికి పదిహేను లక్షల రూపాయల చొప్పున మెదక్ జిల్లా హత్నూర మండలంలోని బోరపట్ల గ్రామంలో స్థలాన్ని కేటాయించడం, ఉద్యోగులకు, పింఛనర్లకు కరువుభ త్యం మంజూరు, సిరిసిల్లలో నర్సింగ్ కళాశాలకు ఆమోదం, సంగారెడ్డి జిల్లాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన 32 ఎకరాల మేర స్థలం మంజూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని పెండగడప గ్రామంలో సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ ఏర్పాటుకు అనుగుణంగా 70 ఎకరాల స్థలం కేటాయింపు తదితర పలు అంశాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించిన అర్చకుల పదవీ విరమణ వయో పరిమితి పెంపు, ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లింపు, ఇమామ్, మౌజమ్‌ల భృతి పెంపు తదితర అంశాలను కూడా మంత్రివర్గం చర్చించనుంది.
మూడు హెలికాప్టర్లలో కొంగరకలాన్‌కు మంత్రులు
మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులంతా ముఖ్యమంత్రితో పాటే ప్రగతి భవన్ నుంచి కొంగరకలాన్‌కు బయలుదేరనున్నారు. ఇందుకోసం మూడు హెలికాప్టర్లను ఇప్పటికే సిద్ధంగా ఉంచినట్లు తెలిసింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానున్న ‘ప్రగతి నివేదన’లో ముఖ్యమంత్రి కెసిఆర్ నాలుగున్నరేళ్ళ ప్రగతిని వివరించనున్నారు. ఐదున్నర దశాబ్దాల సమైక్య పాలనలో సాధ్యంకాని విజయాలెన్నో నాలుగున్నరేళ్ళలోనే ఎలా సాధ్యమైందో వివరిస్తూ చిత్తశుద్ది, మనసుంటే మార్గం ఉంటుందనే సందేశాన్ని ప్రజలకు వివరించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రగతిభవన్ నుంచి మంత్రులంతా హెలికాప్టర్లలో వెళ్తున్నందున మంత్రివర్గ సమావేశం గంటకు పైగానే జరిగే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం.