Home దునియా మారుమానం పోవుడు…సులువుగనే

మారుమానం పోవుడు…సులువుగనే

Village-Panchayati

పెండ్లానికి పెనిమిటికి కల్సి ఉండుడు ఎంత సహజమో విడిపోవడం కూడా అంటే సహజమైన సంప్రదాయం ఉర్లల్ల ఉన్నది. పడని కాడ కొట్లాడుకుంట కోపాలు పెంచుకుంట ఉండుడుకంటే విడాకులు తీసుకొని ఇంకో పెండ్లి చేసికునుడు కూడా సులువుగానే ఉన్నది. ఈ కాలంల అది జటింల అయ్యింది గాని పల్లెటూర్లల్ల పని చేసుకబతికే కులాలల్ల అల్కగ అయ్యింది.పైగా అందరికీ ఆమోదం అయ్యేది. దానినే మారుమానం పోయింది అంటరు. పెండ్లి అయినంక మొగడు సక్కనోడు కాకుంటే వేదించుక తినేటోడు అయితే అత్త ఆడబిడ్డలు కల్సి వేదించుక తింటే ఆమె ఇజపుకాయిదు చేసికొని మారుమానం పోయేది. పిల్లలు అయినంక సుత పంచాయతీ అయి పిల్లలు ఎవలకు ఉండాలె.

ఆడపిల్ల అయితే ఇంత భూమి జాగ ఇయ్యాలనా?పైసలు ఇయ్యాలనా? లేదా ఇక్కన్నే ఉంచుతె పెండ్లి చేస్తరా అని కరారు చేసికొని ఇజపుకాయిదం చేసికుంటరు. ఇజపుకాయిదం అయినంక ఆమె తల్లిగారి ఇంటిమీదనే ఉండదు. తర్వాత మల్ల ఇంకొకలతోని మారుమానం పోవుడు అంటే మల్ల లగ్గం చేసికునుడు. ఈ రెండో పెండ్లి సాధారణంగా గుల్లల్ల అయితది. మల్ల పెండ్లి చేసికునే మొగ ఆయన సుత పెండ్లం లేనాయినె పెండ్లాం సచ్చిపోతెనో లేదా రకరకాల కారణాల వల్ల ఎల్లిపోతనే ఇలాంటి పెల్లిల్లు చేసికుంటరు. నిజానికి కలువనికాడ ప్రజాస్వామికంగా విడిపోవడం వల్ల ఇంకొకలతో జీవితం పంచుకోవడం ఉన్నది. పల్లెల్లో శ్రమ జీవుల ఇల్లల్లో ఉన్నదే. అయితే రానురానూ సినిమాలు, సీరియల్లు ప్రభావం వల్ల పతియే ప్రత్యక్ష దైవం అనే భావం విస్తృతం అవడంవల్ల బలవంతంగా కల్సి ఉంటుండ్రు.

అట్లనే మగోల్లకు పడిరాకపోతే ఇంకే ఏ ఇతర కారణాలవల్ల కలుస్తలేదు అనుకుంటే అవన్ని గవాయి సూపెట్టి పెద్దమనుషల్ల విడిపోవడం నడుస్తున్నదే. అట్లనే మొగడు సచ్చిపోయినంక కూడా మల్ల పెండ్లి చేసికునుడు చాలాకాలంగా పల్లెల్లో ఉన్నదే. ఈ కాలంల అట్ల చేసికుంటలేదు. పిల్లలు వీల్లవల్ల ఇంకొకలతో జీవనం ఎట్లా అనే మీమాంసలు ఇప్పుడు ఉన్నాయి కాని ఎన్కటి కాలంల పెనిమిటి లేకుంటే ఇంకొకరితో సంసారం చేసుడు ఉండే. ఈ కాలంల పెండ్లాము లేకుంటే మల్ల చేసికుంటుండ్రు. అంతకుముందు భార్యకున్న పిల్లలను సవతి తల్లి వేదించుడు. సినిమాల ప్రభావం వల్ల ఎక్కువ కన్పిస్తున్నది. వివాహ సంబంధాలు పూర్వకాలంల సులువుగా వ్యాపారాత్మక ధోరణిలో లేకపోయేది. ఇప్పుడు అంతా మాయ. పెట్టుబడి కట్నం కానుకలు ఇట్లా మానవ జీవితంలో విలువలు పురాగ నశిస్తున్నాయి.

ఊర్లల్ల ఏదైనా పెదమనుషల్ల పంచాయతీ తప్పక కావాల్సిందే. ముందు కులపెద్దలు ఉంటరు. అన్ని కులాలకు ఎవలకు వాల్లే ఉంటరు. లేదా ఊరంత కల్సి ఉమ్మడి పెద్ద మనుషులు ఉంటరు. ఏ పంచాయతీ అయినా ఇద్దరి తరుపును చెరి ఇద్దరు ముగ్గురు పెద్దలను కోరుకుంటరు. సదరుల ఇంకో పెద్దమనిషి ఉంటడు. ఆయన దగ్గర దడ్వతులు పెట్టుకుంటరు. దడ్వతు అంటే పైసలు గానీ బంగారం గానీ డిపాజిట్ చేయటం అన్నట్టు. ఆ తర్వాత ఇరువురి పెద్ద మనుషులు ఒక చింత చెట్ట కింద కూసోని ఉండగ ఇద్దరి కత చెప్పుదురు.

తర్వాత పెద్ద మనుషులు వేరువేరుగా చర్చించుకొని ఏ పంచాయతీ అయినా గదిగిట్ల ఉండాలి గది గట్ల ఉండాలెనని తీర్పు చెప్పుకుంటరు. దానికి అందరు కట్టుబడుతరు. కుటుంబ పంచాయతీలు ఆలుమగలవి, లేదా బాయిలకాడ గెట్ల పంచాయతీలు బాటల పంచాయతీలు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. ఊర్లల్ల జరిగే పంచాయతీలు ఇడుపు వాయిదాలు ఎక్కువ శాతం ప్రజాస్వామికంగానే ఉంటాయి. కులవివక్షలు లింగవివక్షలపట్ల సమాజ దృక్పథమే ఆ పెద్ద మనుషులకు ఉంటది. అయితె అందరి ఇండ్లలో ఇట్లా ఉండదు. కొన్ని పెద్దపెద్ద ఇండ్లల్ల స్త్రీలకు ఇంత స్వేచ్ఛ , ప్రజాస్వామికత ఉండకపోవచ్చు. మారుమానం పోయినంక కూడా అక్కడ ఆమెకు పిల్లలు అయితరు. అక్కడకూడా ఆ మహిళ గౌరవంగానే జీవిస్తది. కోర్టుల కంటే ఇదే సులువగా ఇవి అవుతుండేటివి.

అన్నవరం దేవేందర్, 94407 63479