Home తాజా వార్తలు బీమా సంస్థలకు రెండోసారి..

బీమా సంస్థలకు రెండోసారి..

Budget 2020

 

దీని తర్వాతే విలీన ప్రక్రియ
బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి ప్రకటించే అవకాశం

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్2020పై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీలకు రెండో దఫా మూలధన నిధిని ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఈ బీమా సంస్థల ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు గాను బడ్జెట్‌లో మూలధన నిధిని ప్రకటించడానికి ప్రభుత్వం చొరవ చూపవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెలలో అంటే 2019-20 డిసెంబర్‌లో మొదటిసారి బీమా సంస్థలు నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లకు రూ .2,500 కోట్లు మూలధనం కేంద్రం కేటాయించింది.

ఈ మూడు కంపెనీలకు ‘సాల్వెన్సీ మార్జిన్’ కోసం అదనంగా రూ.10,000 నుండి రూ.12,000 కోట్లు మూలధనం అవసరమవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై 2020 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రకటన చేయవచ్చంటున్నారు. ఈ సంస్థలకు మూలధన నిధిని ప్రభుత్వం ప్రకటించినట్లయితే ఈ సంస్థల ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు ఈ సంస్థల విలీనం కూడా ఈ మూలధనం ప్రకటన తర్వాత ఉండవచ్చని తెలుస్తోంది. అంచనాల ప్రకారం, విలీనం తరువాత ఏర్పడిన సంస్థ దేశంలో అతిపెద్ద సాధారణ బీమా సంస్థ కానుంది. దీని విలువ రూ.1.2 నుండి రూ.1.5 లక్షల కోట్లుగా ఉండొచ్చు.

2017 మార్చి 31నాటికి మూడు కంపెనీల మొత్తం బీమా ఉత్పత్తులు రూ.41,461 కోట్లతో 200 కంటే ఎక్కువ ఉండగా, మార్కెట్ వాటా 35 శాతం ఉంటుంది. ఈ మూడు సంస్థలను ఒకే సంస్థగా విలీనం చేస్తామని మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19లోనే ప్రకటించారు. అయితే ఆర్థిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల ఈ సంస్థల విలీనం జరగలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2020-21) గాను సాధారణ బడ్జెట్ 2020 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుండగా, ఆర్థిక సర్వే జనవరి 31న వస్తుంది. ఈ బడ్జెట్‌పై ప్రజల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇది సీతారామన్‌కు రెండో బడ్జెట్ అవుతుంది.

Second round of capital infusion for Public Sector Insurers