*రెండు, మూడు గ్రామాలకు ఒక్క కార్యదర్శే
*రంగారెడ్డిలో 415 పంచాయతీలకు 250 మంది
*వికారాబాద్‌లో 367 పంచాయతీలకు 142 మందే
*మేడ్చల్‌లో 77 గ్రామ పంచాయతీలకు 49 మంది
*రంగారెడ్డిలో 180, వికారాబాద్‌లో 212 కొత్త
పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
పంచాయతీలలో పాలన సవ్యంగా సాగడానికి సర్పంచ్‌లతో పాటు గ్రామ కార్యదర్శిలపై చాలా బాధ్యత ఉంటుంది. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ స్థాయిలో అన్నీ తానై నడిపించవలసిన కార్యదర్శుల కొరత మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక కార్యదర్శి ఉండటం మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో పాటు పనిభారంతో కార్యదర్శులు సైతం సతమతమవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో పాటు క్షేత్రస్థాయిలో గ్రామ అభివృద్దిలో కార్యదర్శుల పాత్ర చాలా కీలకంగా పేర్కొనవచ్చు. ప్రజల ఇబ్బందులను ఉన్నతాధికారులకు నివేదించి వాటిని పరిష్కరించడంతో పాటు స్థానికంగా అందుబాటులో ఉంటూ గ్రామంలో అభివృద్ది పనుల పర్యవేక్షణ, పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అర్హులకు అందేలా చూడటం, జనన, మరణ, కుల, ఆదాయ ధృవ పత్రాలు జారీచేయడంతో పాటు పంచాయతీలలో ఏర్పడుతున్న లేఅవుట్‌లు, నిర్మాణాల అనుమతులలో కార్యదర్శి చాలా కీలకంగా వ్యవహరించవలసి ఉంటుంది. గ్రామాలను ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకుపోయి అభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు సైతం నిధులు సమకూర్చడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టి కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసినా ఇప్పటివరకు అందుకు అనుగుణంగా కావలసిన సిబ్బందిని నియమించకపోవడంతో చాలా కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో సతమతమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 415 గ్రామ పంచాయతీలకు 250 మంది కార్యదర్శులు ఉండగా, వికారాబాద్ జిల్లాలో 367 పంచాయతీలకు గాను 142 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. మేడ్చల్ జిల్లాలో 77 గ్రామ పంచాయతీలకు 49 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. అసలే కార్యదర్శుల కొరతతో సతమతమవుతుండగా కొంత మంది సెలవుల్లో ఉండటం, మరికొంత మంది తప్పులు చేసి, వివాదాల్లో తలదూర్చి సస్పెన్షన్‌లకు గురవడంతో పంచాయతీ పాలన గాడి తప్పుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల పదవీకాలం మరో నాలుగు నెలల్లో ముగియనుండటంతో పలు గ్రామాల్లో సర్పంచ్‌లు అక్రమ లేఅవుట్‌లు, నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ అందిన కాడికి దండుకోవడంతో పాటు పంచాయతీ ఖజానా ఖాళీ చేయడానికి సైతం ప్రయత్నాలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శిలు కీలకంగా వ్యవహరించిన తరుణంగా రెండు, మూడు గ్రామ పంచాయతీలకు ఒక్క కార్యదర్శి ఉండటంతో వారికి సైతం ఉన్నతాధికారులు ఇతర పనులు చెప్పడంతో వారం రోజులకు సైతం ఒక్కసారి గ్రామాలకు రాని వారు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో చాలా మంది ఉన్నారు.
అసలే కొరత.. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు అయితే…
ప్రభుత్వం 500 జనభా ఉన్న తండాలు,అనుబంద గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్దిని పరుగులు పెట్టించడానికి ప్రయత్నాలు చేయడం మంచి పరిణామం. కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఆదే స్థాయిలో గ్రామ కార్యదర్శిలను సైతం నియమించడానికి చర్యలు చేపట్టవలసిన అవసరం చాలా వరకు ఉంది. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 415 గ్రామ పంచాయతీలకు ఉండగా అందులో ఔటర్‌లోపల గ్రామాలను నగర పంచాయతీలు, మున్సిపాలిటిలుగా మార్చనున్నారు. ఔటర్ బయట మరో 180 వరకు కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 367 గ్రామ పంచాయతీలకు అదనంగా 212 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించారు. వికారాబాద్ జిల్లా యంత్రాంగం పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే పాతవి, కొత్తవి కలిపి జిల్లాలో 579 గ్రామ పంచాయతీలు కానుండగా కార్యదర్శిలు మాత్రం 142 మంది మాత్రమే ఉండనున్నారు. మేడ్చల్ జిల్లాలో సైతం ఇలాంటి వాతావరణం కనిపిస్తున్న ఇక్కడ మెజారీటి గ్రామాలు నగర పంచాయతీలుగా మారనుండగా కొన్ని గ్రామాలు గ్రేటర్‌లో కలవనుండటంతో సమస్య ఉత్పనం అయ్యే అవకాశం తక్కువే. కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఆదే సమయంలో కార్యదర్శిల నియామకం సైతం చేపట్టడం ద్వారా పల్లెసీమలు మరింత ప్రగతి భాటలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది.