Home కలం సాహిత్యంలో కుహనా లౌకిక వాదం

సాహిత్యంలో కుహనా లౌకిక వాదం

మన సాహిత్యం వివిధ ప్రక్రియలల్లో ఎల్లలు దాటి విస్తరిస్తున్న కాలమిది. జనచైతన్యానికి దోహదపడే హక్కులకు నమోవాక్కులు చెప్పాల్సిన సందర్భమిది. సాహిత్యం చుట్టూ నిర్మితమైన నిర్భంధాలను తెంచుకుంటూ, వైయక్తిక అనుభవ వ్యక్తీకరణల మధ్య నుంచీ, సామాజిక దౌష్టాన్నో అసమానతా సంవేదననో, వ్యక్తీకరించడం చూస్తున్నాం. అట్లాగే విచ్ఛిన్నమౌతున్న మానవీయ విలువల్ని, సామాజిక సంబంధాల పతనాన్ని ప్రశ్నించడం గమనిస్తున్నాం. సాహితీ వేత్తలు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటారు. ఒకరు రాజాస్థానాన్ని కోరుకునే వారైతే రెండోవారు ప్రజాస్థానాన్ని ప్రేమించే వారు. పాలకపక్షం వహించే కవులు గౌరవంతో కూడిన సుఖభోగాలు అనుభవిస్తుంటే ప్రజల పక్షం వహించే కవుల బ్రతుకు లు బజారున పడ్డ సందర్భాలు లేకపోలేదు. మనది లౌకిక రాజ్యం. దేశంలో వున్న సర్వమతాలు సామరస్యంగా మెలగాలి. భారత రాజ్యాంగం మనకు భావస్వాతంత్య్రం, వాక్ స్వాతంత్య్రం, పత్రికాస్వాతంత్య్రం రాజ్యాంగ అధికరణ 19- ఎ 2 ద్వారా వీలుకల్పించింది. దేశ పౌరుడు ఈ అధికరణ ద్వారా నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. ఇది సాహిత్యరంగానికి దక్కిన గొప్పవరం. కుహ నా లౌకిక వాదులు, దేశ ద్రోహులు, ఈ అధికరణను దుర్వినియోగం చేస్తున్నారు. మనకు దక్కిన ఈ వరాన్ని శాపంగా మారుస్తూ భావ స్వాతంత్య్రాన్ని త్రోవతప్పిస్తున్నారు. పిచ్చిరాతలు రాస్తు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రముఖంగా కనిపించాలనుకుంటున్నారు. రాజ్యాంగంలోని 124వ నిబంధన ప్రకారం ‘దేశ అఖండతకు విఘాతం కలిగిస్తే ఆ వ్యక్తిని దేశద్రోహం క్రింద అరెస్టు చేస్తారు. అయినా మన సాహితీవేత్తలు కొంతమంది ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నట్లే నటి స్తూ కుహనా లౌకిక వాదులుగా రాతల్లో కనిపిస్తున్నారు. ఇదేమంటే పత్రికా స్వాతంత్య్రమంటారు. ప్రజాస్వామ్య విలువల్ని మంటగలుపుతారు. ప్రపంచ దేశాలన్నింటికంటే జనాభాలో అధిక శాతం యువత మన దేశంలో ఉన్నట్లు గణాంకాలు చెప్తున్నాయ్. మేధావులైన యువశాస్త్ర వేత్తలు మన దేశంలో తయారవుతున్నారు. మన దేశంలో ముడి ఖనిజాలకు కొదువ లేదు. అయినా మనం దేశాన్ని అర్థవలస దేశంగా మార్చే తీరులోనే మన పాలకులు యింకా దేశాల వెంట పరుగు లెత్తుతున్నారు. స్వయం పోషక విలువలకు స్వస్తి పలుకుతున్నారు. మనకు స్వతంత్రమొచ్చి ఇన్నేళ్లయినా సమాజాన్ని వ్యవస్థీకరించే ‘సమాజలక్షం’ దాన్ని ఆచరణలో పెట్టే మార్గం వెతికే సరైన ఆలోచనల్లోకి రాలేక పోతున్నాం. భూస్వామ్య వ్యవస్థ పట్టుకు వేలాడుతూ, అట్టడుగు వర్గాల్ని అతి తెలివిగా అణగద్రొక్కె ఆధ్యాత్మిక చింతనలు, ధర్మార్ధ కామ మోక్షాల అసలు గుట్టు రట్టు చేసే సాహిత్యం రావాల్సినంతగా రావడం లేదు. మానవ విజ్ఞానం అనంతమైనది. నిరంతరం విస్తరిస్తూ వుంటుంది. వర్తమాన విజ్ఞానపు మార్గంలో నిలబడి ముందు చూపుతో భవిష్యత్తును దర్శించే వారికి అంధకారం లోను వో సుందరమైన విజ్ఞాన దాయకమైన మార్గం కనిపిస్తోంది. వైజ్ఞానిక పరిణామాలను వాస్తవిక దృష్టితో దృక్పథంతో దర్శించే అవగాహన కలుగుతుంది.
అగ్రవర్ణాల,వర్గాల, దౌర్జన్యాలు, దాష్టికాలనుండి భూస్వామ్య పెట్టుబడి దారీ వర్గాల దోపిడీ నుంచి దమన కాండ నుండి రక్షణ పొందేందుకు, దళిత, మైనారిటీ వర్గాల అస్తిత్వాల్ని నిలబెట్టుకునేందుకు, దళిత మేధావి వర్గాలు సంఘటిత శక్తితో సాహిత్యాన్ని ఆయా విధంగా చేపట్టి అంబేద్కరిజాన్ని వో తాత్విక పునాదిగా పోరాటాలు చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా దళారిమేధావి వర్గాలు పోరాట ఉద్యమాలను నీరు కార్చడానికి తమ వంతు కృషి అక్షర రూపంలో వెలువరిస్తూనే ఉన్నారు. కాని ఇప్పటి సాహిత్యం వొక నిర్ధిష్టమైన శాస్త్రీయమైన హేతుబద్ధమైన ప్రణాళికతో ముందుకు పోవడం లేదు. ప్రపంచీకరణ ఫలితంగా అశాస్త్రీయమైన ఆలోచనలు , ఆర్థికాపేక్ష ప్రతి మనిషిలో రాక్షసకెరటమై లేస్తూ అక్రమార్జనే ధ్యేయంగా, వ్యసన జీవితమే పరమార్థంగా అన్ని రంగాల్లో అవినీతి అట్టుడికి పోతుంది.ఎందుచేతనో రానురాను సాహిత్యం పలుచ బడడమే కాకుండా సాహితీవేత్తల్లో కీర్తికండూతి చిక్కనై చీప్ ట్రిక్ (cheaptricks)తో కీర్తిని సాధించుకోవాలనే యావ పెరిగిపోతుంది. సాహిత్య పరమైన “ఎథిక్స్‌కు ఏ వైతే భిన్నంగా ఉంటాయో వాటిని పట్టుక పాకడం సాహితీ వేత్తలకు ఆనవాయితై పోయింది.
అవార్డు రివార్డుల కోసం సిగ్గువిడిచి సీనియర్స్‌ను అడ్డు పెట్టుకొని ఎగపడడం చూస్తుంటే నిస్సిగ్గుకే సిగ్గేసీ విధంగా ఉంటుంది. మనం ఏమి రాశామా? ఎంత సాహిత్యాన్ని సృష్టించామా? అది సమాజంలోకి ఎంతవరకు వెళ్లింది? ఏ మార్పును తెచ్చింది? అది సమాజానికి ఉపయోగమా?నిరూపయోగమా? తెలియకుండానే అవార్డుల కోసం ఎగబడడం, బతిమాలో భంగపోయే, అవార్డుల నిర్వాహకుల వెంటబడి వేధించి అవార్డులు సాధించడం తెలుగువారిలో పెద్ద తెగులయింది. అవార్డుల నిర్వాహకులు కూడా ఇచ్చి పుచ్చుకునే పిచ్చి ఆలోచనలతోనే కొనసాగుతున్నారు. అవార్డుల పిచ్చి ఈ విధంగా ఉంటే.. సమాజంలో ఏమి రాస్తే తన పేరు మారుమ్రోగుతుం దో అని, ఆలోచించేవారి కండూతిమరో లాగుంది. పేరు తేలిగ్గా వార్తల్లో కెక్కాలంటే కొంత విలక్షణంగా, విడ్డూరంగా , నిష్కారణంగా కొన్ని కులాలనో, మతాలనో, పని గట్టుకొని మూకుమ్మడిగా దుయ్య బడుతుంటారు. అసభ్య పదజాలంతో దూషణకు కూడా దిగుతుంటారు. సామాజిక రుగ్మతలను ఎత్తి చూపడమంటే, వైయక్తికంగా చేసే దుర్మార్గాలను దుష్టచింతనలను కాకుండా, కుల,మత రహిత నమూహాలు చేసే అక్రమాలను, దాష్టికాలను, దౌర్జన్యాలను ఎత్తి చూపడం కాకుండా, ఒక కులాన్ని, మతాన్ని పట్టుకొని దురుసు పదజాలంతో నిందించడంగా భావిస్తున్నారు. దీని వలన సామాజిక మానవ సంబంధాలకు విఘాతం కలుగుతుంది.
కుల పోరాటాలు మత పోరాటాలు తెరపైకి వస్తాయి. రాసిన కవి/ రచయిత పేరు మాత్రం ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో బహుళంగా వినిపిస్తుంటుంది. సాహితీ వేత్త రాతకు ఖండనలు, ప్రతి ఖండనలు, ఘెరావ్, ప్రతి ఘటనలతో మధ్య కొంత మంది జనం అమాయకంగా మూర్ఖంగాబలైపోతుంటారు. ఈ విధమైన రాతల మీద ప్రభుత్వం వారే తగు విధంగా విచారణ జరిపి న్యాయా న్యాయాలను విచారించి చర్యలు తీసుకోవాల్సివుంది. ప్రభుత్వయంత్రాంగం బాధిత వర్గాలు ఎంత మొరపెట్టుకున్నా మిన్న కుంటే సమాజంలో ప్రశాంతత నిష్కారణంగా లోపిస్తుంది. నేడు మనదేశంలో కొన్ని విశ్వవిద్యాలయాలు కుహనా లౌకికవాదులకు దేశద్రోహులకు అండదండలనిచ్చే నిలయాలుగా మారడమే శోచనీయమైన అంశం. పాకిస్తాన్ టెర్రరిజం మన దేశంలో పడగ విప్పి బాంబు పేలుళ్లను బాహాటంగా సృష్టించి అనేకులైన అమాయక ప్రజలను బలితీసుకుంటుంది. పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులను శిక్షిస్తుంటే మన దేశ కుహనా లౌకికవాదులు నిందితుల వర్ధంతులను జరపడం మనం చూస్తూనేవున్నాం. టెర్రరిస్టులకు మద్దతు పలుకుతూ వారి దేశభక్తిని పొగిడే వక్రీకరణ రాతలు రాయడం గమనిస్తూనే ఉన్నాం. వీరిని లౌకిక వాదులందామా?
స్వదేశంలో కుల మతాల మధ్య చిచ్చుపెట్టే కుహనా లౌకికవాదుల సాహిత్యం, పాండిత్యం, పరిశీలన, విమర్శల ముసుగులో విస్తృతిస్తుంది, వీరిని బలపరిచే, తల మీద పెట్టుక ఊరేగే కుల, మత రాజకీయ సంఘాలు కోకొల్లలుగా బయలుదేరుతున్నాయ్! కుల మతాల మధ్య ఆరని చిచ్చు రాజేస్తున్నాయి. అయినా పాలక వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లున్నాయి. సాహితీవేత్తలు ఏ సిద్ధాంతాన్ని నమ్మినా పర్వాలేదు, ఆ సిద్ధాంత మర్మాన్ని, ధర్మాన్ని విప్పి చెప్తు ఆచరణలో కనుమరుగు కాకుండా వుండాలి.
సామాజిక ఔన్నత్యాన్ని, హితాన్ని కోరే సాహిత్యం ఏ కులం, మతానికి సంబంధించిన సాహితీవేత్త రాసినా అభిమానించి అభినందించాలే గాని వాడి సామాజిక వర్గాన్ని బట్టి కుయుక్తులతో కుహనా విమర్శలు చేయరాదు. మేం నడిచిందే ప్రజాస్వామ్యం, మేం చెప్పేదే ప్రజాహితం అనుకునే కుహనా మేధావులైన సాహితీవేత్తల గుంపు దేశంలో ఎక్కువవుతుంది. వారి వక్రోక్తులే వందనీయమౌతున్నాయి. సాహిత్యంలో రసగంగలేమి,పసలేని భావావేశమై సామాజిక ఐక్యతకు విఘాతం కల్పించడం చూస్తు న్నాం. కుహనా లౌకికవాదులు అభ్యుదయ ప్రజా సాహిత్య పరంపరకు వారసులైనట్లు మెడలో మూర్చ బిళ్లలేసుక తిరుగుతుంటారు. గిరిగీచుకున్నట్లు ఒక కులాన్నో మతా న్నో టార్గెట్ చేస్తూ , పిచ్చి రాతలు రాసి తన్నుకచావమంటుంటారు. కుహనా లౌకిక వాదం వెయ్యి ముఖాలతో విస్తరిస్తుంది. జన సాహిత్యంవేషం గట్టి సమాజంలో అరాచకాన్ని ప్రోత్సహిస్తూంది. ఒక పాలసీ లేకుండా, ఒక పద్దతి లేకుండా, నిబద్దత లేకుండా, ఇష్టం వచ్చిన రాతలు రాస్తూ , వ్యష్టి స్వార్థంతో, సమిష్టికి భంగం వాటిల్లే విధంగా కుహనా లౌకిక వాదులు స్వేచ్ఛ అనే ముసుగుతో సామాజిక విధ్వంసక భావాల్ని వెల్లడిస్తున్నారు. నిజమైన లౌకికవాదులైన వారిని సాహిత్యరంగంలో గుర్తించాల్సిన బాధ్యత పాఠకలోకం మీదుంది అనేది సాహిత్య సత్యం

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
9948774243