Home తాజా వార్తలు సెక్యూరిటీ గార్డు అరెస్ట్

సెక్యూరిటీ గార్డు అరెస్ట్

నకిలీ గన్ లైసెన్స్‌తో రాష్ట్రానికి వచ్చిన నిందితుడు
బీహార్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Security guard arrest with gun

మనతెలంగాణ, సిటిబ్యూరో: నకిలీ గన్ లైసెన్స్ తీసుకుని ఎటిఎం సెంటర్ల వద్ద సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేసేందుకు వచ్చిన వ్యక్తిని నగర నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి డిబిబిఎల్( డబుల్ బ్యారెల్ గన్)ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….బీహార్ రాష్ట్రం, అర్వాల్ జిల్లా, నాగల్‌లాకింగర్, కింజర్ పోస్టు, మిర్జాపూర్ గ్రామానికి చెందిన రాజారాం సింగ్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. సొంత రాష్ట్రంలో సెక్యూరిటీ గార్డుకు తక్కువ జీతం ఇస్తున్నారు. ఇది ఇంటి ఖర్చులకు సరిపోకపోవడంతో మాజీ సైనికుడి ఎక్కువ వేతనాలు ఇస్తున్నట్లు తెలుసుకున్నాడు. చాలా ప్రైవేట్ కంపెనీలు మాజీ సైనికులకు లైసెన్స్‌డ్ గన్ ఉంటే ఎక్కువ జీతం ఇచ్చి నియమించుకుంటున్నట్లు తెలుసుకున్నాడు.

తనకు తెలిసిన సోనూ పాండే సాయంతో ఐదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి నకిలీ గన్‌లైసెన్స్‌ను తీసుకున్నాడు. గన్‌లైసెన్స్ ఇప్పించినందుకు రూ.15,000 ఇచ్చాడు. డిసిపి లక్నో, ఉత్తరప్రదేశ్ లైసెన్స్ ఇచ్చిన నట్లు కాగితాలు తయారు చేసి నిందితుడికి ఇచ్చాడు. ప్రతి ఏడాది గన్‌లైసెన్స్ రిన్యూవల్‌కు సొనుకు నిందితుడు రూ.1,500 ఇచ్చేవాడు, నకిలీ స్టాంప్ వేసి రిన్యూవల్ చేసినట్లు కాగితాలు ఇచ్చేవాడు. దానిని చూపించి నిందితుడు రూ.25,000 పెట్టి డిబిబిఎల్ గన్‌ను కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని వివిధ కంపెనీల్లో గార్డు, గన్‌మెన్, సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఐదు రోజుల క్రితం తన స్నేహితుడు చెప్పడంతో హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుకు ఎక్కువగా జీతాలు ఇస్తారని చెప్పడంతో గన్ తీసుకుని నగరానికి వచ్చాడు.

సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాజరాం సింగ్‌ను అదులోపులోకి తీసుకుని గన్ లైసెన్స్‌ను ఉత్తరప్రదేశ్ పోలీస్ అధికారుల పంపించారు. దీంతో గన్‌లైసెన్స్ పత్రాలు నకిలీవని తెలియడంతో అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం మార్కెట్ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సై పరమేశ్వర్, అశోక్ రెడ్డి, శివానందం తదితరులు పట్టుకున్నారు.