Friday, March 29, 2024

విత్తనాలు సిద్ధం!

- Advertisement -
- Advertisement -

seeds

 సన్నాలకు పెరిగిన డిమాండ్
ప్రైవేట్‌లో అధికంగా కొనుగోలు చేస్తున్న రైతులు
టిఎస్‌ఎస్‌డిసి, హాకా, ఎన్‌ఎస్‌సిలతో వరి, కందులు, సోయాబీన్ విత్తనాలు
గ్రీన్ మెన్యుర్‌తో కలిపి 4.55 లక్షల క్వింటాళ్లు ప్లాన్… అందుబాటులో 61,854 క్వింటాళ్లు
ఇప్పటి వరకు 31,682 క్వింటాళ్ల విక్రయాలు

హైదరాబాద్ : వానాకాలం సీజన్‌కు అన్ని రకాల విత్తనాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. జిల్లాల వారీగా విత్తనాభివృద్ధి సంస్థ, హాకా, జాతీయ విత్తన సంస్థల ఆధ్వర్యంలో రైతులకు అందుబాటులో ఉంచింది. ప్రధానంగా వరి, కంది, సోయాబీన్‌తో పాటు సన్‌హెంప్, పిల్లిపెసర, దయించా సబ్సిడీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలో కంటే ప్రైవేట్‌లోనే అధిక సంఖ్యలో రైతులు విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈసారి ప్రభుత్వం సన్న రకాలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని చెప్పడంతో బిపిటి 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048 (తెలంగాణ సోనా)కు క్షేత్రస్థాయిలో అధిక డిమాండ్ ఏర్పడింది.

రైతుబంధు రావాలంటే బిపిటి సాగు చేయాలని గ్రామాల్లో విపరీతంగా ప్రచారం కావడంతో చాలామంది రైతులు వాటి కొనుగోలుకే ఆసక్తి చూపిస్తున్నారని విత్తన డీలర్ ఒకరు మన తెలంగాణకు తెలిపారు. గతేడాది వానాకాలం విక్రయాలు 2.99 లక్షల క్వింటాళ్లు ఉండగా, ఈ ఆరు రకాల విత్తనాలను కలిపి మొత్తం ఈసారి 4.55 లక్షల క్వింటాళ్లు ప్లాన్ చేశారు. ఇందులో జిల్లాలకు 61,854 క్వింటాళ్లు పొజిషన్ చేయగా, 31,682 క్వింటాళ్లు విక్రయాలు జరిపారు. వరి విత్తనాల్లో రెండు వెరైటీలను అందిస్తున్నారు. అందులో తెలంగాణ సోనా ఆర్‌ఎన్‌ఆర్ 15048, బిపిటి 5204 ఉన్నాయి. మొత్తం 1.38 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను ఈ సీజన్‌కు విక్రయించాలని లక్షంగా పెట్టుకున్నారు.

గత ఖరీఫ్‌లో 58 వేల 553 వరి విత్తనాలు రైతులు కొనుగోలు చేశారు. కందులు 16,452 క్వింటాళ్లు ప్రణాళికలో పెట్టుకోగా 4917 క్వింటాళ్లు జిల్లాలకు చేరాయి. ఇందులో 568 క్వింటాళ్లు అమ్ముడుపోయాయి. ఇక సోయాబీన్ 1.45 లక్షల క్వింటాళ్లకు గాను 1636 క్వింటాళ్లు రైతులకు అందుబాటులో పెట్టారు. దైంచా 1.24 లక్షల క్వింటాళ్లకు గాను 47 వేల క్వింటాళ్లు పొజిషన్ చేయగా 25 వేల క్వింటాళ్లు విక్రయాలు జరిగాయి.

సన్‌హెంప్ 5739 క్వింటాళ్లు, పిల్లిపెసర 431 క్వింటాళ్లు రైతులు కొనుగోలు చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా నియంత్రిత ప్రతిపాదిత సాగు విస్తీర్ణం ఆధారంగా విత్తన కేటాయింపులు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా పత్తి విత్తనాలు పూర్తిగా ప్రైవేట్‌లోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సోయాబీన్‌కు అమ్మకం ధరపై 40.65 శాతం, గ్రీన్ మెన్యుర్‌లోని దైంచ, సన్‌హెంప్, పిల్లిపెసరకు 65 శాతం సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News