Home తాజా వార్తలు టీమిండియా ఎంపికపై ఉత్కంఠ

టీమిండియా ఎంపికపై ఉత్కంఠ

India

ముంబై: ప్రపంచకప్‌లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన టీమిండియా సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ భవిష్యత్తుపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రానున్న వెస్టిండీస్ సిరీస్‌కు ధోనిని ఎంపిక చేస్తారా లేదా అనేది అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది. వెస్టిండీస్ సిరీస్ కోసం త్వరలోనే జట్టును ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మరో 3 ట్వంటీ20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, టెస్టుల గుడ్‌పై చెప్పి ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్న ధోని ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేక పోయాడు. దీంతో అతన్ని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ మరోసారి ఊపందుకుంది. ఒకప్పుడూ విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే ధోని ఇటీవల కాలంలో ఆ స్థాయిలో ఆడలేక పోతున్నాడు. ధాటిగా ఆడడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. అతని ఫామ్‌పై ఆందోళన నెలకొంది. క్రీజులో చాలా సేపు నిలదొక్కుకుంటున్నా కేవలం డిఫెన్స్‌కే పరిమితమవుతున్నాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచుల్లో పరిస్థితులకు తగినట్టు వేగంగా ఆడలేక పోయాడు. దీంతో రెండు మ్యాచుల్లో కూడా జట్టుకు ఓటమి తప్పలేదు.

కివీస్‌తో జరిగిన సెమీఫైనల్ సమరంలో కీలక ఇన్నింగ్స్ ఆడినా ఒక బౌండరీ, మరో సిక్స్ మాత్రమే కొట్టాడు. ఇదే సమయంలో ధోని 70 బంతులను ఎదుర్కొవడం విశేషం. ఇన్ని బంతులు ఆడి కూడా కనీసం నాలుగైదు ఫోర్లు కూడా కొట్టక పోవడం అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగుతుందో ఊహించుకోవచ్చు. కాగా, ధోని పేలవమైన బ్యాటింగ్ నేపథ్యంలో అతని భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రపంచకప్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయమని వార్తలు వినిపించాయి. కానీ, అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. ఆటకు వీడ్కోలు పలికే అంశం గురించి ధోని ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో మరి కొంతకాలం అతను క్రికెట్‌లో కొనసాగాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే సెలెక్టర్లు అతనికి మరో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. పేలవమైన ఆటతో జట్టుకు భారంగా మారిన ధోనిని తర్వాతి సిరీస్‌లలో కొనసాగించడం సందేహంగానే కనిపిస్తోంది. కానీ, ధోని వంటి సీనియర్ ఆటగాడిని ఫామ్ పేరిట ప్రక్కన పెట్టే సాహసం ప్రస్తుతం సెలక్షన్ కమిటీ చేస్తుందనేది అనుమానమే.

ధోని వంటి స్టార్ ఆటగాడిని జట్టుకు దూరంగా ఉంచడం సెలెక్టర్లు అనుకున్నంత తేలిక కాదు. ధోని తప్పిస్తే ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొవడం ఖాయం. ఒకవేళ ఎంపిక చేస్తే కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కొక తప్పదు. దీంతో ధోని విషయంలో సెలెక్టర్లకు సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. మరోవైపు ధోని రిటైర్మెంట్‌పై నోరు విప్పడం లేదు. చాలా మంది మాజీ క్రికెటర్లు అతను తప్పుకోవడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరూ మాత్రం మరి కొన్నేళ్లపాటు భారత్ జట్టుకు ఆడాలని సూచిస్తున్నారు. ధోని వంటి సీనియర్ ఆటగాడి అవసరం జట్టుకు ఉందని వారు పేర్కొంటున్నారు.
జట్టు ఎంపిక వాయిదా?
మరోవైపు విండీస్ టూర్ కోసం శుక్రవారం టీమిండియాను ఎంపిక చేస్తారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. భారత క్రికెట్ బోర్డు కూడా శుక్రవారమే జట్టును ప్రకటిస్తామని పేర్కొంది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లి వెస్టిండీస్ పర్యటనలో ఆడతానని ప్రకటించిన నేపథ్యంలో జట్టు ఎంపికను శనివారం లేదా ఆదివారానికి వాయిదా వేసినట్టు సమాచారం. దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. కానీ, ప్రపంచకప్ ముగించుకుని కెప్టెన్ విరాట్ కోహ్లి గురువారం స్వదేశానికి వచ్చాడు. దీంతో శుక్రవారం జరగాల్సిన జట్టు ఎంపికను వాయిదా వేశారని తెలిసింది. జట్టు ఎంపికలో కోహ్లి కూడా పాల్గొనే అవకాశం ఉంది. అంతకుముందు విండీస్ సిరీస్‌కు కోహ్లితో పాటు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని బోర్డు భావించింది.
మార్పులు ఖాయం
కాగా, వెస్టిండీస్ సిరీస్ సిరీస్ కోసం ఎంపిక చేసే జట్టులో భారీ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. ప్రపంచకప్‌లో విఫలమైన ఆటగాళ్లను మార్చి కొత్త వారికి అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్‌లకు టీమిండియాలో చోటు కష్టంగా కనిపిస్తోంది. రిషబ్ పంత్‌ను కొనసాగించడం ఖాయమైనట్టే. అయితే సీనియర్ వికెట్ కీపర్ ధోనిను విశ్రాంతి పేరిట ప్రక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు. జాదవ్, కార్తీక్‌లకు మరో అవకాశం లభించడం దాదాపు అసాధ్యమే. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వీరు విఫలం కావడమే దీనికి ప్రధాన కారణం. యువ ఆటగాళ్లు పృథ్వీషా, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, నవ్‌దీప్ సైనీ తదితరులు రేసులో ఉన్నారు.

Selection of India squad for West Indies