హైదరాబాద్: ఐదు దశాబ్దాల పాటు పాత్రికేయులుగా కొనసాగిన గుర్రంకొండ శ్రీకాంత్ (79 సంవత్సరాలు) గుండె సంబంధ అనారోగ్యంతో హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. నెల్లూరు జిల్లా సీతారాంపురంలో పుట్టిన గుర్రంకొండ శ్రీకాంత్ విద్యార్థిగా ఉన్నప్పుడే విజయవాడ నుంచి (ఆంధ్ర రాష్ట్రం) వెలువడే ‘యువజన’ పత్రికకు పలు వ్యాసాలు రాశారు. పాత్రికేయ జీవితానికి పడిన ఆ పునాది ఆ తర్వాత ప్రగతిశీల భావజాలం కారణంగా విశాలాంధ్ర పత్రికలో పాత్రికేయునిగా పనిచేయడానికి దోహదపడింది. కొంతకాలం అక్కడే పనిచేసిన శ్రీకాంత్ ఆ తర్వాత సోవియట్ విప్లవం స్ఫూర్తితో అప్పటి మద్రాసు నగరం నుంచి వెలువడే ‘సోవియట్ భూమి’ పత్రికలో చేరడానికి దారితీసింది. 1970వ దశకంలో అది మూతపడేంత వరకు ఆ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపనలో శ్రీకాంత్ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన ఆహ్వానం మేరకు మద్రాసు నగరాన్ని విడిచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు రూపాయల కిలో బియ్యం పథకం గురించి ఎన్టీఆర్ అనేక కోణాల్లో శ్రీకాంత్‌తో లోతుగా చర్చించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కు రాజకీయ ప్రసంగాలను తయారుచేసే కీలక భూమిక పోషించారు. ఎన్టీఆర్‌కు చివరి ప్రసంగాన్ని రూపొందించింది కూడా శ్రీకాంతే. ఎన్టీఆర్ మరణించేంత వరకూ గండిపేటలోని కుటీరంలోనే కుటుంబంతో కలిసి ఉండేవారు.
ఆ తర్వాత ‘వార్త’ దినపత్రిక ప్రారంభమవుతున్న సందర్భంగా యాజమాన్యం విజ్ఞప్తి మేరకు జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టి సుమారు 400 మంది యువ పాత్రికేయులను తీర్చిదిద్దారు. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్నవారు ప్రస్తుతం వివిధ పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో పాత్రికేయులుగా పనిచేస్తున్నారు. పాత్రికేయుడిగా ‘జర్నలిస్టు కరదీపిక’ లాంటి పుస్తకాలతో పాటు రెండు సినీ కథలను (సిపాయి చిన్నయ్య, ఒక ఊరి కథ), ఐదు సామాజిక నవలలు (దేవుళ్ళారా మీ పేరేంటి, ప్రేమకు కత్తిపోట్లు, మనిషిలో మనీషి, గద్దల గుంపు, మదన సదనం) రాశారు. అనేక రచనలకు విమర్శకుడిగా వ్యవహరించారు. సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు, తాపీ ధర్మారావు కీర్తి పురస్కారం, మహాకవి శ్రీశ్రీ సాహిత్య పురస్కారం లాంటి డజనుకు పైగా అవార్డులను పొందారు.
Senior journalist Guramkonda Srikanth No More..!