Home తాజా వార్తలు రెండు రోజూ అదే జోష్

రెండు రోజూ అదే జోష్

Sensex

 

39,000 మార్క్‌ను దాటిన సెన్సెక్స్
రెండు రోజుల్లో 2,996 పాయింట్లు అప్
రూ.10.35 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
కొనసాగుతున్న కార్పొరేట్ పన్ను తగ్గింపు జోష్

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు రెండో రోజూ లాభాల జోరును చూపాయి. గతవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు ప్రకటన ఉత్సాహం కొనసాగుతోంది. మార్కెట్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో కేవలం రెండు రోజుల్లోనే సెన్సెక్స్ 2,996 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ కీలక 39,000 మార్క్‌ను, నిఫ్టీ 11,600 మార్క్‌ను సులభంగా దాటాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1075 పాయింట్లు(2.83 శాతం) లాభపడి 39,090 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇక నిఫ్టీ 329 పాయింట్లు పెరిగి 11,603 పాయింట్ల వద్ద స్థిరపడింది. జూలై 17 తర్వాత ఇది అత్యధిక ముగింపు స్థాయి. కార్పొరేట్ ట్యాక్స్‌ను 10 శాతం తగ్గించడంతో ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి వంటి పలు కీలక రంగాల కంపెనీలకు జోష్ వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే అత్యంత ప్రాధాన్యతనివ్వడంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 39,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇదే దూకుడును కొనసాగించింది. కార్పొరేట్ పన్ను తగ్గడం, వాటా అమ్మకాలపై పన్ను ఉపశమనం ఉత్సాహం కొనసాగుతున్నాయని విశ్లేషకులు తెలిపారు.

రెండు నెలల గరిష్టానికి
సూచీలు రెండు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. సెన్సెక్స్ శుక్రవారం 1921 పాయింట్ల లాభంతో ముగిసింది. సోమవారంతో కలిపి రెండు ట్రేడింగ్ రోజుల్లో ఇది 2,996 పాయింట్లు పెరిగింది. వరుసగా 2 సీజన్లలో ఇప్పటివరకు ఇది అతిపెద్ద లాభం. ఈ సమయంలో పెట్టుబడిదారులు రూ.10.35 లక్షల కోట్లు సంపాదించారు. బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ సోమవారం రూ.148.89 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత గురువారం రూ.138.54 లక్షల కోట్లు.

విశ్వాసాన్ని పెంచాయి: నిపుణులు
కార్పొరేట్ పన్నును తగ్గించడం కంపెనీల దృష్టిలో లాభాలను పెంచేందుకు ఉపయోగపడే విధానం అని కోటాక్ మహీంద్రా ఎఎమ్‌సి సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఈక్విటీ రీసెర్చ్ హెడ్ షిబాని కురియన్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి. ఈ వారంలో మార్కెట్ జోరు కొనసాగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కార్పొరేట్ పన్నును తగ్గించడం దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సానుకూల సందేశాన్ని పంపినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం ట్వీట్ చేశారు.

హోటల్ షేర్లు భళా
ఎన్‌ఎస్‌ఇ 11 రంగాల సూచీల్లో 9 లాభాలను ఆర్జించాయి. ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 5.64 శాతం పెరిగింది. మరోవైపు ఐటి ఇండెక్స్ 2.88 శాతం కోల్పోయింది. నిఫ్టీ దిగ్గజాలలో బిపిసిఎల్, ఎల్ అండ్ టి, బజాజ్ ఫైనాన్స్, ఐషర్, ఐఒసి, ఏసియన్ పెయింట్స్, అదానీ పోర్ట్, బజాజ్ ఫిన్‌సర్వ్ దూసుకెళ్లాయి. అయితే జి ఎంటర్‌టైన్‌మెంట్ 8 శాతం పతనంకాగా, ఇన్ఫోసిస్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, ఎన్‌టిపిసి, విప్రో, ఎయిర్‌టెల్, టిసిఎస్ క్షీణించాయి. హోటల్ రూమ్ సుంకాలపై జిఎస్‌టి రేట్ల తగ్గింపు ఈ సంస్థల షేర్లలో ఎక్కువ కొనుగోళ్లకు దారితీసింది. తాజ్ జివికె హోటల్స్ అండ్ రిసార్ట్ ఎన్‌ఎస్‌ఇలో 19 శాతం పైగా పెరిగాయి.

రాయల్ ఆర్చిడ్ హోటల్స్ స్టాక్ 14.21 శాతం లాభపడింది. భారతీయ హోటల్ స్టాక్ 7.88 శాతం జంప్ చేసింది. ఐటిసి 7.12 శాతం పెరిగింది. 1000 రూపాయల వరకు సుంకాలపై జిఎస్‌టి విధించకూడదని జిఎస్‌టి కౌన్సిల్ శుక్రవారం నిర్ణయించింది. 1001 నుండి 7500 రూపాయల వరకు సుంకాలపై 18 శాతానికి బదులు 12 శాతం, రూ .7500 కంటే ఎక్కువ సుంకాలపై 28 శాతానికి బదులు 18 శాతం జిఎస్‌టి నిర్ణయించారు. నగదు విభాగంలో వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) అమ్మకాలు ఆపి స్వల్పంగా రూ. 36 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 3001 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి.

Sensex ended at 39,090.03 points