Home తాజా వార్తలు మహా పతనం

మహా పతనం

Sensex ends 1545 pts lower, nifty near 17150

 

భారీ అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.9.56 లక్షల కోట్లు ఆవిరి
1,545 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

దేశీయ స్టాక్‌మార్కెట్లు రక్తమోడాయి. భయంతో అమ్మకాలు జరపడంతో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్లకు పైగా పతనమైంది. ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద రూ.9.56 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఇన్వెస్టర్లకు మరో బ్లాక్ మండేను మిగిల్చింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇంత భారీగా మార్కెట్లు పతనం కావడం ఇదే. అమెరికా ఫెడరల్ రిజర్వు రేట్లను పెంచవచ్చనే అంచనాలతో అనిశ్చితి నెలకొనగా, మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో పాటు రష్యా, ఉక్రెయిన్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ ఇండెక్స్, చమురు ధరల పెరుగుదల వంటివి పతనానికి కారణమయ్యాయి.

న్యూఢిల్లీ : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్‌ఇ) సెన్సెక్స్ 1,545 పాయింట్లు (2.62 శాతం) పడిపోయి 57,491 పాయింట్ల దిగువకు చేరింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 468 పాయింట్లు (2.66 శాతం) నష్టపోయి 17,149 వద్ద ముగిసింది. గత వారాంతం శుక్రవారం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.270 లక్షల కోట్లుగా ఉంది. సోమవారం ఒక్కరోజే రూ.9.56 లక్షల కోట్లు కోల్పోయి రూ. 260.44 లక్షల కోట్లకు పడిపోయింది. ఇటీవల ఐపిఒకు వచ్చిన కొత్తగా మార్కెట్లో లిస్ట్ అయిన నైకా, జొమాటో, పాలసీ బజార్, పేటీఎం వంటి కంపెనీల స్టాక్‌లు భారీగా పతనమయ్యాయి. 20 శాతం పడిపోయిన జొమాటో షేర్, నైకా 13 శాతం, పాలసీబజార్ 10 శాతం తగ్గింది. ఇక పేటీఎం స్టాక్ 6 శాతం పడిపోయింది. గత ఐదు రోజులుగా స్టాక్‌మార్కెట్లో పతనం కొనసాగుతోంది.

మార్కెట్‌లో 1,545 పాయింట్ల క్షీణత గత ఐదు రోజుల్లోనే అత్యధికం కావడం గమనార్హం. మంగళవారం 554 పాయింట్లు, బుధవారం 656, గురువారం 634, శుక్రవారం 427 పాయింట్లు పతనమైంది. సెన్సెక్స్‌లో టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ భారీగా 6 శాతం పడిపోయాయి. ఆ తర్వాత విప్రో, టెక్ మహీంద్రా, టైటాన్ షేర్లు 5 శాతానికి పైగా నష్టపోయాయి. మార్కెట్ క్యాప్ పరంగా అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 4 శాతం పడిపోగా, హెచ్‌సిఎల్ టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏసియన్ పెయింట్స్ 3.5- శాతం డౌన్ అయ్యాయి. ఇన్ఫోసిస్, ఐటిసి, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి 2 శాతం పైగా నష్టపోయాయి. ఎస్‌బిఐ, మారుతీ, టిసిఎస్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు 1.5 శాతం క్షీణించాయి. ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ మాత్రమే 1 శాతం కంటే తక్కువ పడిపోయాయి.

15,575 వద్ద ప్రారంభమైన నిఫ్టీ
సోమవారం ఉదయం నిఫ్టీ 17,575 వద్ద ప్రారంభమైంది. దాని ఎగువ స్థాయి 17,599 వద్ద, దిగువ స్థాయి 16,997 వద్ద కనిపించింది. ఆఖరికి 468 పాయింట్ల నష్టంతో 17,149 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 స్టాక్‌లలో 2 మాత్రమే లాభాల్లో ఉండగా, మిగతా 48 స్టాక్స్ నష్టపోయాయి. దీని మిడ్‌క్యాప్, బ్యాంక్, ఫైనాన్షియల్ ఇండెక్స్‌లు తగ్గాయి. జెఎస్‌డబ్లు స్టీల్, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా వంటి ప్రధాన స్టాక్‌లు నష్టాలను చవిచూశాయి. బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ 6 శాతం మేరకు నష్టపోగా, టెక్ మహీంద్రా 5 శాతం పడిపోయింది. 921 షేర్లు లోయర్ సర్క్యూట్‌లో కనిపించాయి. అయితే సెన్సెక్స్‌లో 259 స్టాక్స్ అప్పర్, 921 స్టాక్స్ లోయర్ సర్క్యూట్‌తో ముగిశాయి. అంతకుముందు శుక్రవారం సెన్సెక్స్ 427 పాయింట్లు పడిపోయి 59,037 వద్ద, నిఫ్టీ 140 పాయింట్లు పడిపోయి 17,617 వద్ద ముగిశాయి.

పతనానికి 3 ప్రధాన కారణాలు
అమెరికాలో వడ్డీ రేట్లను పెంచనున్నారనే సంకేతాలు, ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు, భారతీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు పెంచడం కొనసాగించారు. మంగళవారం నుంచి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సమావేశం ప్రారంభం కానుంది. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఫెడ్ వడ్డీరేట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటుందనే ఆశ అందరిలోనూ ఉంది. దీనిపై జనవరి 26న నిర్ణయం తీసుకోనున్నారు. అయితే రిపబ్లిక్ డే కారణంగా ఆ రోజు భారతీయ మార్కెట్లు పనిచేయవు, ఆ తర్వాత రోజు జనవరి 27న మార్కెట్లు నడుస్తాయి.