Home తాజా వార్తలు సెన్సెక్స్ @ 38,000

సెన్సెక్స్ @ 38,000

Bull

 

దూసుకెళ్తున్న ‘బుల్’.. దలాల్‌స్ట్రీట్ కళకళ 

సానుకూల పరిణామాలతో కొనుగోళ్ల వెల్లువ
11,400 పాయింట్ల మార్క్ పైకి చేరుకున్న నిఫ్టీ

ముంబై: సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దేశీయ స్టాక్‌మార్కెట్లు జోరందుకున్నాయి. శుక్రవారం కూడా అదే దూకుడును ప్రదర్శించాయి. అంతర్జాతీయంగా మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడులు, రూపాయి విలువ బలపడడం వెరసి సూచీలు పైపైకి పరుగులు తీస్తున్నాయి. శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ మళ్లీ 38 వేల మార్క్‌ను దాటింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 11,400 పాయింట్ల మార్క్ పైకి చేరింది. ఐటి, బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్ల కొనుగోళ్ల అండతో సూచీలు ఉత్సాహంగా ప్రారంభించి.. ఆఖరి వరకు అదే దూకుడును ప్రదర్శించాయి. 240 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్ కొద్దిసేపటికే 38వేల మైలురాయిని దాటింది. ఒక దశలో 420 పాయింట్లు లాభపడి 38,175 గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే ఆఖరి సమయంలో కొన్ని రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో సూచీలు కుదేలయ్యాయి. దీంతో కొంత మేరకు లాభాలు తగ్గాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 269 పాయింట్ల లాభంతో 38,024 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 11,427 వద్ద స్థిరపడింది. వరుసగా ఐదో రోజు మార్కెట్లు లాభపడ్డాయి. గత నెల 19న నమోదైన కనిష్టం 35,353 నుంచి సెన్సెక్స్ తాజాగా 2900 పాయింట్లు(8 శాతం) దూసుకెళ్లింది.

విదేశీ పెట్టుబడుల జోష్

ఇదే సమయంలో దేశీయ మూలధన మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 30,537 కోట్లను ఇన్వెస్ట్ చేయడంతో మార్కెట్లకు ఉత్సాహం పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఎన్‌ఎస్‌ఇలో బ్యాంక్ నిఫ్టీ, ఐటి 2 శాతం చొప్పున ఎగశాయి. ఎఫ్‌ఎంసిజి 1.7 శాతం క్షీణించింది. ప్రధానంగా కొటక్ బ్యాంక్, ఐఒసి, హెచ్‌పిసిఎల్, పవర్‌గ్రిడ్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్, టిసిఎస్, యుపిఎల్, గెయిల్, ఐసిఐసిఐ లాభపడ్డాయి. అయితే హెచ్‌యుఎల్, యస్‌బ్యాంక్, ఆర్‌ఐఎల్, ఐటిసి, ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్, గ్రాసిమ్, హిందాల్కో, టాటా స్టీల్, హీరో మోటో నష్టాలను చవిచూశాయి. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్ 0.55 శాతం పెరగ్గా, స్మాల్ క్యాప్ 0.4 శాతం బలహీనపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1,208 లాభపడగా, కేవలం 1,476 నష్టాలతో ముగిశాయి. నగదు విభాగంలో బుధవారం రూ. 2,722 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) గురువారం మరోసారి రూ. 1483 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.

Sensex hits 38,000 level