Home తాజా వార్తలు కొవిడ్, క్యూ4, ఎన్నికల ఫలితాలు

కొవిడ్, క్యూ4, ఎన్నికల ఫలితాలు

Sensex lost 984 points on virus spread

 

ఈ వారం మార్కెట్‌ను శాసించేవి ఇవే: నిపుణులు

ముంబై : ఈ వారం స్టాక్‌మార్కెట్‌కు ఎన్నికల ఫలితాలు, కొవిడ్ కేసులు, నాలుగో త్రైమాసిక ఫలితాలు (క్యూ4) కీలకమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్లు రేంజ్‌బౌండ్‌లో ఉండనున్నాయని అంటున్నారు. ఇన్వెస్టర్లు ఆర్థిక, రాజకీయ అంశాలను గమనించనున్నారని, తదనుగుణంగా మార్కెట్లు ఎక్కడివి అక్కడే అన్నట్టు ఉండే అవకాశముందని వారంటున్నారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు, వాటి పరిణామాలు, అలాగే కరోనా కేసుల పరిస్థితి మార్కెట్లకు కీలకం కానున్నాయి. మరోవైపు క్యూ4 ఫలితాలు ఇంకా కంపెనీలు వెల్లడించనున్నాయి. అయితే గతవారం మార్కెట్లు వరుసగా నాలుగు రోజులు లాభపడి ఆఖరి రోజు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు ఎక్కువగా మొగ్గుచూపడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఐదో రోజు 2 శాతం నష్టాలను చవిచూశాయి.

మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 984 పాయింట్లు నష్టపోయి 48,782 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 264 పాయింట్లు కోల్పోయి 14,631 పాయింట్ల వద్ద స్థిరపడింది. కరోనా వైరస్ కేసులతో పాటు మృతుల సంఖ్యా పెరగడంతో మార్కెట్లలో ఆందోళన నెలకొంది. రంగాల వారీగా చూస్తే ఫార్మా తప్ప మిగతా అన్ని సెక్టార్లలో నష్టాలు కనిపించాయి. మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లు కూడా నష్టపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టిసిఎస్, టాటా మోటార్స్, అదాని పోర్ట్, హిందాల్కో, హిందుస్తాన్ యునిలివర్ షేర్లు పతనమయ్యాయి. మరోవైపు ఒఎన్‌జిసి, కోల్ ఇండియా, దివిస్ ల్యాబ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఇండియన్ ఆయిల్, సన్‌ఫార్మా, డా.రెడ్డీస్ ల్యాబ్ షేర్లు లాభపడ్డాయి. బిఎస్‌ఇలో 1,587 షేర్లు నష్టపోగా, 1,358 షేర్లు లాభాలను చవిచూశాయి.

Sensex lost 984 points on virus spread