Home తాజా వార్తలు గాయంతో ఫైనల్ నుంచి వైదొలగిన సెరీనా విలియమ్స్

గాయంతో ఫైనల్ నుంచి వైదొలగిన సెరీనా విలియమ్స్

Serena-Williams

టొరంటో : యుఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్‌కు ముందు ఒక హార్డ్‌కోర్టు టైటిల్‌నైనా దక్కించుకోవాలన్న సెరీనా విలియమ్స్ ఆశలు గాయం కారణంగా గల్లంతయ్యాయి. టొరంటోలో జరుగుతున్న రోజర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్లో కెనడాకు చెందిన టీనేజర్ బియన్సా ఆండ్రెస్కూతో తలపడిన సెరీనా వెన్నునొప్పి కారణంగా మ్యాచ్ మొదలైన 19 నిమిషాలకే పోటీనుంచి తప్పుకోవలసి వచ్చింది. అప్పటికి సెరీనా 13 పాయింట్లతో వెనుకబడి ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు తాను ఫిట్‌గానే ఉన్నానని చెప్పిన సెరీనా హటాత్తుగా తొలి సెట్ మధ్యలో విశ్రాంతి సమయంలో కుర్చీలో కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్ది సేపటికే తాను పోటీనుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించింది. మరో రెండు వారాల్లో ప్రారంభం కానున్న యుఎస్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకొని కెరీర్‌లో 24 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్న 37 ఏళ్ల సెరీనాకు ఈ గాయం ఒక అశనిపాతమేనని చెప్పాలి. ఈ టైటిల్‌ను గెలుచుకోవాలని తాను ఎంతగానో ప్రయత్నించాను కానీ అది సాధ్యం కాలేదంటూ అతి కష్టం మీద తన అభిమానులకు సారీ చెప్పింది.

ఈ ఏడాది తనకు చాలా కఠినమైన సంవత్సరమన్న సెరీనా అయితే ప్రయాణాన్ని కొనసాగించక తప్పదని చెప్పింది. బిడ్డకు జన్మనివ్వడం కోసం గత ఏడాది చాలా రోజులు టెన్నిస్‌కు దూరంగా ఉండిన తర్వాత తిరిగి రాకెట్ పట్టిన సెరీనా ఇప్పటివరకు ఒక్క టైటిల్‌ను కూడా గెలుచుకోకపోవడం గమనార్హం. చెప్పలేనంత ఆవేదనతో కుర్చీలో కూర్చున్న సెరీనా వద్దకు వచ్చిన ఆండ్రెస్కూ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించింది. గత ఏడాదిలో చాలా రోజులు తాను కూడా గాయంతో బాధపడ్డానని, అందువల్ల ఆ బాధేమిటో తనకు తెలుసునని ట్రోఫీని అందుకున్న సందర్భంగా ఆండ్రెస్కూ చెప్పింది. గత మార్చిలో ఇండియానా వెల్స్ టోర్నమెంట్‌లో విజయంతో వార్తల్లోకెక్కిన ఆండ్రెస్కూ భుజం గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్‌నుంచి వైదొలగింది కూడా. ఆ తర్వాత ఒక టోర్నమెంటులో ఆడడం ఇదే మొదటిసారి. కాగా గత యాభై ఏళ్లలో ఒక కెనడియన్ ఈ టోర్నమెంట్‌లో గెలుపొందడం ఇదే తొలి సారి.
తిరుగులేని నాదల్
కాగా పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్ టూ , స్పెయిన్ బుల్ నాదల్ రష్యాకు చెందిన డేనియల్ మెద్వెదేవ్‌ను 6 3, 60 స్కోరుతో వరస సెట్లలో చిత్తు చేసి 35వ మాస్టర్స్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో నంబర్ వన్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్‌కన్నా రెండు టైటిళ్లు ఆధిక్యతతో నిలిచాడు. కాగా తన కెరీర్‌లో నాడల్ ఒక హార్డ్‌కోర్టు టైటిల్‌ను విజయవంతంగా తిరిగి నిలబెట్టుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. యుఎస్ ఓపెన్‌కు ముందు సన్నాహాలు మొదలుపెట్టినప్పటినుంచి నాదల్ కేవలం మూడు హార్డ్‌కోర్టు మ్యాచ్‌లే ఆడగా, మెద్వెదేవ్ చాలా మ్యాచ్‌లు ఆడాడు. అయినప్పటికీ మ్యాచ్ ప్రారంభంనుంచి విరుచుకుపడ్డ నాదల్ ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వలేదు. సెమీఫైనల్లో గేల్ మోన్‌ఫిల్స్‌తో జరగాలిన మ్యాచ్ గాయం కారణంగా ప్రత్యర్థి వైదొలగడంతో ఒక్క గేమ్ కూడా ఆడకుండానే నాదల్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. కాగా ఈ టోర్నమెంట్ ముగిసిన కొద్ది గంటలకే సోమవారంనుంచి ప్రారంభం కానున్న సిన్సినాటి మాస్టర్స్‌నుంచి వైదొలగుతున్నట్లు నాదల్ ప్రకటించాడు. అయితే యుఎస్ ఓపెన్‌కు ముందు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండడం కోసమే తాను ఈ టోర్నమెంట్‌నుంచి వైదొలగుతున్నట్లు నాదల్ చెప్పాడు.

Serena Williams withdraws from Rogers Cup final