Home తాజా వార్తలు ఆడుతూ.. పాడుతూ..

ఆడుతూ.. పాడుతూ..

fedaral

 ఫెదరర్, సెరెనా ముందుకు
 ప్లిస్కోవా ఔట్, క్వార్టర్ ఫైనల్లో ఒస్టాపెంకో, కెర్బర్

లండన్: టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) వింబుల్డన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌లో ఫెదరర్, 25వ సీడ్ సెరెనా విలియమ్స్ విజయం సాధించారు. మరోవైపు ఏడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. దీంతో మహిళల సింగిల్స్‌లో టాప్ టెన్‌లో ఉన్న అందరూ టోర్నీ నుంచి వైదొలిగారు. ఇతర పోటీల్లో 13వ ఈడ్ జూలియా జార్జెస్ (జర్మనీ), కామిలా గివోర్గి (ఇటలీ), కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్ సునాయాస విజయంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. ఫ్రాన్స్ ఆటగాడు అడ్రియన్ మన్నారినొతో జరిగిన నాలుగో రౌండ్‌లో ఫెదరర్ 60, 75, 64తో విజయం సాధించాడు. ప్రారంభం నుంచే ఫెదరర్ దూకుడుగా ఆడాడు. తొలి సెట్‌లో ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా ముందుకు సాగాడు. అయితే రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో ఫెదరర్ జయకేతనం ఎగుర వేశాడు. ఇక, మూడో సెట్‌లో ఫెదరర్‌కు ఎదురే లేకుండా పోయింది. అలవోకగా సెట్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు.
ప్లిస్కోవాకు షాక్…
ఇదిలావుండగా మహిళల సింగిల్స్‌లో మరో సంచలన ఫలితం నమోదైంది. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ పోరులో చె క్‌కు చెందిన ఏడో సీడ్ ప్లిస్కోవా ఓటమి చవిచూసింది. నెదర్లాండ్స్ క్రీడాకారిణి కికి బెర్టెన్స్‌తో జరిగిన పోరులో ప్లిస్కోవా పరాజయం పాలైంది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన బెర్టెన్స్ 63, 76తో ప్లిస్కోవాను ఓడించింది. రెండో సెట్‌లో ప్లి స్కోవా చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. బె ర్టెన్స్ అసాధారణ ఆటతో ప్లిస్కోవాను ఇంటిదారి పట్టించింది.

సెరెనా అలవోకగా…

serena
మరోవైపు మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. రష్యా క్రీడాకారిణి రొడినాతో జరిగిన నాలుగో రౌండ్‌లో సెరెనా 62, 62తో సునాయాస విజయం సాధించింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన సెరెనా ఏ దశలోనూ ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. అలవోకగా రెండు సెట్లను గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. చాలా కాలం తర్వాత సెరెనా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరో పోటీలో 12వ సీడ్ జెలినా ఒస్టాపెంకో (లాత్వియా) విజయం సాధించింది. బెలారస్ క్రీడాకారిణి సాన్సొలిస్‌తో జరిగిన పోరులో ఒస్టాపెంకో 76, 60తో జయకేతనం ఎగుర వేసింది. తొలి సెట్‌లో ఒస్టాపెంకోకు ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయితే టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో ఒస్టాపెంకో విజయం సాధించింది. ఇక, రెండో సెట్‌లో ఒస్టాపెంకోకు ఎదురే లేకుండా పోయింది. ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే సెట్‌ను గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు కామిలా గివొర్గి కూడా నాలుగో రౌండ్‌లో జయభేరి మోగించింది. రష్యా క్రీడాకారిణి ఎకటరినా మకరొవాతో జరిగిన పోటీలో కామిలా గివొర్గి 63, 64తో విజయం సాధించింది. మరో పోటీలో 13వ సీడ్ జూలియా జార్జెస్ జయకేతనం ఎగుర వేసింది. క్రొయేషియా క్రీడాకారిణి డొనా వెకిక్‌తో జరిగిన పోరులో జార్జెస్ 63, 62తో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.