రాంచీ : ప్రపంచ నెం.1 ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. సోమవారమిక్కడ జరిగిన సిరీస్ చివరి, మూడో మ్యాచ్‌లో భారత్ 3-2తో నెగ్గినా.. సిరీస్ విజేతను నిర్ణయించే షూటౌట్లో 3-2తో వెనుకబడి ఆస్ట్రేలియాకు సిరీస్‌ను అప్పగించింది. సిరీస్‌లో తొలిమ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత్ రెండోమ్యాచ్‌ను 2-1తో ఓడింది. దీంతో సిరీస్ ఆశలు మిగిలిఉండాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగిన సర్దార్‌సేన మ్యాచ్‌ను సానుకూలంగా ఆరంభించింది. తొలిక్వార్టర్లో పూర్తి రక్షణాత్మకంగా ఆడిన భారత్ రెండో క్వార్టర్ మొదలైన రెండు నిమిషాలకే ఖాతా ఆధిక్యాన్ని సాధించింది. 17వ నిమిషంలో దక్కిన పెనాల్టీని డ్రగ్ఫ్లిక్కర్ విఆర్ రఘునాథ్ గోల్‌గా మల్చాడు. దీంతో తొలి ప్రథమార్థం ముగిసే సమయానికి భారత్ 1-0తో నిలిచింది. ఇక మూడోక్వార్టర్స్ ఆరంభమైన ఆరు నిమిషాలకు ట్రెంట్ మిట్టన్(36వ) ఫీల్డ్‌గోల్‌తో స్కోరుబోర్డును ఆసీస్ సమమైంది. అయితే మరో ఐదునిమిషాలకే రూపేందర్ పాల్(41వ) పెనాల్టీని గోల్ చేయడంతో భారత్ మరోసారి 2-1తో ఆధిక్యాన్ని సాధించింది. రూపేందర్పాల్ కెరీర్లో ఇది 50వ గోల్ కావడం విశేషం. ఇక నాల్గోక్వార్టర్స్లో మిటన్ మరోసారి ఫీల్డ్‌గోల్(54వ) సాధించడంతో మ్యాచ్ డ్రా అయ్యేలా కనిపించింది. అయితే మరో పది సెకండ్లలో మ్యాచ్ ముగుస్తుందనగా ఆకాశ్‌దీప్ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 3-2తో గెలిచి సిరీస్ కోసం షూటౌట్‌కు వెళ్లింది.
విఫలమైన రాఘునాథ్ : మ్యాచ్‌లో పెనాల్టీతో భారత్‌కు తొలి అందించిన రాఘునాథ్ షూటౌట్లో మాత్రం నిరాశపరిచాడు. కచ్చితంగా గోల్ చేయాల్సిన స్థితిలో రాఘునాథ్ విఫలం కావడంతో ఆస్ట్రేలియా 3-2తో విజయం సాధించింది. అంతకుముందు షూటౌట్‌ను ఆరంభించిన ఆసీస్‌కు డానియల్ బీలె తొలిగోల్ అందించాడు. అయితే గోల్ యత్నానికి దిగిన భారత్ కెప్టెన్ సర్దార్, ఆసీస్ ప్లేయర్ మిట్టన్, భారత యువ ప్లేయర్ ఆకాశ్‌దీప్ సింగ్‌లు గోల్ చేయలేకపోయారు. ఇక మ్యాట్ గౌడెస్ గోల్‌తో ఆసీస్ 2-0తో నిలిచినా వెంటవెంటనే రూపేందర్, బీరేంద్ర లక్రా గోల్స్‌తో భారత్ స్కోరును సమంచేసింది. ఇక చివరి గోల్ ప్రయత్నానికి దిగిన ఆసీస్‌కు క్రిస్సిరెల్లో గోల్ అందించగా, రఘునాథ్ భారత్‌ను నిరాశపరిచాడు.