Home తాజా వార్తలు మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు

మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు

Set up Medical and Health Recruitment Board

మన తెలంగాణ/ హైదరాబాద్: మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ ఎస్‌ఆర్‌బి)ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలకమైన నిర్ణయం తీసుకుంది. బోర్డుకు చైర్మన్‌గా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహరిస్తారు. సభ్య కార్యదర్శిగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌ను నియమిస్తారు. సభ్యుడిగా జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారి ఉంటా రు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సహా ఇతర సిబ్బందినంతా ఈ బోర్డు ద్వారానే నియమిస్తారు. రాష్ట్రంలో ఇతర ఉద్యోగాల భర్తీకి ఎలాగైతే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ఉందో, అలాగే మెడికల్ నియామకాలకు కూడా ఈ బోర్డు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు డాక్టర్లు, నర్సులు, ఇతర పోస్టుల భర్తీని టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేసేవారు. తాజాగా మెడికల్ బోర్డును ఏర్పాటు చేయడంతో ఇక నుంచి డాక్టర్లు, నర్సులు తదితర మెడికల్ పోస్టులన్నింటినీ దీని ద్వారానే భర్తీ చేస్తారు.

వైద్య ఆరోగ్యరంగం అత్యవసరమైన విభాగం కావడంతో వాటిల్లో పోస్టులు ఖాళీ అయితే ఆ మేరకు వైద్య ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. పోస్టులను వెంటనే భర్తీ చేయకపోవడంతో వేలాది వైద్య సిబ్బంది పోస్టులు ఏళ్లుగా ఖాళీగానే ఉంటున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు మొదలు బోధనాసుపత్రుల వరకు అన్నిచోట్ల పోస్టుల మంజూరు నుంచి భర్తీ వరకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డే చూస్తుంది. రిటైర్‌మెంట్లు, ఖాళీలు ఏర్పడగానే వెంటనే సంబంధిత సమాచారం బోర్డుకు చేరుతుంది. బోర్డు ఆదేశం మేరకు వాటికి నోటిఫికేషన్ విడుదలవుతుంది. అనంతరం వాటిని బోర్డు ద్వారానే నేరుగా భర్తీ చేస్తారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న 500 కేటగిరీల పోస్టులను బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. వేగంగా పోస్టుల భర్తీ చేసేందుకే బోర్డు ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు వేగంగా అందాలంటే బోర్డు అవసరమని సర్కారు పేర్కొంది. బోర్డు కోసం వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఏదైనా కార్యాలయాన్ని కేటాయిస్తారు. బోర్డు ఛైర్మన్ తనకు అవసరమైన సిబ్బందిని నియమించుకునే అధికారం కల్పించారు.