Friday, March 29, 2024

రైతు ఉద్యమానికి ఏడు మాసాలు

- Advertisement -
- Advertisement -

Seven months to the Farmers protest

 

కేంద్రం తీసుకు వచ్చిన మూడు కొత్త వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలకు నిరసనగా దేశ రాజధాని సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఉద్యమం ఏడు మాసాలు పూర్తి చేసుకొని ఎనిమిదో నెలలో అడుగు పెట్టింది. ఢిల్లీ నగరం బయట ఘాజీపూర్, సింఘు, టిక్రి సరిహద్దుల్లో రైతులు శాశ్వత శిబిరాలు నిర్మించుకొని ఆందోళన చేస్తున్నారు. ఏడు మాసాలు పూర్తి అయిన సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లకు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఢిల్లీ సరిహద్దులు మరోసారి రైతు ఉద్యమ ఉధృతిని చవిచూశాయి. జూన్ 26ను వ్యవసాయ, ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా పాటించారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేత రాకేశ్ టికాయత్ ఘాజీపూర్ ఉద్యమ వేదిక వద్ద మీడియాతో మాట్లాడారు. జూలై 9న మరొకసారి భారీ ట్రాక్టర్ ర్యాలీని నిర్వహించదలచామని చెప్పారు. ఆ రోజున ఘాజీపూర్ వద్ద బయలుదేరి మరుసటి రోజు 10న సింఘు సరిహద్దుకు ర్యాలీ చేరుకుంటుందని ప్రకటించారు.శనివారం నాటి రైతు ప్రదర్శనను అడ్డుకోడానికి హర్యానా, ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు.

రైతు ఉత్పత్తుల వ్యాపారం, వాణిజ్యం (అభివృద్ధి, సౌకర్యాల కల్పన) చట్టం 2020, పంట ధరలకు హామీ, పొలం సేవల ఒప్పంద చట్టం 2020, నిత్యావసర సరకుల సవరణ చట్టం 2020 అనే మూడింటినీ పూర్తిగా రద్దు చేసి పంటలకు కనీస ధరను కాపాడే కొత్త చట్టాన్ని తీసుకు రావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒక్క లక్ష సాధన కోసమే మాసాల తరబడిగా వేలాది మంది రైతులు అక్కడ చలికి, ఎండకు, వానకు తట్టుకుంటూ ఉద్యమం నిర్వహిస్తూ ఉండ డం గమనించవలసిన విషయం. అంటే ప్రభుత్వం తెచ్చిన చట్టాలు మూడూ వారిలో ఎంత భయానుమానాలను కలిగించాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మూడు చట్టాల ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టి తమ కాళ్ల కింది భూమిని కదిలించి వేసి తమను ఆ రంగం నుంచి తరిమివేయాలని చూస్తున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతోనే పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రైతులు వేలాదిగా ఉద్యమం చేరారు.

ప్రస్తుతం కనీస మద్దతు ధరకు రైతుల పంటను కొంటున్న ప్రభుత్వాధ్వర్యంలోని వ్యవసాయ మార్కెట్లను (మండీలను), అక్కడి కమీషన్ ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసి ఏ ధరకైనా, దేశంలో ఎక్కడైనా ఆన్‌లైన్ ద్వారా అమ్ముకొని బాగు పడే అవకాశాన్ని ఈ చట్టాల ద్వారా కల్పించదలచామని కేంద్రం వాదిస్తున్నది. ఇవి వారి మంచి కోసమే తెచ్చినవని నమ్మబలుకుతోంది. ఈ చట్టాలకు గత ఏడాది హడావుడిగా పార్లమెంటు ఆమోదాన్ని ప్రభుత్వం పొందినప్పుడే పంజాబ్ రైతులు వాటిని వ్యతిరేకించడం ప్రారంభించారు. తమను అన్ని విధాలా ఆదుకునే కమిషన్ ఏజెంట్లను రంగం నుంచి తొలగించి పంట దిగుబడుల మీద కార్పొరేట్ గద్దలు వాలడానికే ఈ చట్టాలు ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు. దేశంలోని రైతు సంఘాలన్నీ ఈ వాదనను బలపరిచాయి. 40 సంఘాలతో కూడిన సంఘటిత రైతు ఉద్యమం రూపు దిద్దుకున్నది. ఈ నేపథ్యంలో రైతులతో మాట్లాడుతున్నామనీ, వారే సహకరించడం లేదనీ చెప్పడానికి కేంద్రం చర్చల ప్రక్రియను కూడా నడిపించింది. వారి ఏకైక డిమాండ్ అయిన మూడు చట్టాల రద్దుకు అంగీకరించకుండా కాలక్షేప సంభాషణలతో 11 సార్లు చర్చలు జరిపింది.

చర్చలకు కేంద్రం పిలిచినప్పుడల్లా రైతు నేతలు అమిత విధేయతతో హాజరయ్యారు. ప్రభుత్వం పెట్టిన భోజనాన్ని కూడా తీసుకోకుండా చర్చల్లో పాల్గొన్నారు. రైతులు నిరసిస్తున్న మూడు చట్టాలను 12 లేక 18 మాసాలు, కాదంటే రెండు సంవత్సరాల పాటు అమలు చేయకుండా సస్పెన్షన్ లో ఉంచుతానని కేంద్రం ప్రతిపాదించింది. ఆ మూడింటి రద్దు తప్ప మరేదీ తమకు అంగీకారం కాదని స్పష్టం చేసి రైతులు భీష్మించుకున్నారు. ఈ ఏడాది జనవరి 22 నాటి ఆఖరి చర్చలతో ప్రతిష్టంభన ఏర్పడింది. జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం నాడు తీసిన భారీ ట్రాక్టర్ ర్యాలీలో విచ్చిన్నకర, అసాంఘిక శక్తులు ప్రవేశించడంతో ర్యాలీ ప్రకటిత కార్యక్రమానికి విఘాతం కలిగింది. వారిలో కొంత మంది ఎర్రకోటలో ప్రవేశించి దానిపై సిక్కు మతపరమైన జెండాను ఎగుర వేశారు. ర్యాలీ క్రమంలో ట్రాక్టర్ మీద నుంచి కిందపడి ఒక రైతు చనిపోయాడు. ఆ తర్వాత ఇంత వరకు స్తబ్దంగా ఉన్న ఉద్యమం నివురు గప్పిన నిప్పునే తలపిస్తున్నది. రోజులు గడుస్తున్న కొద్దీ రైతులకు అలసట కలగడంతో విసుగు చెంది వారే ఉద్యమాన్ని విరమించుకుంటారనే కేంద్ర ప్రభుత్వ అంచనా ఇప్పటి వరకు రుజువు కాలేదు.

ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వారిపై బురద చల్లి, రకరకాల కేసులు పెట్టి, టూల్ కిట్ వంటి సరికొత్త ఆరోపణలతో వేధించినా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అందుచేత కేంద్రం ఇప్పటికైనా నిజాయితీతో పునరాలోచించి రైతుల డిమాండ్‌ను అంగీకరించడం మంచిది. కశ్మీర్ విషయంలో వైఖరిని మార్చుకున్నట్టే ఇక్కడా చేయవచ్చు. లేకపోతే భావి ఎన్నికల్లో అధికార పక్షం విజయావకాశాలు దెబ్బ తినవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News