Home తాజా వార్తలు రూ.32,020 కోట్లు పెరిగింది..

రూ.32,020 కోట్లు పెరిగింది..

HDFC Bank

 

గతవారం టాప్ 7 కంపెనీల మార్కెట్ విలువ

ముంబై : గత వారం టాప్ 10 బ్లూచిప్ కంపెనీల్లో ఏడు సంస్థలు మార్కెట్ క్యాపిటలైజేషన్(మార్కెట్ విలువ)ను పెంచుకున్నాయి. వీటిలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఆర్‌ఐఎల్ సంస్థలు అత్యంతగా లాభపడ్డాయి. ఇంకా టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌యుఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు కూడా మార్కెట్ విలువను పెంచుకోగా, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ, ఐటిసి సంస్థలు మాత్రమే నష్టపోయాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ విలువ రూ.8,270 కోట్లు పెరిగి రూ.7,02,812 కోట్లకు చేరింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ విలువ రూ.6,624 కోట్లు పెరిగి రూ.9,81,118 కోట్లకు చేరగా, మరో సంస్థ హిందుస్తాన్ యునీలివర్ మార్కెట్ విలువ రూ.5,412 కోట్లు పెరిగి రూ.4,22,950 కోట్లకు చేరింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ విలువ రూ.5,092 కోట్లు పెరిగి రూ.3,21,856 కోట్లు కాగా, మరోవైపు ఐటి దిగ్గజం టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) విలువ రూ.5,046 కోట్లు పెరిగి రూ.8,30,721 కోట్లకు చేరింది. ఐసిఐసిఐ బ్యాంక్ విలువ రూ.985 కోట్లు పెరిగి రూ.3,49,517 కోట్లు చేరగా, హెచ్‌డిఎఫ్‌సి విలువ రూ.587 పెరిగి రూ.4,25,020 కోట్లకు చేరింది.

వీటికి విరుద్ధంగా ఇన్ఫోసిస్ విషయానికొస్తే మార్కెట్ విలువ రూ.3,336 కోట్లు నష్టపోయి రూ.3,14,393 కోట్లకు చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) విలువ రూ.1,338 కోట్లు తగ్గి రూ.2,96,520 కోట్లకు చేరుకోగా, ఐటిసి విలువ రూ.553 కోట్లు పెరిగి రూ.2,92,528 కోట్లకు చేరింది. టాప్ 10 కంపెనీల ర్యాంకింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌యుఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ, ఐటిసి ఉన్నాయి. గతవారంలో సెన్సెక్స్ 135 పాయింట్లు (0.32 శాతం) లాభపడింది.

Seven of top 10 companies add Rs 32,020 cr