Home లైఫ్ స్టైల్ మార్పు రావాలి మన (సమాజం) నుంచే…!

మార్పు రావాలి మన (సమాజం) నుంచే…!

Sexual Assaults

 

పాలుతాగే శిశువు బలైంది .. పండు ముసలీ బాధితురాలైంది.. ఆడుకుంటున్న 9ఏళ్ల పసిపాప, బస్టాండులో నిలబడి ఉన్న 16 ఏళ్ల బాలిక బాధితుల లిస్టులో చేరారు. ఇవన్నీ వారం రోజుల్లో జరిగిన ఘటనలు. నిందితులు కూడా ఆకాశం నుంచి ఊడిపడలేదు పక్కింటి కుర్రాడు, ఎదురింటి పెద్దాయన, సొంత తండ్రి, బాగా పరిచయమున్న స్నేహితులు ఉంటున్నారు. ఈ సామాజిక విపత్తుకు పరిష్కారం ఏంటి..?

అమ్మాయి అంటే ఆటబొమ్మగా మాత్రమే చూసే ధోరణిని మార్చే వీలుందా? సెక్స్ కోసం జరుగుతున్న దురాగతాలను నివారించే మార్గాలేవి? కొవ్వొత్తులు వెలిగిస్తేనో, ఎన్‌కౌంటర్ చేస్తేనో, అత్యంత కఠిన శిక్ష విధిస్తేనో తీరే సమస్యా ఇది!? ఈ వికృత జబ్బును నివారించే మందు ఏది..? ప్రభుత్వాలు ఏం చెయ్యాలి, పౌరులు ఏం చెయ్యాలి? తల్లిదండ్రులు ఏం చెయ్యాలి? చర్చిద్దాం రండి.. వీలైతే మీతోపాటు మీ ఇంట్లోని ఆడపిల్లల్నీ, మగపిల్లల్నీ తీసుకురండి అంటూ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో కొంతమంది వక్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అంకురం విమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో అంకురం సంస్థ నిర్వాహకురాలు సుమిత్ర మాట్లాడుతూ… పిల్లలపై, మహిళలపై ఘోరాలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ. నేరాలు జరిగిన తర్వాత బాధపడేకంటే, నేరం జరక్కుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అన్ని జిల్లాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఎక్కువగా పనిచేయల్సి ఉంటుంది. చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మరింత అప్రమత్తం కావాలి. అనేక డిపార్ట్‌మెంట్లల్లో కోఆర్డినేషన్‌లో గ్యాప్ ఉండకుండా చూసుకోవాలి. ప్రకటనల ద్వారా చట్టాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.

బాధకీ ఓ భాష ఉండాలి -ఎన్‌సిపిసిఆర్ ప్రథమ చైర్‌పర్సన్, ప్రొ. శాంతాసిన్హా

లైంగిక దాడిని గురించి బాధితులు చెప్పుకోవడానికి భాషలేదు. దీనికో భాష కావాలి. నాకు ఇది జరిగింది అని స్పష్టంగా చెప్పగలగాలి. లోపలున్న దిగులు ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పు కోవాలో తెలియక చిన్నారులు అల్లాడుతున్నారు. ఈ నిశ్శబ్దం పోవాలి. చిన్నప్పటి నుంచే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు కచ్చితంగా అవగాహన కల్పించాలి. అంగన్‌వాడీ టీచర్లు, ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాల టీచర్లు విద్యార్థులకు ఈ విషయాలపై పాఠశాల స్థాయి నుంచే చెప్పాలి. అసలు గుడ్‌టచ్ బ్యాడ్ టచ్ అనేది పాఠ్య సిలబస్‌లో ఒక అంశంగా ఉండాలి.

పిల్లలు తమకు జరిగిన అఘాయిత్యాన్ని ఎలా చెప్పాలో తెలియక అయోమయంలో ఉంటారు. పాఠశాలల్లో పిల్లలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్కూళ్లల్లో కూడా ఉపాధ్యా యులు గిచ్చడం, తాకడం లాంటివి పిల్లలకు నచ్చదు. కానీ బయటకు చెప్పలేరు. ఆడపిల్లల్ని గౌరవించాలని మగపిల్లలకు చిన్నప్పటి నుంచే చెప్పాలి. నేర్పించాలి. ఆటల్లో కూడా జెండర్ విషయంలో వ్యత్యాసం ఉంది. ఆడపిల్లలు, మగపిల్లలు సమానమనే భావన కలిగించాల్సిన బాధ్యత తల్లి దండ్రులదే. చిన్నారులపట్ల మనమంతా మరింత జాగ్రత్తగా ఉండాలి. మీడియా బాధ్యత కూడా మరింత ఉంది.

బాధిత బాలలకు ధైర్యాన్నివ్వాలి – శ్యామలాదేవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్

చట్టాలు మరింతగా పనిచేయాల్సి ఉంది. పిల్లలకు ధైర్యాన్ని, సపోర్ట్‌ను ఇవ్వడం మనందరి బాధ్యత. చైల్డ్ ప్రొటెక్టింగ్ కమిటీలో చేరే సభ్యులకి ఈ విషయాల్లో శిక్షణ ఇస్తుంటాం. చట్టంలో కొన్ని అంశాలు మారాల్సిన అవసరం ఉంది. తమ సమస గురించి మాట్లాడాలంటేనే బాధితులు చాలా భయపడుతుంటారు. అయోమయంలో, బాధతో, భయంతో ఉంటారు. ఈలోగా నేరగాడి తరఫున వాళ్లు బెదిస్తుంటారు. తల్లిదండ్రులు కూడా మధ్యవర్తుల ద్వారా సర్దుకుపోతుంటారు. ఇలాంటప్పుడు కేసును జాప్యం చేయకూడదు. సరైన విధానంలో వెళ్లి తక్కువ సమయంలో సమస్యను పరిష్కరించాలి. లేకుంటే పిల్లలు పెద్దవాళ్లయి పోతారు. అప్పుడు మళ్లీ కాంప్లికేటెడ్ అవుతుంది. రాజకీయ ప్రలోభాలు ఇటువంటి కేసుల్లో ఎక్కువగా ఉంటాయి. పారదర్శకంగా కేసులను పరిష్కరించాలి.

ఉరిశిక్షలు సమస్యకు పరిష్కారం కాదు – కొండవీటి సత్యవతి, భూమిక ఎడిటర్

తప్పుచేసిన వారికి ఉరిశిక్షలు వేయాలంటూ చాలా మంది ఉద్యమిస్తుంటారు. కానీ సమస్యకు పరిష్కారం ఉరిశిక్షలు కావు. ఈ తప్పులన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. బండబారిన ప్రభుత్వాల చేత పనిచేయించుకోవాలి మనం. ఇంతపెద్ద ఎత్తున ఇంత దౌర్జన్యాలు జరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. రేపిస్ట్‌లను చంపుకుంటూ వెళ్లడం అనేది పరిష్కారం కాదు.

ప్రస్తుతం ప్రమాదకరమైన భావజాలం ప్రచారంలో ఉంది. ఇది దౌర్భాగ్యం. పిల్లల రక్షణకోసం ఉండాల్సిన బాలల హక్కుల కమిషన్ లేదు. ఇంత హింసలు జరుగుతున్నా అడిగే దిక్కు లేదు. ఎవర్ని అడగాలో ఏం మాట్లాడాలో తెలియడం లేదు.
ఈ మధ్య పిల్లలు సెక్స్ వీడియోలు, పోర్న్‌వీడియోలు విచ్చలవిడిగా చూస్తున్నారు. దాన్ని ఎందుకు ఆపడం లేదు. పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచీకరణ ఫలితమే ఇది. టివీలు, మొబైల్స్ ఇవన్నీ కూడా నేరాలకు ప్రధాన కారణమయ్యాయి. స్త్రీలపై హింసను ప్రేరేపిస్తున్నాయి సీరియళ్లు. ప్రజలు, ప్రభుత్వాలు, నెజివోలు అందరూ కల్సి పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో మాట్లాడాలి. అప్పుడే కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.

న్యాయం జరిగేవరకూ వెంట ఉంటాం – రుక్మిణి, షీ టీమ్స్ ఇన్‌స్పెక్టర్ 

భరోసా కేంద్రంలో మేం బాధితులతో స్నేహితుల్లా ప్రవర్తిస్తాం. పోలీస్ దుస్తుల్లో కూడా ఉండం. సివిల్ డ్రెస్‌లో ఉండి వారి బాధనంతా వింటాం. తప్పుచేసినవారికి శిక్ష పడే వరకు బాధితుల బాధ్యత మా దే. భరోసా కేంద్రం వెనుక వైపునే చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు కూడా ఉంది. మా కౌన్సెలర్లు బాధితులకు మరింత అండగా ఉంటారు. మా టీం బస్టాండ్, రైల్వే స్టేషన్‌లాంటి ప్రతి చోటా సివిల్ డ్రెస్‌లో పోకిరీలను గమనిస్తూనే ఉంటారు. ప్రజలకు మరింత అండగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటాం. నేరస్తుడికి శిక్ష పడే వరకు పోరాడతాం. బాధితుల భయాన్ని పోగొడటానికి ఎంతో ప్రయత్నిస్తాం. బాధితులకు చట్టపరంగా ఎలాంటి సలహాలైనా మా అడ్వకేట్స్ గైడ్ చేస్తారు. వంద టీంలలో ఒక టీం ఇక్కడికి వచ్చాం. మిగతావి డ్యూటీలో ఉన్నాయి.

నేరస్తులు ఎక్కువశాతం రక్త సంబంధీకులే -దేవి, సామాజిక కార్యకర్త

నేరాన్ని ఖండించడం చాలా తేలికైన విషయం. కానీ నేరాన్ని గుర్తించడం, పిల్లల మీద జరుగుతున్న లైంగిక హింసను నేరంగా పరిగణించడం ముఖ్యం. అన్ని తరగతుల్లోనూ పిల్లలపై లైంగిక హింస జరుగుతోంది. కానీ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన పిల్లలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఈ మధ్య ఓ సర్వేలో తేలింది. వందశాతంలో 37 శాతం రక్తసంబంధీకులే నేరస్తులుగా ఉంటున్నారు. పిల్లలు మన ఆస్తి అనే భావన మనలో ఉన్నంతవరకూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

ఇలాంటి జాడ్యం నుంచి బయటపడాలి. 95 శాతం మంది తెలిసినవారే పిల్లలపై ఘోరాలు చేస్తున్నారు. సమస్య గురించి మాట్లాడే ముందు దాని మూలాలు గురించి మాట్లాడాలి. ప్రతి గ్రామంలో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఉండాలి. పిల్లల గురించి శ్రద్ధ తీసుకునే బాధ్యత కుటుంబంతోపాటు ప్రభుత్వాలది కూడా. నేరాన్ని సమాజం నేరంగా గుర్తించడమే కాదు, ఆ నేరం పట్ల ఒక సమాజం ఒక సమూహంగా ప్రతిస్పందించే తీరు కూడా ఆ నేరాన్ని పెంచుతుందా, తగ్గిస్తుందా అనేదాని మీద ఆధారపడి ఉంటుంది. ఆవేదన ఉండగానే సరికాదు. భావోద్వేగాల వల్ల నేరాలు పరిష్కరించబడవు.

కుటుంబాల్లో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడుకోవాలి. పొలిటికల్ ప్రకటనల వల్ల పిల్లలకు భద్రత ఉండదు. మన దేశంలో పోర్న్ ఎందుకు నిరోధించలేకపోతున్నారో అర్థంకావట్లేదు. సింగపూర్ ఆపగలిగింది కదా. సెల్‌ఫోన్ పిల్లలు వాడుతుంటే వారిని మానిటర్ చేయలేని స్థితిలో తల్లిదండ్రులున్నారు. ఇది మన దౌర్భాగ్యం కాదా! పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవడం సమాజం, ప్రభుత్వాల మౌలిక బాధ్యత.

Sexual Assaults should be Curbed