Home జాతీయ వార్తలు బోనులో సిజెఐ

బోనులో సిజెఐ

CJI Ranjan Gogoiభారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ లైంగికంగా వేధించాడని సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని ఆరోపణ

కేసు విచారణకు గొగోయ్ సారథ్యంలో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పాటు

న్యాయవ్యవస్థకు పెనుముప్పు, ఒత్తిళ్ల మధ్య విధి నిర్వహణ కష్టం
ఆమె వెనుక నేర చరిత్ర : గొగోయ్

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ కోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు చేసిన ఆరోపణ సంచలనం రేపుతున్నది. సిట్టింగ్ జడ్జీలందరికీ ఆమె ఫిర్యాదు చేయడంతో దీని విచారణకు సుప్రీం కోర్టు గొగోయ్ సారథ్యంలో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.

న్యూఢిల్లీ: సిజెఐపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణతో అఫిడవిట్‌ను పంపించడంతో హుటాహుటిన దానిపై పరిశీలన జరిపిన ఇద్దరు న్యాయమూర్తులు ఈ బెంచ్‌ను ఏర్పాటుకు ఆదేశాలు వెలువరించారు. దీనికి ప్రధాన న్యాయమూర్తి సారథ్యం వహిస్తారని పేర్కొన్నారు. అయితే తనపైనే ఆరోపణలు రావడంతో ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాల బాధ్యతలను ఇతర న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, సంజీవ్ ఖన్నాలకు విడిచిపెడుతున్నట్లు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. సీనియర్ న్యాయమూర్తి అరుణ్ మిశ్రా దీనికి సంబంధించి ఈ మేరకు ఆదేశాలు వెలువరిస్తారని తెలిపారు. ఏ న్యాయమూర్తికి అయినా గౌరవ మర్యాదలే సర్వస్వం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ చెప్పారు.

, వీటిపై నిరాధార లైంగిక వేధింపుల ఆరోపణలు వెలువడటం బాధాకరం అన్నారు. తనపై ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలకు దిగిన అంశంతపై జస్టిస్ గొగోయ్ శనివారం తీవ్రంగా స్పందించారు. గౌరవమర్యాదలకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడితే అది న్యాయమూర్తిపై మానసికంగా దాడి జరిగినట్లే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ న్యాయమూర్తి అయినా గౌరవ మర్యాదలకు ప్రాధాన్యత ఇస్తారని, వీటిపైనే దాడి జరిగితే ఇక సచ్ఛీలుడైన ఏ వ్యక్తి కూడా న్యాయమూర్తి బాధ్యతలకు జడుసుకుంటాడని స్పష్టం చేశారు. పుణ్య పురుషులెవరూ న్యాయబాధ్యతలకు మక్కుద చూపరని అన్నారు. ‘ ఇటువంటి అనుచిత ఆరోపణల వెలువడితే ఏ జడ్జి కూడా విషయాలపై నిర్ణయం తీసుకోలేడు.

తానెందుకు ఒక నిర్ణయం తీసుకోవాలని అంటాడు. ఈ విధంగా కేసులకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తిగా నేనేమీ చేసేది ఉండ దు. జడ్జిలు విషయాన్ని తేల్చలేదని చెప్పి కేసులను వాయిదా వేయడంతో సరిపోతుంది. గౌరవ మర్యాదలనే కీలకంగా ఎంచుకునే ఏ మంచి వ్యక్తి అయినా ఇటువంటి వాటి మధ్య జడ్జిగా పనిచేసేందకు ఎందుకు ముందుకు వస్తారు’ అని జస్టిస్ రంజన్ గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రత్యేకంగా ఏర్పాటయిన విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. అంతకు ముందు మహిళ అఫిడవిట్‌ను ఇతర న్యాయమూర్తులతో కలిసి చీఫ్ జస్టిస్ పరిశీలించారు. తాను రెండు దశాబ్దాలుగా న్యాయమూర్తిగా ఉన్నానని, తన ప్రస్తుత బ్యాంకు బ్యాలెన్స్ రూ 6.80 లక్షలు అని ప్రధాన న్యాయమూర్తి తెలియచేసుకున్నారు.

ఇక గువహతిలోని తన ఇంటి మరమ్మతుకు తన కూతురు రూ 15 లక్షలు ఇచ్చిందని, తనకు రూ 40 లక్షల పిఎఫ్ ఉందని, ఇవే తన మొత్తం ఆస్తులని తెలిపారు. ఒక జడ్జిగా ఇంత తక్కువ మొత్తం ఖాతాలా అనుకోవద్దు. తాను డబ్బులతో లొంగే వ్యక్తిని కాదని, ఎవరైనా దీని గురించి తెలుసుకోవచ్చునని చెప్పారు.

నేరచరిత గల మహిళ

తనపై ఆరోపణలు చేసిన మహిళకు నేర చరిత ఉందని, ఆమెపై రెండు పోలీసు కేసులు ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. కేసులు పెండింగ్‌లో ఉన్నా ఆమె సుప్రీంకోర్టు ఉద్యోగిని కావడం విచిత్రమే అని, ఆమె భర్తపై కూడా రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆ తరువాత ఆ మహిళపై మూడో కేసు కూడా నమోదు కావడం, అరెస్టు కావడం జరిగిందని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. ఆమె నాలుగు రోజులు జైలులో ఉండి వచ్చారని, సరిగ్గా నడుచుకోవాలని పోలీసులు చాలా సార్లు హెచ్చరించారని, సుప్రీంకోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడం వంటి పలు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. సరైన విచారణ తరువాతనే ఆమెను ఉద్యోగం నుంచి తొలిగించినట్లు తనకు తెలిసిందన్నారు.

ఈ విషయాలన్నింటినీ తాను ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయ స్థాన పీఠం నుంచి చెప్పాల్సి వస్తోందని, న్యాయవ్యవస్థ స్వతంత్రత ఇప్పుడు మిక్కిలి క్లిష్టతకు గురి అయిందని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ బెయిల్ రద్దుకు ట్రయల్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారని, శనివారమే దీనిపై విచారణ ఉందని తెలిపారు. సుప్రీంకోర్టులో పనిచేసే ప్రతి ఉద్యో గి పట్ల ఆదరణ ఉంటుందని స్పష్టం చేశారు.

ఫిర్యాదీ బెయిల్ రద్దుపై విచారణ 24న

ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలకు దిగిన మహిళ బెయిల్‌ను రద్దు చేసే అంశంపై ఈ నెల 24వ తేదీన విచారణ జరుపుతామని ఢిల్లీ కోర్టు శనివారం తెలిపింది. ఆమెపై మరో కేసు నమోదు అయినందున బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై శనివారమే విచారణ జరగాల్సి ఉంది. అయితే నిందితురాలికి పోలీసుల పిటిషన్ ప్రతిని పంపించడంలో ఆలస్యం జరిగిందని, దీనితో వచ్చే బుధవారం విచారణ ఉంటుందని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మనీష్ కురానా ప్రకటించారు. ఈ మహిళ తనను అనుచరులతో కలిసి బెదిరిస్తోందని హర్యానాలోని జజ్జార్‌కు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని, ఆమెకు బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు అభ్యర్థించారు.

మితిమీరిన న్యూస్ పోర్టల్స్ : ఎజి

శనివారం నాటి ప్రత్యేక విచారణలో అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ కూడా మాట్లాడారు. ఇంతకు ముందు కూడా ఇటువంటి లైంగిక వేధింపుల ఆరోపణలే వెలువడ్డాయని, ఇందులో ఒకటి మాజీ న్యాయమూర్తిపై, మరోటి సీనియర్ న్యాయవాదిపై అని తెలిపారు. అప్పట్లో వీటి గురించి ఎటువంటి సమాచారం ప్రచురించరాదని మీడియాను కోరినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిపై వెలువడ్డ ఆరోపణలకు సంబంధించి ఫిర్యాదీ, ప్రతివాదిల పేర్లు బయటపెట్టరాదనే చట్ట నిబంధన ఉందని, అయితే దీనిని పక్కకుపెట్టి న్యూస్‌పోర్టల్స్ వారు ఆరోపణలకు ప్రాధాన్యతను ఇచ్చారని, పేర్లను కూడా తెలియచేయడం దారుణం అన్నారు. ప్రధాన న్యాయమూర్తి వివరణకు, ఆయన చెప్పినదానికి మీడియా తగు ప్రాధాన్యతను ఇస్తుందా? చూడాల్సి ఉందన్నారు.

అటార్నీ జనరల్‌గా ఉన్న తనకు న్యాయవాదుల నుంచి రకరకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయని అన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ ఇప్పటి ఉదంతం పూర్తిగా బ్లాక్‌మొయిల్ వ్యవహారం అని ఇటువంటి నీతిరీతి లేని మహిళపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా గురించి ప్రస్తావిస్తూ దర్యాప్తుల క్రమంలోనూ ఇదే ధోరణి వ్యక్తం అవుతోందని, గంటల వ్యవధిలోనే ఉన్నవి లేనివి ప్రచురించివేస్తున్నారని విమర్శించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ కేసులపై విచారణ బాధ్యత న్యాయమూర్తులపై ఉంటుందని, వారికి ఇటువంటి పరిణామాలు ఎదురుకాకూడదని అన్నారు. సరైన పద్ధతుల ప్రకారమే ఉద్యోగిని విధుల నుంచి తీసేసినట్లు, ఇప్పుడు వారు దీనిపై ఈ విధంగా గోలచేస్తున్నట్లు అనుకోవల్సి ఉంటుందన్నారు.

విచారణ ముగింపు దశలో సొలిసిటర్ జనరల్ కలుగచేసుకుని తన పేరిటనే ఫిర్యాదును తీసుకుని ఈ అంశంలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సిజెఐ స్పందిస్తూ ‘ స్వీయ నియంత్రణ పాటిస్తారా? బాధ్యతాయుతంగా ఉంటారా? లేదా అనేది మీడియాకే వదిలిపెడుదాం. ఇక ముందు అవసరమైన న్యాయ ఉత్తర్వులు దీనిపై వెలువరించాలనే అంశంపై తరువాత పరిశీలించడం జరుగుతంది’ అని చెప్పారు. దాదాపు అరగంటసేపు ఉద్విగ్నభరిత వాతావరణంలో విచారణ సాగింది.

పెద్ద వాళ్లు తప్పు చేస్తే ఒప్పుకుంటారా?
ఒప్పుకోరు.. అది సహజమే కదా..!!

సిజెఐపై మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు..ఆమె కుటుంబం పోలీసు స్టేషన్‌లో ఎదుర్కొన్న వేధింపులకు సంబంధించిన వీడియో ఫుటేజీ ‘స్క్రోల్.ఇన్’ వెబ్‌సైట్ సంపాదించింది. అందులో తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్ అధికారి ఒకరు జస్టిస్ గొగోయ్ భార్యకు క్షమాపణ చెబితే మీకు వేధింపులు అగిపోతాయి అన్న సంభాషణ వినిపిస్తోంది. దానికి మహిళా అధికారి ‘సర్ నా కుటుంబం మొత్తం ఇప్పుడు వేధింపులను ఎదుర్కొంటుంది. అంతా టెన్షన్‌లో ఉన్నారు’ అని హిందీలో మొరపెట్టుకుంది. దానికి పోలీసు అధికారి.. ‘అవును ఇలాంటి సంఘటనకు నేను కూడా సిగ్గుపడుతున్నా. ఒకవైపు నువ్వు తప్పుచేయకున్నా చాలా శిక్ష అనుభవిస్తున్నావు’ అని సమాధానమిచ్చారు. ‘పెద్ద మనిషి తప్పు చేస్తే ఎలా ఒప్పుకుంటారని అనుకుంటున్నావు’ అని మహిళా అధికారిని ఎదురు ప్రశ్నించారు. అప్పుడు మహిళా అధికారి స్పందిస్తూ… ఇది సర్వసాధారణమే కదా సర్.. ఆయన అస్సలు ఒప్పుకోరు అని సమాధానమిచ్చారు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటునారు అని పోలీసు మళ్లీ ప్రశ్నించడంతో.. చేసేదేముంది, బాధ అనుభవించాల్సిందే’ అని ఆవేదనతో చెప్పింది.

అఫిడవిట్‌లో ఆమె ఏం చెప్పారంటే…?
వేధింపుల జాబితాను ఏకరువు పెట్టిన సుప్రీం మాజీ ఉద్యోగిని

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ గతంలో తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆమె 22మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆరోపణల జాబితాను పొందుపరిచారు. 2018 అక్టోబర్ 10, 11 తేదీల్లో జస్టిస్ గొగోయ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ‘రెసిడెన్స్ ఆఫీసులోకి వెళ్లిన నన్ను అమాంతం కౌగిలించుకున్నారు. నేను ఎంత విడిపించుకుందామని ప్రయత్నిస్తున్నా చుట్టూ చేతులు వేసి నా శరీరాన్ని బలవంతంగా తడిమాడు’ అని పేర్కొంది. ఆయనకు లొంగకపోవడంతో తనను, తన కుటుంబాన్ని నానా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. దాంతో ఆగకుండా అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని అఫిడవిట్‌లో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు శనివారంనాడు సిజెఐ జస్టిస్ రంజన్ గొగోయ్(ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి), జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

అఫిడవిట్‌లో మహిళ చేసిన ఆరోపణలు ఇవీ…

ఆగస్టు 2018 లో గొగోయ్ ఆఫీసులో నియామకం అనంతరం లైంగిక వేధింపు మొదలయింది.
వేధింపులను భరించలేక, ప్రతిఘటిస్తూ అనుమతి లేకుండా ఒక రోజు సాధారణ సెలవు తీసుకున్నాను
దీన్ని కారణంగా చూపుతూ డిసెంబర్ 21 న ఉద్యోగం నుంచి తొలగించారు.
ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న నా భర్త, సోదరుడిని డిసెంబరు 28, 2018న 2012నాటి కేసు విషయంలో సస్పెన్షన్‌కు గురయ్యారు.
జనవరి 11, 2019న ప్రధాన న్యాయమూర్తి, ఒక మహిళా పోలీసు అధికారి సమక్షంలో జస్టిస్ గొగోయ్ భార్యకు క్షమాపణలు చెప్పించారు. పై అధికారి సూచన మేరకు క్షమాపణకు ఒప్పుకున్నారు.
గొగోయ్ భార్య చెప్పినట్లే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాను. అయినా వేధింపులు ఆగలేదు. టెంపరరీ జూనియర్ కోర్టు అటెండెంట్‌గా ఉన్న వికలాంగుడైన నా బంధువును స ర్వీసు నుంచి తొలగిస్తూ జనవరి 14న ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ.50వేలు తీసుకున్నానని ఆరోపిస్తూ మార్చి 9న రాజస్థాన్‌లోని తమ గ్రామానికి వెళ్లిన నన్ను, నా భర్తను ఈ కేసులో విచారించాల్సి ఉందంటూ ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆ తెల్లవారే తనతోపాటు, భర్త, మరికొందరు బంధువులను తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 24 గంటల పాటు కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి, తిండి, నీళ్లు ఇవ్వకుండా శారీరకంగా హింసించారు. అసభ్య పదజాలంతో దూషించారు.
తన భర్తకు పోలీసులు బేడీలు వేసిన విడియో ఫుటేజీని కూడా అఫిడవిట్‌లో భాగంగా ఆమె జడ్జిలకు అందజేశారు.

Sexual Harassment Allegations Against CJI Ranjan Gogoi