Home ఎడిటోరియల్ నిజం నిగ్గు తేలాలి

నిజం నిగ్గు తేలాలి

sampadakiyam

 

ముందెన్నడూ జరగనిది జరిగిపోయిందని గుండెలు బాదుకోడం కంటే జరిగినట్టు చెబుతున్నదానిలోని నిజానిజాలేమిటో అనుమానాలకు తావు లేకుండా నిగ్గు తేల్చడానికి వ్యవస్థాగతంగా మనకున్న సకల అవకాశాలను వినియోగించుకోడం మనవంటి బాధ్యతగల జాతి చేయవలసిన విజ్ఞతాయుతమైన పని. స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటి సారిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే లైంగిక వేధింపుల ఆరోపణ రావడం జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. అటువంటి స్థానంలోని వ్యక్తిపై ఇంతటి నీచమైన నిందా? అని అందరూ నోరు నొక్కుకున్నారు. సుప్రీంకోర్టులోనే పని చేసిన ఒక మహిళ రంజన్ గొగోయ్‌పై ఈ ఆరోపణ చేశారు. ఆ మేరకు మొత్తం 22 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఆమె ఫిర్యాదు చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం దానిని స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించింది. ఇంతవరకు సజావుగానే జరిగింది. అయితే తనపై వచ్చిన ఈ అసాధారణ ఆరోపణ కేసు విచారణకు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ తొలుత తన సారథ్యంలోనే ధర్మాసనాన్ని నియమించుకోడంపట్ల ప్రజాస్వామిక న్యాయకోవిదులు అభ్యంతరం తెలిపారు. అంతేకాదు ధర్మాసనం విచారణ సమయంలో గొగోయ్ ఆ మహిళపై చేసిన వ్యాఖ్యలు కూడా నిష్పాక్షిక న్యాయాన్ని ఆశించే వారిని కలచివేశాయి. ఆమె నేర చరిత్ర గల వ్యక్తి అని ఆయన అనడం ఆశ్చర్యం కలిగించింది. ఆమె గతం ఏమైనప్పటికీ తనకు జరిగిందని ఆమె అంటున్న అన్యాయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు దానిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఆ విషయానికే పరిమితమై ఉంటే బాగుండేదనే అభిప్రాయం వెల్లడయింది. అంతేకాకుండా నిందితుడైన ప్రధాన న్యాయమూర్తి ఆమె పరోక్షంలో ఆమె గతాన్ని గురించి వ్యాఖ్యానించడం అందుకు సమాధానం చెప్పుకునే అవకాశాన్ని ఆమెకు ఇవ్వకపోడం సహజ న్యాయానికి విరుద్ధమనే అభిప్రాయం కూడా వ్యక్తమయింది. గొగోయ్ అధ్యక్షతన గల ధర్మాసనం ఈ కేసును విచారించబోవడాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఖండించింది. గత సంవత్సరం అక్టోబర్ 11న గొగోయ్ తనను కౌగలించుకున్నారని తాను సహకరించలేదని ఆమె చెప్పుకున్నారు. అనంతరం తనను సిజెఐ ఆఫీసు విధుల నుంచి తప్పించారని, చివరకు ఉద్యోగం నుంచి కూడా తొలగించారని, తన భర్త, ఇద్దరు మరుదులు ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయారని, తనపై తప్పుడు కేసు పెట్టించారని ఆమె ఆరోపించినట్టు తెలిసింది. దీని వెనుక చాలా పెద్ద హస్తాలున్నాయని, న్యాయ వ్యవస్థను అప్రతిష్ఠ పాలు చేయడానికి కుట్ర పన్నారని గొగోయ్ వెలిబుచ్చిన అభిప్రాయం గమనించదగినది. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు తీసుకొన్న కొన్ని కీలక నిర్ణయాలు కేంద్ర పాలకులకు మింగుడు పడని రీతిలో ఉన్న మాట వాస్తవం. సిబిఐ, ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో సుప్రీంకోర్టు వహించిన పాత్ర వారికి బాధ కలిగించి ఉండవచ్చు. అలాగే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి తొలుత క్లీన్ చిట్ ఇచ్చి అనంతరం పునర్విచారణ అభ్యర్థనను పరిశీలనకు స్వీకరించడమూ వారికి అసంతృప్తి కలిగించి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో బలవంతులెవరైనా ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌కి బురద అంటించి న్యాయ పాలనలో ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బతీయదలచి ఈ పన్నాగానికి పాల్పడి ఉండొచ్చు. వ్యక్తిగతంగా ఆయనంటే గిట్టనివారు కూడా కుయుక్తితో ఆ మహిళను పావుగా చేసుకొని ఈ ఆరోపణను సంధించి ఉండవచ్చు. దాని లోతుపాతులు తెలుసుకోవలసి ఉన్నది. ఇటువంటి వ్యవహారాల్లో మరింత శ్రద్ధగా, జాగ్రత్తగా సత్యశోధన జరిపి వాస్తవాలు నిగ్గు తేలేలా చూడవలసిన బాధ్యత న్యాయ వ్యవస్థ పటిష్ఠత పరంగా జాతి పరువుకి సంబంధించి ఎంతైనా ఉన్నది. అయితే అందుకు అనుసరించే పద్ధతులే నిష్పాక్షికతకు పాఠం నేర్పే విధంగా ఉండి తీరాలి. భారత ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా గట్టిగా వాదిస్తే కోటిన్నర రూపాయలిస్తామని తనను ప్రలోభ పెట్టారని ఉత్సవ్ సింగ్ బెయిన్స్ అనే న్యాయవాది చేసిన సంచలన ప్రకటనలోని నిజానిజాలూ వెలికి తీయవలసి ఉంది. లైంగిక ఆరోపణ వెనుక అతిపెద్ద కుట్ర దాగి ఉన్నదని రంజన్ గొగోయ్ అంటున్నదానికి ఈ న్యాయవాది ప్రకటనకు సంబంధముందేమో తెలుసుకోవలసి ఉంది. అయితే ఈ వ్యవహారం సత్యాసత్యాలను అన్ని కోణాల్లోనూ వెలుగులోకి తేవడానికి జరిగే దర్యాప్తు, విచారణ ప్రక్రియల్లో ఆరోపణ చేసిన మహిళకు చట్టపరంగా ఇవ్వవలసిన ప్రాధాన్యత తప్పని సరిగా ఇవ్వాలి. దేశ ప్రధాన న్యాయమూర్తి పదవిలోని వ్యక్తి ఇటువంటి నేరానికి పాల్పడే అవకాశమే లేదనే ముందస్తు అభిప్రాయంతో విచారణ చేపట్టడం వల్ల న్యాయానికి హాని కలిగే ప్రమాదం ఉంది. అది దురుద్దేశంతో, కుట్రతో చేసిన ఆరోపణే అని సందేహాతీతంగా రుజువైతే అది ప్రధాన న్యాయమూర్తి ప్రతిష్ఠను పెంచి న్యాయ వ్యవస్థకు మరింత వన్నె తెస్తుంది.

Sexual harassment comments on Supreme court Judge