Home ఎడిటోరియల్ గోప్యతపై పిడుగు కొత్త ఐటి చట్టం

గోప్యతపై పిడుగు కొత్త ఐటి చట్టం

Shackles to digital media with new IT rules

 

డిజిటల్ సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే విషయం (కంటెంట్)పై పక్కా అజమాయిషీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రగాఢ ఆకాంక్ష ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ భద్రతకు, సమగ్రతకు భంగం కలిగించే కొన్ని కంటెంట్ల నివారణకే కొత్త నిబంధనలని చెబుతూ రాజ్యాం గం ప్రసాదించే వ్యక్తిగత గోప్యతకు కష్టం తెచ్చిపెట్టింది. పైగా అందరికీ సమాన అవకాశాలు గల సుతిమెత్తని (సాఫ్ట్ టచ్ ) అంచెలంచెల వ్యవస్థాగత యంత్రాంగం నెలకొల్పుతున్నట్టు గొప్పగా ప్రకటించింది. ఒక విధంగా ఈ కొత్త నిబంధనల వల్ల గోప్యత హక్కు గోల్‌మాల్ అవుతుందన్న అనుమానం కలుగుతోంది. డిజిటల్ మాధ్యమాలకే కాదు ప్రధాన స్రవంతి లోని ప్రింట్ మీడియా, ఛానెళ్లకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రింట్ మీడియాకు, ఛానెళ్లకు ఇలాంటి నిబంధనలు ఇప్పుడు అమలులో ఉండగా కొత్త ఐటి చట్టం నిబంధనలు ఎందుకు అని న్యూస్‌బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ అభ్యంతరం చెబుతోంది. స్వేచ్ఛగా ఆలోచించడం, భావాలను వ్యక్తీకరించడం ఇవన్నీ ప్రాథమిక హక్కులే. కానీ వీటిని ప్రజలకు తెలుసుకునే హక్కు పై ఐటి చట్టం లోని 66 ఎ ప్రభావితం చేస్తోందని ఆరేళ్లనాడు సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇదే చట్టం లోని 69 ఎ, 79 సెక్షన్లను కొన్ని నియంత్రణలతో అమలు చేసుకోడానికి వీలు కల్పించింది. అదే ప్రభుత్వానికి ఊతం ఇచ్చింది. 69 ఎ చట్టానికి కఠిన నిబంధనల కోరలు తొడిగి కొత్త ఐటి చట్టాన్ని తెరపైకి తెచ్చింది.

సామాజిక మాధ్యమాలను ఈ చట్రంలో ఇరికించింది. ఈమేరకు ఫిబ్రవరి 25న తనకు అనుకూలంగా ఈ ఎథిక్స్ కోడ్‌ను తెరపైకి తెచ్చింది. ఈ నిబంధనలపై ఎడిటర్స్ గిల్డ్, న్యూస్‌బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) అభ్యంతరాలు తెలిపినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తమకు ఇబ్బందికలిగించే ఏ సమాచారమైనా మీడియాలో మాత్రం కనిపించడానికి వీలులేకుండా చట్టాన్ని తయారు చేసింది. అంతేకాదు సమాచారం ఏది అర్హమైనదో, ఒక నిర్దిష్ట సమస్యపై ఏ విధంగా సరిగ్గా ఆలోచించాలో ఈ నిబంధనలు సూచిస్తాయి. అలా కాకుంటే దేశ సమగ్రతకు, భద్రతకు భంగం కలిగించే అంశాలని, ప్రభుత్వం పట్ల దురభిప్రాయం కలిగించే దేశద్రోహ కంటెంటని ప్రభుత్వం నుంచి నిషేధపు ఉత్తర్వులైనా రావచ్చు. ప్రభుత్వంపై దురభిప్రాయాన్ని కలుగజేశారన్న ఆరోపణలతో అనేక మంది పాత్రికేయులపై దేశద్రోహం (124 ఎ ) కేసులు పెట్టడం మనకు తెలిసిందే. ఇప్పుడు డిజిటల్ మీడియాకు కూడా సంకెళ్లు తొడగడానికి సిద్ధపడినా ఆశ్చర్యపోనక్కర లేదు.

కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన విపక్షాలపై, ప్రజా ఉద్యమనేతలపై ప్రభుత్వం ఎలా విరుచుకుపడుతోందో ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అనుభవమే. ఈ నేపథ్యంలో డిజిటల్ మీడియాలో గోప్యత హక్కుకు ఎంతవరకు రక్షణ కలుగుతుందో ప్రశ్నార్ధకమే. అసాంఘిక శక్తుల వేదికగా ఇంటర్నెట్ ఉపయోగపడకుండా రక్షించ గలిగే చట్టాలు ఎన్నో ఉన్నా ఇప్పుడు కొత్తగా ఎథిక్స్ కోడ్‌ను రూపొందించడంలో సర్కారు ఆంతర్యం బహిరంగ రహస్యమే. ఇలాంటి విష సమాచారానికి మూలకారకులెవరో గుర్తించగలిగే యంత్రాంగాన్ని ప్రభుత్వం రూపొందించాలని 2019 సెప్టెంబరులో ఫేస్‌బుక్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు సూచించింది. వ్యక్తుల మధ్య రహస్య సందేశాల ప్రసారాన్ని తప్పనిసరిగా తెలుసుకోడానికి అత్యుత్సాహం చూపిస్తే ప్రాథమిక హక్కు అయిన గోప్యత ప్రమాదంలో పడుతుందని కూడా సుప్రీం కోర్టు హెచ్చరించింది. వివాదాస్సద లేదా ప్రమాదకర సందేశాల మూలాలను వెతికేటప్పుడు వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వం దేశ భద్రతే పరమార్ధంగా ముందుకు వెళ్తోంది తప్ప వ్యక్తిగత గోప్యత రక్షణ గురించి ఆలోచించడం లేదు. వీటిని వాట్సాప్ వ్యతిరేకిస్తోంది.

భావస్వేచ్ఛ అనేది మనం నచ్చిన వాటికే కాదు, నచ్చని వాటికి కూడా ఉండాలని వాట్సాప్ వాదిస్తోంది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ( మధ్యంతర మార్గదర్శకాలు , డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ) నిబంధనలు 2021 అమలు లోకి రాడానికి ఒక రోజు ముందు ఈ నిబంధనలను వ్యతిరేకిస్తూ వాట్సాప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. వీటిలో ప్రత్యేకంగా ఒక దానిపైనే తన వాదన వినిపించింది. ప్రధానంగా సందేశ స్వభావం ( నేచర్ ఆఫ్ మెసేజింగ్ ) ఇందులో కంప్యూటర్‌పై మొదట సందేశం ఆరంభించిన వారిని గుర్తించ గలగడం. న్యాయపరమైన ఉత్తర్వు ద్వారా ఒత్తిడితో దీన్ని పొందగలగడం. ఇది 50 లక్షల కన్నా ఎక్కువ మంది రిజిస్టర్ వినియోగదారులున్న వాట్సాప్ వంటి పెద్ద సంస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ సర్వీస్‌కు అంటే సమాచారం పంపే వారికి, గ్రహించిన వారికే పరిమితమైన ఈ సర్వీస్‌కు భంగం కలుగుతుందని, ఇది గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని వాట్సాప్ వాదిస్తోంది.

వాట్సాప్ గోప్యత అంటే సందేశం పంపిన వారు తీసుకున్నవారు తప్ప మధ్యలో ఎవరూ సందేశాన్ని తెలుసుకోడానికి అవకాశం లేని సాంకేతిక బందోబస్తు తమ వ్యవస్థలో ఉందని వాట్సాప్ చెబుతోంది. అయితే చట్ట ప్రకారం కనిపెట్టడమన్నది కొన్ని సందర్భాల్లో ఆఖరి అస్త్రం అవుతుందని ప్రభుత్వం సమర్ధిస్తోంది. పుట్టస్వామి కమిషన్ కూడా గోప్యత హక్కుకు ఏవైనా పరిమితి విధిస్తే అది అత్యంత ఆవశ్యకమై, విచక్షణతో కూడినదై, దుర్వినియోగానికి వ్యతిరేకంగా రక్షింపగలిగినదై ఉండాలని సూచిస్తోంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఐటి చట్టం లోని సెక్షన్ 69 (3), 2009 సర్వేలెన్స్ రూల్స్ 17,13 ప్రకారం ఎన్‌క్రిప్టెడ్ డేటాతో అనుసంధానం ఏర్పర్చుకుంది. దీంతో ప్రభుత్వ సంస్థలు ఏవైనా ఎలాంటి స్పష్టమైన కారణాలు లేకుండానే చూచాయగా ఏ వినియోగదారుని తాలూకు గుర్తింపునైనా కావాలని అడగవచ్చు.

ఫలితంగా సమాచారం అందించే లేదా పంచుకునే అజ్ఞాత ఫిర్యాదుదారుల లేదా పాత్రికేయ ఆధారాల గుర్తింపు వెల్లడించడంలో రాజీపడక తప్పదు. ఇలా ఉంటే దేని మీదనైనా ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎవరైనా దాఖలు చేయగలుగుతారా ? చాట్స్‌ను కనుగొనడం అంటే పంపిన ప్రతి చిన్న మెసేజ్ తాలూకు వివరాలు కనుక్కోడానికి తమను వేలుపెట్టమనడంతో సమానం అని వాట్సాప్ చెబుతోంది. ఏదేమైనా నిబంధనలు పాటించకుంటే డిజిటల్ సామాజిక మాధ్యమాలకు ఉన్న ప్రత్యేక రక్షణలు తొలగిపోతాయని ప్రభుత్వం బెదిరిస్తూ మీడియా మెడలు వంచుతోంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఒక్కటే కొత్త నిబంధనలను పాటించడం లేదని దానికి చట్టపరమైన రక్షణ ఎత్తివేస్తూ బుధవారం ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. పైగా మతహింసను ప్రేరేపించే కంటెంట్‌ను తొలగించలేదని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌లో ట్విట్టర్‌పై కేసు కూడా నమోదయింది.

ఇప్పుడు నిబంధనల ప్రకారం ఏదైనా సందేశం మొదట ఎక్కడ నుంచి మొదలైందీ, అన్నది అధికారులతో మాధ్యమాలు పంచుకోవాలి. అలా చేస్తే గోప్యత అన్నది ఎక్కడ? పంపేవారికి స్వేచ్ఛ ఎక్కడ ? అలాగే ప్రభుత్వం అభ్యంతరకరమన్న ఏ పోస్టునైనా 36 గంటల్లోగా తొలగించక తప్పదు. ఈ విధంగా తమ పరిశీలన విచక్షణా జ్ఞానం పాటించకుండా సందేశాలను తొలగించుకుంటూ పోతే భావస్వేచ్ఛకు అర్థం ఏమిటని వాట్సాప్ ప్రశ్నిస్తోంది. అభ్యంతరాలపై ఫిర్యాదులు, దర్యాప్తులు, పోలీసుల వేధింపులు ఒక పక్క సాగుతూ ఉంటే మరోవైపు ప్రతి సంభాషణను రికార్డు చేయడం పెద్ద సమస్య. ఇలాంటి పరిస్థితులు వినియోగదారులకు సౌకర్యం కలిగిస్తాయా ? ఈ మాధ్యమాల్లో పెద్ద సంస్థలు నిబంధనలు, చట్టాలు తప్పనిసరిగా అనుసరిస్తున్నట్టు బాధ్యత వహించడానికి చీఫ్ కంప్లయెన్స్ ఆఫీసర్లను నోడల్ ఆఫీసర్‌ను నియమించ వలసి వస్తుంది.

వీరికి గ్రీవెన్స్ ఆఫీసర్‌తో ప్రమేయం లేకుండా చట్టాన్ని అమలు చేసే సంస్థలు సహకరిస్తుంటాయి. మెసేజింగ్ స్పేస్‌లో అలాంటి ప్లాట్‌ఫారాలు మొదట కంప్యూటర్ ఆధారంగా సమారారం అందించిన వ్యక్తిని న్యాయపరమైన ఆదేశాలపై గుర్తించ గలగాలి. అందువల్ల వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లకు సమస్యాత్మకమైన మెనేజ్‌లను పంపే వారిని గుర్తించే బాధ్యత తప్పనిసరి. దీనికి న్యాయపరమైన ఉత్తర్వులు తోడైతే ఒత్తిడి ఇంకా ఎక్కువవుతుంది. ఆయా యాప్‌లు తమ మెసేజ్‌లు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ అయినప్పుడు ఈ ఉత్తర్వులను ఎలా అనుసరిస్తాయన్నది ప్రశ్నార్థకం. ఈ సందర్భంగా ప్రభుత్వం 2018లో సుప్రీం కోర్టు పరిశీలనను తెరమీదకు తెస్తోంది పిల్లలపై అశ్లీల సంఘటనలు (చైల్డ్ పోర్నోగ్రఫీ) అత్యాచారం, సామూహిక మానభంగాలు వంటి దృశ్యాల చిత్రీకరణ, వీడియోలు, సైట్లు వంటివి కలిగి ఉన్న ప్లాట్‌ఫారాలను నిర్మూలించడానికి తగిన మార్గదర్శకాలు ప్రభుత్వం రూపొందించుకోవచ్చని సుప్రీం కోర్టు అభిప్రాయం వెలిబుచ్చింది. అంతేకాదు సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, బూటకపు వార్తలపై పార్లమెంటులో చర్చించాలని కూడా సుప్రీం కోర్టు ప్రభుత్వానికి సూచించింది.

ఎలెక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ 2017 లో ఏర్పాటు చేసిన డేటా ప్రొటెక్షన్ రాజ్యాంగ బద్ధ కమిటీకి నాయకత్వం వహించిన రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ బిఎన్ శ్రీక్రిష్ణ దీనిపై మాట్లాడుతూ సమాచారం పంపించే వారిని గుర్తించాలన్న డిమాండ్ ప్రాథమిక హక్కు అయిన గోప్యత మార్గం లోకి ప్రవేశించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక నుంచి సోషల్ మీడియా ఉన్నంతవరకు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే సాధనంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని దుష్టులుగా చిత్రించడానికి ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ముఖ్యంగా కొత్త నిబంధనల్లో పేర్కొన్నట్టు ఆయా వ్యక్తులను గుర్తించడం పెద్ద సమస్యే. ఎందుకంటే దీనిపై సాంకేతిక సాహిత్యం విశ్వవ్యాప్తమైనది. దీనికి అంగీకరించడమంటే వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారాలను వినియోగించేవారందరి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ వినియోగానికి భంగం కలిగించడమే. వాస్తవానికి డిజిటల్ ఎకానమీకి ఎండ్ టుఎండ్ ఎన్‌క్రిప్షన్ చాలా అవసరం. భారత్‌లో డేటా చోరీ,హ్యాకింగ్, యూజర్ డేటాను ప్లాట్‌ఫారాలు దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కారణాల దృష్టా యూజర్ నియంత్రిత ఎన్‌క్రిప్షన్ భద్రంగా ఉండేలా ప్రోత్సహించడం చాలా అవసరమని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ కి చెందిన టెక్నాలజీ పాలసీ రీసెర్చర్ రిషబ్ బెయిలీ అభిప్రాయం వెలిబుచ్చారు.