గాంధీనగర్‌లో ఐదు అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య
ఎసిబి విచారణ ఎదుర్కొంటున్న సుజాత
అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యుల ఆరోపణ
మన తెలంగాణ/ముషీరాబాద్/సిటిబ్యూరో : షేక్‌పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్‌కుమార్(47) బుధవారం తెల్లవారుజామున ఐదు అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిక్కడపల్లిలోని తన చెల్లెలు ఇంటికి వెళ్ళిన అజయ్‌కుమార్ భవనం పైనుంచి దూకాడు. తీవ్రంగా గాయపడడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిక్కడపల్లి పోలీసుల కథనం మేరకు.. షేక్‌పేట తహసీల్దార్ సుజాతను బంజారాహిల్స్‌లోని భూ వివాదం కేసులో ఇటీవల అవినీతి నరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
సుజాత భర్త అజయ్‌కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. భార్య కేసులో అజయ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారణ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ ఆత్మహత్యలకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిక్కడపల్లి సిఐ పాలడుగు శివశంకరరావు, డిఐ ప్రభాకర్, ఎస్‌ఐలు బాల్‌రాజ్, ప్రేమ్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అజయ్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.
వేధింపుల వల్లే అజయ్‌కుమార్ ఆత్మహత్య: సోదరి గోకా మంగళ
తహసీల్దార్ సుజాత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడకపోయినా ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారని మృతుడు అజయ్‌కుమార్ సోదరి గోకా మంగళ ఆరోపించారు. తమ సోదరుడి పాత్ర కూడా ఉన్నట్లుగా అనుమానిస్తూ ఎసిబి అధికారులు వేధింపులకు గురిచేశారని, ఈ కారణంగానే అజయ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. సుజాత ఇంట్లో రూ. 24 లక్షలు దొరికితే రూ. 30లక్షలు అని ఎసిబి అధికారులు ప్రచారం చేశారని ఆరోపించారు. తమ సోదరుడికి మంగళవారం ఎసిబి అధికారులు మూడు సార్లు ఫోన్ చేశారని తెలిపారు. తాను డిప్రెషన్‌లో ఉన్నానని తెలిపినా వారు వినలేదని చెప్పారు. ఎసిబి అధికారుల వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డారని వాపోయింది.
తహసీల్దార్ సుజాతకు బెయిల్ మంజూరు
అవినీతి కేసులో అరెస్టుయిన షేక్‌పేట తహసీల్దార్ సుజాతకు ఎసిబి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సుజాత భర్త ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు అభ్యర్థన మేరకు కోర్టు 21 రోజులు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశించింది. చంచల్‌గూడ మహిళా జైలులో ఉన్న సుజాత బెయిల్‌పై బయటికి వచ్చారు.