Home Breaking News తక్షణ శిక్షలు

తక్షణ శిక్షలు

Rajya Sabha

 

హత్యాచారులకు వేంటే శాస్రతి జరగాలి

కఠిన చట్టం తీసుకొద్దాం

విచారణ, శిక్షల అమలుకు గడువుండాలి
దిశ నిందితులను తక్షణమే ఉరితీయాలి
యావద్దేశం తలదించుకునే ఘటన
నిర్భయకు న్యాయం జరిగిందా?
పటిష్టమైన చట్టానికి ఏకాభిప్రాయం రావాలి
శంషాబాద్ ఘటనను ముక్తకంఠంతో ఖండించిన పార్లమెంట్ ఉభయ సభలు
మహిళా ఎంపిల భావోద్వేగం
సమస్యను మూలాల నుంచి పెకిలించేందుకు సమాజం ముందుండాలి
ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది : రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు
చట్టాల సవరణకు మేం సిద్ధంగా ఉన్నాం : లోక్‌సభలో మంత్రులు రాజ్‌నాథ్,

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని శంషాబాద్ లో దిశ హత్యాచార ఘటనపై పార్లమెంట్ మండిపడింది. ఉభయసభలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. తక్షణమే నిందితులను ఉరితీయాలని సభ్యులు డిమా ండ్ చేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు కఠి న చట్టాలు తీసుకురావాలని సూచించారు. కేసుల విచారణ ఫలానా సమయానికి ప క్కాగా ముగిసి శిక్షలు అమలయ్యేలా నిబంధనలు తీసుకురావాలని సభ్యుల నుంచి డిమాండ్లు వచ్చాయి. మహిళలు, చిన్నారుల భద్రతతో పాటు దిశ ఘటనపై పార్టీలకతీతంగా ఆందోళన వ్యక్తం చేశారు.

సోమవారంనాడు పార్లమెంట్ ఎగువ, దిగువసభల్లో జరిగిన చర్చలలో దోషులకు కఠిన శిక్ష విధించాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో మార్పులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ హైదరాబాద్‌లో జరిగిన దిశ హత్య కేసు భారతీయ సమాజానికి, మన వ్యవస్థకు తీవ్ర అవమానమన్నారు. ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయో, వీటి పరిష్కార చర్యల కోసం మనం ఏదో ఒకటి చేయాలన్నారు. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం చట్టాల వల్ల బాధితులకు న్యాయం జరగదని, ప్రజల్లో కూడా మార్పు రావాలన్నారు.

హైదరాబాద్ లోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసిందని, చట్టాలు చేయడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాదన్నారు. సమస్యను మూలాల నుంచి తొలగించడానికి సమాజం నిలబడాలన్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితులకు శిక్షపడాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఇంతకన్నా అమానవీయ ఘటన మరొకటి ఉండదని రాజ్‌నాథ్ అన్నారు. ఈ సంఘటన యావత్ దేశం తలదించుకునేలా చేసిందన్నారు.

మహిళలపై ఈ తరహా ఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలు తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు సభ ఏకాభిప్రాయంతో ముందుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దిశ సంఘటన భారతదేశాన్ని మొత్తం కలిచివేసిందన్నారు. దోషులకు కఠిన శిక్షలు పడాల్సిన అవసరం ఉందన్నారు. నిర్భయ చట్టం తెచ్చిన తర్వాత ఇలాంటి క్రూరమైన ఘటనలు తగ్గుతాయని భావించినప్పటికీ దేశంలో అడపాదడపా ఘోరాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయని రాజ్‌నాథ్ అన్నారు. సభ మొత్తం దీనిపై కూలంకషంగా చర్చించి ఎలాంటి చట్టం తీసుకురావాలని నిర్ణయిస్తుందో ఆ చట్టాన్ని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

చట్ట సవరణకు మేం రెడీ : కిషన్‌రెడ్డి
హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఘటనల్లో పోలీసులు ఇంకాస్త మెరుగ్గా వ్యవహారించాల్సి ఉందన్నారు. నిర్భయ ఘటనలో కనీసం శవమైనా తల్లిదండ్రులు చూసుకోగలిగారని, కానీ దిశ ఘటనలో ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఎదురైనపుడు వెంటనే పోలీసులను అప్రమత్తం చేసేలా 112 నంబరు ఇచ్చామన్నారు. మోడీ సర్కారు మహిళల రక్షణ విషయంలోనూ నిబద్ధతతో ఉందన్నారు. దిశ నిందితులకు కఠిన శిక్షలు పడాలని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా చట్టానికి సవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతకుముందు రాజ్యసభలో విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తూ చైర్మన్ వెంకయ్యనాయుడు స్వల్పకాలిక చర్చకు అనుమతిచ్చారు.

చర్యలకు వెనకాడొద్దు : గులాంనబీ ఆజాద్
విపక్షనేత గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ దిశ ఘటన కలిచివేసిందన్నారు. కులం, మతం పట్టింపుల్లేకుండా దోషులపై కఠిన చర్యలకు వెనకాడరాదన్నారు. సమాజం ఇలాంటి ఘటనలు చూసి సిగ్గుపడుతుందన్నారు. ఇలాంటి సమస్యకు సమాజమే మంచి పరిష్కారం కనుగొనాలని ఆజాద్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసులను గడువు విధించుకొని ఆలోగా విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష అమలయ్యేలా చూడాలని కాంగ్రెస్ సభ్యులు అలీఖాన్, ఆప్ ఎంపి సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. శంషాబాద్ ఘటనలో కేసు ఎవరికి పరిధిలోకి వస్తుందన్న విషయంపై ఆలస్యం జరిగిందని టిడిపి సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. దీంతో బాధితురాలికి త్వరితగతిన సాయం అందలేకపోయిందన్నారు. ఇలాంటి ఘటనల్లో నిందితులకు ఉరిశిక్ష వేయాలని బిజెపి సభ్యుడు అమర్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు.

గళం విప్పిన మహిళా ఎంపిలు
ఘోరమైన నేరానికి పాల్పడిన ఈ నలుగురు నిందితులకు కఠిన శిక్ష విధించాలని రాజ్యసభలో ఎస్‌పి ఎంపి జయాబచ్చన్ డిమాండ్ చేశారు. వాళ్లను బహిరంగంగా ఉరితీయాలన్నారు. నిందితులకు ప్రజల మధ్యలోనే శిక్ష వేయాలని, దిశ హత్య కేసులో ప్రభుత్వం నుంచి కచ్చితమైన సమాధానం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. నిర్భయ కేసులో ఇంకా న్యాయం జరగలేదని జయాబచ్చన్ గుర్తు చేశారు. ఇలాంటి ఘటనల్లో పోలీసుల నిర్లక్ష కనపడుతోందని, వారినెందుకు ప్రశ్నించరాదన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అలాంటి వాళ్లు తలదించుకోవాలని జయాబచ్చన్ అన్నారు. తక్షణమే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, నలుగురు నిందితులకు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ఉరిశిక్ష వేయాలని అన్నాడిఎంకె ఎంపి విజిలా సత్యనాథ్ డిమాండ్ చేశారు.

టిఆర్‌ఎస్ ఎంపి మాలోతు కవిత మాట్లాడుతూ.. దిశ ఘటనపై పార్లమెంట్‌లో రోజంతా చర్చ జరిపి కఠిన చట్టం తీసుకురావాల్ని డిమాండ్ చేశారు. నిర్భయ ఘటన జరిగి ఇన్నేళ్లు అవుతున్నా దోషులకు ఉరిశిక్ష అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది 33వేల అత్యాచార కేసులు నమోదవుతున్నాయన్నారు. విమర్శలు చేసుకోకుండా పార్టీలకతీతంగా చర్చించి కఠిన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దిశ హత్యాచారం ఘటన దేశాన్ని కుదిపివేసిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి వంగా గీత మాట్లాడుతూ ఇలాంటి ఘటలనకు పాల్పడాలంటే భయపడే విధంగా చట్టాలు రూపొందించాలని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇటువంటి దారుణాలు అరికట్టలేకపోతే ఆడపిల్లలను మళ్లీ ఇంటికే పరిమితం చేయాలనే ఆలోచన వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే మాట్లాడుతూ లైంగిక వేధింపుల ఘటనలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాదన్నారు. చర్చ సందర్భంగా పలువురు మహిళా ఎంపిలు భావోద్వేగానికి గురయ్యారు.

చట్టాలకు సవరణ చేయాల్సిన అవసరమొచ్చింది : నామా
లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా దిశ ఘటనను అత్యంత హేయమైన ఘటనగా అభివర్ణిస్తూ సభ్యులకు మాట్లాడే అవకాశమిచ్చారు. ఈ సందర్భంగా దిశ ఘటనను టిఆర్‌ఎంపి, లోక్‌సభలో ఆ పార్టీ నేత నామా నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ కేసును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, నిందితులను ఆరు గంటల్లోగా అరెస్టు చేశారని అన్నారు.

క్రూరమైన ఘటనలకు పాల్పడ్డ దోషులకు శిక్ష వెంటనే అమలు కావాలంటే ఐపిసి, సిఆర్‌పిసి నిబంధనలకు సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయని అన్నారు. కోర్టు తీర్పులు కూడా 30రోజుల్లో వెలువడేలా చూడాలన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిందని బిజెపి బండి సంజయ్ అన్నారు. ఇందుకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. దోషులు తప్పించుకునే అవకాశం లభిస్తోందని, అలా కాకుండా కాబట్టి వెంటనే శిక్షలు అమల్యేయేలా కఠిన చర్యలు తీసుకోవాలి’అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దిశ ఘటనకు పోలీసుల వైఫల్యమే కారణమన్నారు. రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయన్నారు. తల్లి పక్కన నిద్రిస్తున్న తొమ్మిది నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తికి స్థానిక కోర్టు ఉరిశిక్ష విధిస్తే.. హైకోర్టు దానిని మారుస్తూ జీవిత ఖైదు చేసిందన్నారు.

వారిని అవమానించారు: ఉత్తమ్‌కుమార్ రెడ్డి
దిశ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు సరిగా స్పందించలేదని, మా పరిధిలోకి రాదంటూ వారిని అటూ ఇటూ తిప్పారని నల్లగొండ కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. బాధితురాలు ఎవరితోనో వెళ్లిపోయిందంటూ దుర్మార్గంగా మాట్లాడారన్నారు. ఒకవేళ వెంటనే పోలీసులు స్పందించి ఉంటే బాధితురాలి ప్రాణం నిలిచేదన్నారు. జాతీయ రహదారుల వెంట మద్యం అమ్మకాలను నిషేధించాలని డిమాండ్ చేశారు ఈ ఘటనలో నిందితులు ఫుల్లుగా తాగి ఉన్నారని, మద్యం వల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు. ఇటువంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

చిన్నారులు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వాళ్లను కఠిన శిక్షించాలని, దానికి ఒక టైం ఫ్రేం నిర్ణయించాలని డిఎంకె సభ్యుడు టిఆర్ బాలు ప్రభుత్వాన్ని కోరారు. దిశ తరహా ఘటనల్లో దోషులకు మరణశిక్ష విధించడంతోపాటు అది త్వరితగతిన అమలయ్యేలా చేయాలని టిఎంసి ఎంపి సౌగతా రాయ్ డిమాండ్ చేశారు. నిర్భయ లాంటి ఘటనల్లో దోషులకు ఉరిశిక్ష విధించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని బిజూ జనతాదళ్(బిజెడి) ఎంపి పినాకి మిశ్రా ప్రశ్నించారు. ఈ సమావేశాల్లో రేపిస్టులకు వ్యతిరేకంగా చట్టం తేవాలని శివసేన సభ్యుడు వినాక్ రౌత్ డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన ఘటన దేశానికి సిగ్గుచేటని బిఎస్‌పి ఎంపి దనీశ్ అలీ అన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు.

Shamshabad rape case incites discussion in Rajya Sabha