Home దునియా తం నమామి శనైశ్చరం

తం నమామి శనైశ్చరం

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం

Shani-God

20 అడుగుల శనీశ్వరుడు

మన దేశంలోనే అతిపెద్ద  శనీశ్వరుడు మన తెలంగాణాలోనే ఉన్నాడు. 20 అడుగుల ఎత్తయిన శనీశ్వరుడు  సంగారెడ్డి పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఎర్దనూర్ గ్రామంలో ఉంది. మధురైకి చెందిన సుబ్బయ్య స్తపతి ఈ ఏక శిలా విగ్రహాన్ని చెక్కారు. 8 మంది సహాయకు లతో కలిసి రూపొందించడానికి ఆయనకు 2 సంవత్స రాల సమయం పట్టింది. ఈ విగ్రహం 9 టన్నుల బరువు ఉంది. మొత్తం విగ్రహంలో 2 అడుగులు గద్దెకు పోగా మిగిలిన శిలను శిల్పంగా మలచాడు. ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్ తన ముగ్గురు కుమారులతో కలిసి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. ఈ ఎర్దనూర్ గ్రామం  హైదరాబాద్ నుంచి 40కి.మీ. దూరంలో ఉంది. పటాన్‌చెరుకు దాదాపు 10కి.మీ. దూరంలో ఉంది. ఈ ఆలయానికి సమీపం లోనే శృంగేరీ పీఠం వారి నిర్వహణలోని దుర్గామాత ఆలయం ఉంది.

నవగ్రహాలలో ఏడవవాడు శనీశ్వరుడు. ఈయన గురించి లోకంలో వినవచ్చే కథలు ఒకరకంగానూ, పురాణాలు చెప్పే కథలు వేరువేరుగానూ ఉన్నాయి. శనిదేవుడు సూర్యుని భార్య ఛాయకు జన్మించాడని లోకప్రతీతి. కానీ ఛాయాదేవి సూర్యుని భార్య సంజ్ఞకు సేవిక అని మహాభారతం చెబుతోంది. ఈ పురాణం ప్రకారం ఛాయాదేవికి శనితోబాటు మను, తపతి మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. శని బ్రహ్మ కొలువులో ఉండేవాడు. ఒకసారి రోహిణిని బెదిరించినందుకు భూమ్మీద అనేక ఉపద్రవాలు జరిగాయి. శనీశ్వరుడు తర్వాతి యుగంలో మనువుగా పుడతాడని కూడా భారతం చెబుతోంది. ఉత్తరాదిన శని జయంతిని జ్యేష్ఠమాసంలో జరుపుకుంటే దక్షిణాదిన వైశాఖమాసంలో అమవాస్యనాడు జరుపుతారు. అమావాస్యనాటి పర్వదినం కనుక శనిజయంతిని శని అమావాస్యగా కూడా వ్యవహరిస్తారు. శని జయంతినాడు భక్తులు ఉపవాసం ఉంటారు. శనీశ్వరుని ఆలయానికి వెళ్ళి పూజాదికాలు నిర్వహిస్తారు. శనిదోష పరిహా రార్ధం తైలాభిషేకాలు, శాంతి పూజలు చేస్తుంటారు. మరికొందరు హవనాలు, హోమాలు, యజ్ఞాలు చేయిస్తారు.

త్రిపురాసుర సంహారం జరిగినపుడు శివుడు త్రిపురాసురులతో పోరాడుతుండగా శని నరకాసురుడితో పోరాడాడని భాగవతం చెబుతోంది. ఈయన యముడికి సోదరుడు..శివునికి పరమభక్తుడు అని లోకం నమ్మకం. జ్యోతిష శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలపైనా.. దేవ, దానవ, మానవ జాతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల మీదా ప్రభావాన్ని చూపించగలిగే వాడు శనీశ్వరుడు. ఈయనను శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య భేదం లేకుండా అన్ని శాఖల వారూ పూజిస్తారు. వర్ణ, వర్గ భేదాలులేకుండా అందరూ శనిదోషనివారణ కోసం ఆరాధిస్తారు. రాముడు, ఆంజనేయుడు, వేంకటేశ్వరుడు, శివుడు, అమ్మవారి తర్వాత భక్తులు అధికసంఖ్యలో ఆరాధించేది శనీశ్వరునే! దాదాపు అన్ని దేవాలయాలలోనూ నవగ్రహ మంటపాలు ఉంటాయి. వాటిలోనూ అధికంగా పూజలందుకునే వాడు శనీశ్వరుడే! నవగ్రహాలలోకి అత్యంత శక్తిమంతుడైన ఈ శనీశ్వరునికి జరిగినన్ని శాంతి పూజలు, అభిషేకాలు, ఆరాధనలు, జపాలు మరే గ్రహాధిపతికీ జరగవంటే అతిశయోక్తికాదు. ప్రత్యేకించి శనివారంనాడు పండగ, పబ్బంతో సంబంధంలేకుండా ఆలయానికి వెళ్ళి నువ్వులనూనె, నల్లనువ్వులతో అభిషేకం, నల్ల వస్త్రసమర్పణ చేయడం చూస్తూనే ఉంటాం. నువ్వుల నూనెతో ఆయనకు అభిషేకం చేయించడమేకాదు వారానికొకసారి మనం కూడా ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని స్నానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. శనిదేవుని మెప్పించడానికి, మనకు పట్టిన దరిద్రం వదిలిపోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పెద్దలు చెబుతున్నమాట.

వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు వగైరాలు, జ్యోతిష గ్రంథాలు శనిదేవుని పరీక్షల దేవుడిగా పేర్కొన్నాయి. పూర్వజన్మలో మనం చేసినవి పాపాలా? పుణ్యాలా అనేది నిర్ధారించేవాడు శనీశ్వరుడే అని జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. మన జాతక చక్రంలో శనిబలంగా ఉంటే మనకు అనేక ప్రయోజనాలు, లాభాలు ఒనగూడతాయని జ్యోతిష గ్రంథం చెబుతుంది. శనీశ్వరుడు స్వక్షేత్రంలో నీచపడినా, అశుభుడైనా అనేక అనర్థాలు జరుగుతాయని కూడా చెబుతోంది. అనేక కష్టాలు, ప్రమాదాలు, విషాదాలు, విచారాలు, పేదరికం, మానసిక కుంగుబాటు, గొడవలు, ఆర్థికసమస్యలవంటివెన్నో చుట్టుకుంటాయి. ఇలాంటివారికి ఇలాంటి పరిస్థితులలో వృద్ధి చాలా నిదానంగా ఉంటుందని, ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదని జ్యోతిషవేత్తలు చెబుతారు. వయసు, పేదరికం, కష్టాలు, రోగాలు, చేసే పనిలో ఆటంకాలు, స్వార్థబుద్ధి వంటి అన్నిటిలోనూ శనీశ్వరుని ప్రభావం ఉంటుంది. శని రాహువుతో కలిస్తే శనిరాహుసర్పిత దోషం అంటారు. అది మహాదుర్యోగం. చేపట్టిన పనులన్నీ నాశనమవుతాయి. శని చంద్రుడితో చేరితే శనిచంద్ర విషయోగం అంటారు. ఈ యోగంలో ఎంత గొప్ప తెలివిపరులైనా కష్టాలపాలవుతారు. బొత్తిగా మనశ్శాంతిలేకుండా ఇబ్బందిపడతారు. ఇలాంటి కష్టకాలంలో, క్లిష్టకాలంలో శనిపూజ, శనియంత్రపూజ ఎంతో మేలుచేస్తుంది.

శని 12, 1, 2 స్థానాలలో ఉన్నప్పుడు ఏలినాటి శని వస్తుంది. ఒకొక్క స్థానంలో శని రెండున్నర యేళ్ళు ఉంటాడు. అందుకే ఏలినాటి శని ఏడున్నరేళ్లకుంటుందంటారు. ఈ సమయంలో ప్రతీ ఒక్కరికీ ఒత్తిడి, ఉద్వేగం, ఉద్రేకం, మానసిక అశాంతి, ఆర్థిక నష్టాలు ఉంటాయి. అర్థాష్టమశని అని మరొకటి ఉంది. ఇది కొద్దికాలం కోసం వస్తుంది. కానీ కష్టాలు మాత్రం ఏలినాటి శనిలో ఉన్నట్టే ఉంటాయి.

ఈయన శుభదాయకుడిగా ఉంటే ఉద్యోగాలు, సేవలు, లోహాలు, పరిశ్రమలు అన్నీ అద్భుతంగా సాగుతాయి. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, వాణిజ్య రంగాలలో పేరు, కీర్తి చేకూరాలంటే శనిదేవుని అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసేవారికి శని అనుగ్రహం తప్పనిసరి. శనివారాలలో, శనిదశ నడుస్తున్న రోజులలో భక్తులు ఆలయానికి వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం చేసినట్టే శనివారవ్రతం అనే వ్రతం ఒకటి ఉంది. కష్టాలు, కలహాలు లేకుండా జీవితం సాఫీగా సాగాలంటే 23వేల శనిజపం చేయాలని పెద్దలు చెబుతారు. ఈసారి శనిజయంతి మే 15వ తేదీన వస్తోంది. అమావాస్య తిథి 14వ తేదీ రాత్రి 6.56 గం.లకు ప్రారంభమవుతోంది. ఇది మరునాడు అంటే 15వ తేదీ సాయంత్రం 5. 34 గం. లకు ముగుస్తుంది.