Friday, April 26, 2024

రాష్ట్రపతి పదవిపై శరద్ పవార్ కన్ను!

- Advertisement -
- Advertisement -

Sharad Pawar's eye on presidency

 పివి నరసింహారావు తర్వాత అయినా కాంగ్రెస్ సారథ్యం లభిస్తుందని ఎదురు చూసిన శరద్ పవార్ ఆ పార్టీలో ఉండగా తనకు సోనియా గాంధీ ఉన్నంత వరకు ప్రాధాన్యత ఉండబోదని గ్రహించిన శరద్ పవార్ సోనియా గాంధీ ‘విదేశీయత’ను ప్రశ్నిస్తూ, ఆమెపై తిరుగుబాటు జరిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకొని, కనీసం 50 లోక్‌సభ సీట్లు గెలుపొందడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టవచ్చని ఆశపడ్డారు.

తన మనసులోని అభిప్రాయాలను బయటకు వ్యక్తం కానీయకుండా రాజకీయ ఎత్తుగడలు వేయడంలో ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ అసాధ్యులు. తన పార్టీ ప్రాబల్యం, తన రాజకీయ బలం చాలా పరిమితమైనప్పటికీ దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా, రాజకీయంగా విశేషమైన పలుకుబడిని సొంతం చేసుకోగలుగుతున్నారు. దాదాపు అన్ని పార్టీల నాయకులతో వ్యక్తిగత సంబంధాలను ఏర్పాటు చేసుకొంటున్నారు. ఆయన రాజకీయ పలుకుబడి మహారాష్ట్రకు పరిమితమైనప్పటికీ, చాలా కాలంగా ఆయన చూపులు అన్ని జాతీయ స్థాయిలో కీలక భూమిక వహించడం వైపే ఉన్నాయి. 1991లో రాజీవ్ గాంధీ మరణం అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవి, ఆ తర్వాత ప్రధాన మంత్రి పదవికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనకు ఒక సారి ఆ పదవులు అప్పగిస్తే, వాటిలో శాశ్వతంగా పాతుకు పోతారని ఆనాటి కాంగ్రెస్‌లోని సీనియర్ నాయకులు అంతా భయపడ్డారు.
అందుకనే ఎంతో బలహీనుడిగా భావించి పివి నరసింహారావును ఎంపిక చేసుకున్నారు.

వాస్తవానికి ఆ ఎన్నికలలో ఎంపిగా గెలుపొందిగా గాంధీ కుటుంబానికి విశ్వాస పాత్రుడైన ఎన్‌డి తివారి ప్రధాన మంత్రి పదవి చేపట్టి ఉండేవారు. పివి నరసింహారావు సహితం ‘లోపలి మనిషి’. తన మనసులో భావాలను బయటకు అర్ధం కానివ్వరు. అందుకనే కాంగ్రెస్‌లో ఆయనను కూడా ఎవ్వరూ నమ్మలేదు. పివి నరసింహారావు తర్వాత అయినా కాంగ్రెస్ సారథ్యం లభిస్తుందని ఎదురు చూసిన శరద్ పవార్ ఆ పార్టీలో ఉండగా తనకు సోనియా గాంధీ ఉన్నంతవరకు ప్రాధాన్యత ఉండబోదని గ్రహించిన శరద్ పవార్ సోనియా గాంధీ ‘విదేశీయత’ను ప్రశ్నిస్తూ, ఆమెపై తిరుగుబాటు జరిపారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకొని, కనీసం 50 లోక్‌సభ సీట్లు గెలుపొందడం ద్వారా సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టవచ్చని ఆశపడ్డారు.

అయితే ఆనాడు వాజపేయి సారథ్యంలో ఎన్‌డిఎ సుస్థిర ప్రభుత్వం ఏర్పడడంతో ఆయనకు అటువంటి అవకాశం లేకుండా పోయింది. తిరిగి కాంగ్రెస్‌కే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లభించడంతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ ఏమీ చేయలేనని గ్రహించి, యుపిఎ ప్రభుత్వాలలో భాగస్వామిగా, కేంద్ర మంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో మహారాష్ట్రలో సహితం తన పార్టీకి ముఖ్యమంత్రి పదవి దక్కకుండా చేయడంతో, వ్యూహం మార్చి శివసేనతో చేతులు కలిపి మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు నూకలుచెల్లే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. శరద్ పవార్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కూడా అందరికి తెలిసిందే. ప్రధాన మంత్రి ఆయన నియోజకవర్గం పర్యటనకు వెళ్లడమే కాకుండా, ఒక రాత్రి ఆయన ఇంట్లో గడిపారు. ఇప్పటి వరకు బిజెపి నాయకల ఇళ్లల్లో కూడా ఆయన ఎక్కడా గడపలేదు. బిజెపి, శివసేన విడివిడిగా పోటీ చేసి, బిజెపికి పూర్తి ఆధిక్యత లభించనప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీకి బేషరతుగా మద్దతు ఇవ్వడానికి పవార్ ముందుకు రావడం తెలిసిందే.

బిజెపి, శివసేన ఇద్దరు కలసి పోటీ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిపై వారిద్దరి మధ్య పేచీ ఏర్పడి ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో పవార్ చొరవ తీసుకొని, శివసేన, కాంగ్రెస్ పార్టీలను దగ్గరకు చేర్చి, ప్రభుత్వం ఏర్పాటుకు దోహదపడ్డారు. ఈ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను రాష్ట్ర కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు ధిక్కరించేటట్లు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీలో శివసేన, ఎన్‌సిపిలతో పాటు భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేయడం కోసం ఆ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. వచ్చే శాసనసభ ఎన్నికలలో శివసేన, ఎన్‌సిపి కలసి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొనడం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం కలిగిస్తున్నది. తమను ధిక్కరించి, కాంగ్రెస్‌తో చేతులు కలిపినా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో ప్రధాని మోడీ మంచి సంబంధాలు కలిగి ఉండడం గమనార్హం. ప్రధాని మోడీ అభీష్టం మేరకే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను సమాధి చేయడానికి శరద్ పవార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. మరోవంక, దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిపక్ష పార్టీల సీనియర్ నేతలు శరద్ పవార్ ఇంట్లో గత నెలలో భేటీ జరిపారు. అసలు ఈ భేటీ ఎందుకు జరిపామో కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ గైరాజరు కావడం గమనిస్తే జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్‌ను ఒంటరిగా చేయడమే లక్ష్యంగా కనిపిస్తున్నది.

బెంగాల్ ఎన్నికలు పూర్తి కాగానే జాతీయ ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకు రావడం కోసం పవార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీని జాతీయ రాజకీయాలలో పక్కకు త్రోసివేయడమే కాగలదు. దేశంలో ఇప్పటికీ 200 నియోజకవర్గాలలో బిజెపితో నేరుగా తలబడుతున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ పార్టీ నాయకత్వ సమస్యను పరిష్కరించుకొని, బలమైన పోటీ ఇవ్వగలిగితేనే ప్రధాని మోడీకి జాతీయ స్థాయిలో పెను సవాల్‌గా మారగలరు. అందుకనే మొదటి నుండి మోడీ, బిజెపి రాహుల్ గాంధీ లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆ పార్టీకి లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ, రాహుల్‌ను వీలు చిక్కినప్పుడల్లా అవహేళన చేస్తున్నారు. వాస్తవానికి మోడీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నది రాహుల్ గాంధీ మాత్రమే. ఆ ప్రభుత్వ విధానాలను తూర్పురా పడుతూ ఉండడంతో మోడీ ప్రభుత్వం నిత్యం ఆత్మరక్షణలో పడుతున్నది. ఈ ప్రభుత్వానికి రాజకీయంగా అంతటి సవాల్ మరే నాయకుడు, పార్టీ నుండి ఎదురు కావడం లేదు. కానీ విస్మయకర విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే రాహుల్‌ను సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆయనను ఒక ‘విఫల నేత’ గానే పరిగణిస్తున్నారు.

ఇతర పార్టీల నేతలకు రాహుల్‌ను దూరం చేయడంలో శరద్ పవార్ సహితం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పవార్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని 2024 ఎన్నికలలో ప్రధాని మోడీకి గట్టి ప్రతిఘటన లేకుండా చేయడానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. అందుకు ప్రతిఫలంగా మరో రెండేళ్లలో జరిగే రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి మద్దతుతో రాష్ట్రపతి పదవి అధిష్ఠించాలని పవార్ ఎత్తుగడలు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. తమ పార్టీ వారిని కాకుండా పవార్‌కు బిజెపి మద్దతు ఇవ్వాలి అంటే, రాష్ట్రాల అసెంబ్లీలలో బిజెపి బలం గణనీయంగా తగ్గాలి. ముఖ్యంగా మరి కొద్దీ నెలల్లో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఓటమి చెందితే రాష్ట్రపతి ఎన్నికలలో తమ సొంత అభ్యర్థిని గెలిపించుకోవడం బిజెపికి దాదాపు అసాధ్యం కాగలదు. అటువంటి సమయంలో రాజీ అభ్యర్థిగా శరద్ పవార్‌కు మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి ఇబ్బందికరం కాబోదు.

అటువంటి పరిస్థితుల కోసమే శరద్ పవార్ ఇప్పుడు అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. మమతా బెనర్జీ, ఎంకె స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలతో పాటు వామపక్షాలు సహితం పవార్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. అటువంటప్పుడు కాంగ్రెస్‌కు సహితం మరో మార్గం ఉండబోదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో వరుసగా శరద్ పవార్ జరుపుతున్న భేటీలు 2024 ఎన్నికల వ్యూహం గురించి అని చెబుతున్నప్పటికీ అసలు ఉద్దేశం ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం కోసం అనువైన రాజకీయ వాతావరణాన్ని ఏర్పర్చుకోవడమే అని భావించవలసి వస్తున్నది. ప్రధాని మోడీకి సహితం అందుకు అభ్యంతరం ఉండే అవకాశం లేదు.

* చలసాని నరేంద్ర- 9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News