Home ఎడిటోరియల్ సాగుపై కొరవడిన స్పష్టత

సాగుపై కొరవడిన స్పష్టత

Nirmala Sitharaman

 

2019 సార్వత్రక ఎన్నికల్లో ఘన విజయం సాధించినా తన ఐదేళ్ల పాలనలో మౌలికమైన పలు సమస్యలకు పరిష్కారం లభించక ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గ్రహించారు. తన ఐదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని చూసి ప్రజలు ఓటు వేయలేదని తెలుసుకున్నారు. ముఖ్యంగా వృద్ధి రేటు మందగించడం, వ్యవసాయ రంగంలో సంక్షోభం నెలకొనడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం కీలక సమస్యలని అర్ధం చేసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెట్టుబడుల కొరత తీవ్రంగా ఉండటం పట్ల ఆందోళన చెందారు.

అందుకనే రెండోసారి అధికారంలోకి రాగానే ఆర్థికాభివృద్ధి, పెట్టుబడుల ప్రవాహం గురించి పర్యవేక్షణకు తన అధ్యక్షతనే రెండు ప్రత్యేక మంత్రివర్గ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగిస్తూ 2024 నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలనే బృహత్తర లక్ష్యాన్ని దేశ ప్రజల ముందుంచారు. దానితో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో స్పష్టమైన మార్గాన్ని ప్రభుత్వం ముందు ఉంచుతారని అందరం ఆశించాము. కానీ ఆమె ప్రసంగంలో ఆర్ధిక ప్రాతిపదిక లోపించినట్లు భావించవలసి ఉంటుంది.

ఇప్పటికే 2.5 లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకున్నామని, ఈ ఆర్ధిక సంవత్సరం చివరకు 3 లక్షల డాలర్లకు చేరుకుంటామని గణాంకాలు చెప్పారు గాని అందుకు నిర్దిష్టమైన మార్గాన్ని చూపలేక పోయారు. వార్షిక వృద్ధి రేటు ప్రస్తుతం 6 శాతంకు మించడం లేదు. కనీసం 13 శాతంకు చేరుకొంటే గాని 2024 నాటికి ప్రధాని చెప్పిన లక్షానికి చేరుకోలేము. అందుకు పెట్టుబడులు పెద్ద ఎత్తున అవసరం కాగలవు. ఈ విషయంలో ప్రభుత్వం ఒక విధంగా తీవ్రమైన వత్తిడులను ఎదుర్కొంటున్నది.
ఒక వంక ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మకానికి పెట్టడం, మరోవంక రిజర్వు బ్యాంకు రిజర్వు నిధులను తెచ్చుకొనే ప్రయత్నం తప్ప మరో మార్గం ప్రభుత్వం ముందు కనబడటం లేదు.

అది రక్షణ రంగం కానీయండి, రైల్వేలు-, రహదారులు కానీయండి, మరే కీలకమైన మౌలిక రంగం కానీయండి ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెడితే తప్ప అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఆ విధంగా ప్రైవేట్ వ్యక్తులను ఆకర్షించడానికి నిర్దిష్టమైన విధానాలను, ప్రతిపాదనలను బడ్జెట్ లో ఉంచలేక పోయారు. పైగా బడ్జెట్ ప్రవేశ పెట్టగానే రెండు రోజుల పాటు స్టాక్ మార్కెట్ భారీ కుదుపుకి గురి కావడం గమనిస్తే ఈ బడ్జెట్ పెట్టుబడిదారుల విశ్వాసం కూడా చూరగొనలేక పోయిన్నట్లు భావించవలసి వస్తుంది. పరిశ్రమలను ఏర్పాటు చేసిన వారు తమ వాటా విలువను 35 శాతం నుండి 25 శాతంకు తగ్గించుకోవాలని ప్రతిపాదన పారిశ్రామిక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు స్పష్టం అవుతున్నది.

దేశంలో ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరగడం, తగ్గిపోతున్న వినియోగాన్ని ప్రోత్సహించాలి అంటే వ్యవసాయ రంగం పుంజుకోవడం తప్ప మరో మార్గం లేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ దిశలో నిర్దిష్టమైన ప్రణాళికను దేశ ప్రజల ముందు ఉంచలేక పోయారు. ఇప్పటికే రెండేళ్లు గడిచింది. మరో ఏడాది పూర్తి కానున్నది. ఈ కాలంలో రైతుల ఆదాయం తగ్గడమే గాని పెరగడం లేదు. వ్యవసాయం పట్ల సరైన అవగాహన ఈ ప్రభుత్వంలో గాని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలో గాని అసలు లేదని ఈ సందర్భంగా భావించవలసి వస్తుంది. 2014 ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న పలు అంశాలను 2019లో ప్రస్తావించక పోవడమే బిజెపి తిరోగమన ధోరణిని వెల్లడి చేస్తుంది. ఒక వంక దేశ ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయం గ్రోత్ ఇంజిన్ వంటిదని ప్రధాని చెబుతారు. అందుకనే వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామని భరోసా ఇస్తారు. మరోవంక ఆర్ధిక సర్వేలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకట్టుకోవడమే ప్రభుత్వ కర్తవ్యం అన్నట్లు వ్యవహరిస్తారు.

గతంలో యుపిఎ ప్రభుత్వం గాని, ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం గాని పంటలకు మద్దతు ధర పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెంచగలమని, వ్యవసాయంలో సంక్షోభకర పరిస్థితులను తొలగించగలమని భావిస్తూ వస్తున్నారు. గత 15 ఏళ్ళల్లో వ్యవసాయ పరికరాల రేట్లు పెరిగాయి. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మద్దతు ధర ఒక మిధ్యగా మారిపోయింది. మద్దతు ధర కారణంగా వినియోగదారులకు భారం పెరగడమే గాని చెప్పుకోదగిన విధంగా రైతుల జీవన పరిస్థితులు మెరుగు కావడం లేదు. మద్దతు ధర పెరిగినప్పుడు దాని కనుగుణంగానే ఇన్‌పుట్స్ ధరలు పెరుగుతాయని మరచిపోతున్నారు. దేశంలో వెయ్యి పంటలుంటే, అందులో కేవలం 24 పంటలకే మద్దతు ధర కల్పిస్తున్నారు. ఈ 24 పంటల మద్దతు ధర కూడా పడిపోతే, ఆ పంటలను కొనుగోలు చేసే వ్యవస్థ ప్రభుత్వం వద్ద లేదు.

కేవలం ధాన్యం, గోధుమ, పత్తి పంటకు మాత్రమే అటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అవి కూడా సంక్షోభకర పరిస్థితులలో రైతులకు ఆశించిన భరోసా కల్పించలేక కుప్పకూలి పోతున్నాయి. దేశం మొత్తం మీద కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే రైతుల నుండి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. మిల్లర్లు ధాన్యానికి బదులు బియ్యం సేకరించి ఫుడ్ కార్పొరేషన్‌కు ఇచ్చే వ్యవస్థ కొనసాగుతుంది. ఈ వ్యవస్థలో రైతులకన్నా మిల్లర్లు, దళారులు, వారికి ఆశ్రయం కల్పిస్తున్న రాజకీయ నేతలే ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారు. ఇటీవలి కాలంలో వ్యవసాయ వృద్ధి రేటు బాగా పడిపోయింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 12.2 శాతం ఉంటే, అది ప్రస్తుతం 2.4 శాతానికి పడిపోయింది. ఆర్థిక సర్వేలో జిడిపిలో వ్యవసాయ రంగం వాటా కేవలం 14 శాతం చూపిస్తోంది. అయితే వాస్తవంగా అంతకన్నా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఎందుకంటే పంటలు, చేపల పెంపకం, అటవీ, డైరీ ఫామ్ వంటి వాటిపై వచ్చిన ఆదాయాన్ని వేర్వేరుగా చూపకుండా, అన్నింటినీ కలిపి చూపుతున్నారు. వ్యవసాయ రంగంలో పంటలపై వచ్చిన ఆదాయం ఏడు నుంచి ఎనిమిది శాతం మధ్యనే ఉండే అవకాశం ఉంది. మరో వంక వ్యవసాయ రంగానికి, వ్యవసాయేతర రంగాలకు, పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య ఆదాయ అంతరాలు పెరుగుతున్నాయి. నేడు రైతులను ప్రధానంగా కలచి వేస్తున్న సమస్యలు అవసరమైన పెట్టుబడులు సవ్యంగా లభించక పోవడం. వ్యవసాయ ఉత్పత్తులకు తగు మార్కెట్ సదుపాయాలు లభించక పోవడం. వ్యవసాయ మార్కెట్ లు అన్నింటిలో దాదాపుగా దళారుల రాజ్యమేలుతున్నారు. దానితో మార్కెట్ లో ధరలు ఎక్కువగా ఉన్నా రైతులకు ఆ ప్రయోజనం అందటం లేదు. రైతుల వద్ద ఉత్పత్తులు ఉన్న సయమంలో గిరాకీ లేదని చాల తక్కువ ధరలకు అమ్మవలసి రావడం, తీరా సరుకు దళారుల చేతులలోకి వెళ్లిన తర్వాత ధరలు బాగా పెరగడం ప్రతి యేడు జరుగుతూనే ఉంది.

దీనికి తోడు రైతులు నీటి అవసరాల కోసం వినియోగించే డీజిల్‌పై సెస్‌ను బడ్జెట్‌లో పెంచడం ద్వారా ఇది వారికి భారంగా మారనుంది. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, విద్యుత్ తదితరాల ధరలు పెరగడం వ్యవసాయరంగ సంక్షోభానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన జిఎస్‌టి వలన వీటి ధరలు మరింత ఆశాకాన్నంటుతున్నాయి. అయినా కూడా రైతులు తప్పని సరి పరిస్థితుల్లో వాటిని అధిక ధరలకు కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నారు. దీంతోపాటు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వలన రైతులు నష్టాల బారిన పడడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమైన వాటి ధరలను స్థిరీకరించాల్సిన అవసరం ఉంది. అనేక రాష్ట్రాల్లోని గ్రామాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఉపాధి లేకుండా పోయింది.

ఇలాంటి సమయంలో ఉపాధి హామీ (ఎంజిఎన్‌ఆర్‌జిఎస్) పథకానికి అధిక నిధులు కేటాయిస్తారని ఆశించారు. కానీ, గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం కేటాయించిన నిధుల్లో ఈసారి దాదాపు రూ. వెయ్యి కోట్ల మేర కోతపెట్టింది. మార్కెట్‌లో ఇంటర్‌వెన్షన్ పథకం, మద్దతు ధర కోసం చేసిన ప్రభుత్వం గతం కంటే అదనంగా చేసిన రూ.1000 కోట్ల కేటాయింపులు ఎంతమాత్రం సరిపోవు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు అధికంగా పెడుతామని ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ప్రకటించింది. అయితే అందుకు నిర్దిష్ట ప్రతిపాదనలను వెల్లడించనే లేదు. మరోవైపు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్య శాఖలో ఉన్న మౌలిక సదుపాయాల కొరతను తీర్చేందుకు ప్రయివేటు సంస్థలకు అన్ని విధాలు సహకరిస్తామని చెప్పడం ద్వారా ఆధునీకరణ పేరుతో మత్స్య శాఖను కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే దురాలోచన కేంద్రం చేస్తోందనే ఆందోళన వ్యక్తం అవుతున్నది. పాడి పరిశ్రమలో కూడా 10 వేల ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ద్వారా ప్రయివేటుకు మద్దతు ఇస్తున్నామని కేంద్రం చెప్పకనే చెప్పింది.

దేశంలో మొదటి సారిగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. 2018-19 నాటికి 283.4 మిలియన్ టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం తెలిపింది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బడ్జెట్‌లో ఎటవంటి ప్రస్తావన రాలేదు. రైతులు ఎవ్వరు తమ సంతానాన్ని వ్యవసాయంలో కొనసాగించాలి అనుకోవడం లేదు. మరో లాభదాయకమైన వృత్తి లభిస్తే వ్యవసాయం నుండి వైదొలగడానికి 45 శాతం మంది రైతులు సిద్ధంగా ఉన్నారు. ఆడ పిల్లలు ఎవ్వరు వ్యవసాయం చేస్తున్న రైతులను వివాహం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. రైతులకు నగదు బదిలీ పథకాల ద్వారా వ్యవసాయాన్ని పటిష్ట పరచలేరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలి. వ్యవసాయాన్ని లాభదాయక వృత్తిగా ఏ విధంగా చేయాలి అనే విషయమై దృష్టి సారించాలి. అత్యవసర వస్తువుల నియంత్రణ, భూ నియంత్రణ వంటి చట్టాల నిరంకుశ ధోరణుల నుండి వారికి స్వేచ్ఛ కలిగించాలి. స్వతంత్రంగా, సాధికారికంగా వ్యవసాయం చేసుకొనే అవకాశాలు కల్పించాలి. నేడు రక్షణ తదితర రంగాలకు విస్తరిస్తున్న ఆర్ధిక సంరక్షణలు దేశంలో సగంకు పైగా ప్రజలకు జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ రంగంను తాకడం లేదు. రైతులకు ఆర్థిక సంస్కరణల ప్రయోజనాలు అందటం లేదు. ఆ విధంగా అందేటట్లు చూడాలి.

                                                                                                            – చలసాని నరేంద్ర

Share of the agricultural sector in GDP is just 14 per cent