Home కలం నాటక రంగ మణిభూషణం మొదలి

నాటక రంగ మణిభూషణం మొదలి

Nagabhushan Sharma

 

కొందరు ప్రముఖుల జీవితాలను కూలంకషంగా పరిశీలిస్తే వారి జీవితానికి ఒక పరమార్థం ఉందనిపిస్తుంది. వారి జీవితం సమస్తం ఆ పరమార్థం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందేమో ననిపిస్తుంది. అలాంటి మహనీయుల్లో ఒకరు ఆచార్య మొదలి నాగభూషణ శర్మ. ఆయన బాల్యంలోని మొదటి ఏడేళ్లు మినహాయిస్తే, జీవితం సమస్తం కళామతల్లి సేవకే అంకితం చేశారు. నటన, రచన, ప్రదర్శన, పరిశోధన, ప్రచురణ, అధ్యయనం, అధ్యాపక త్వం, దర్శకత్వం, మార్గదర్శనం ఇలా కళారంగం లో బహుముఖీనంగా విస్తరించిన ప్రజ్ఞ ఆయన సొంతం. పాశ్చాత్య నాటకాలను సైతం వైవిధ్యభరిత ప్రయోగరీతులతో ప్రదర్శించి, తెలుగు ప్రేక్షకులకు మనోల్లాసం కల్పించిన మహనీయుడాయన. తెలుగు నాటక రంగ చరిత్రను భవిష్యత్ తరాల కోసం అక్షరీకరించిన మహానుభావుడాయన. తెలుగునాట రంగస్థల కళలో తొలి ఆచార్యుడిగా పలువురు కళాకారులను తెలుగు నాటక కళారంగానికి పరిచయం చేసిన ఆదిగురువు ఆయన.

ఎనిమిదేళ్లకే కళారంగంలో తొలి అడుగులు వేశారు నాగభూషణ శర్మ. తండ్రి ప్రోత్సాహంతో ఆ వయస్సులోనే నాటకాన్ని రచించి, ప్రదర్శించి, పలువురి మెప్పు పొందారు. శరత్‌బాబు నవలను ‘రాముని బుద్దిమంతతనం’ అనే పేరుతో పదహారేళ్ల వయసులోనే 1951లో నాటకీకరించారు. ఆ తర్వాతి సంవత్సరం నాటికలను, నాటకాలను ప్రదర్శించడం ప్రారంభించారు. సుప్రసిద్ధ రచయిత నార్ల వేంకటేశ్వరరావు రాసిన ‘భంగపాటు’, ‘కొత్త గడ్డ’ నాటికలు; మునిమాణిక్యం రాసిన ‘గృహ ప్రవేశం’ నాటకం మొదలైనవి ఆయన నాడు ప్రదర్శించారు.

గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ నాటకం ఆ రోజుల్లో పెద్ద హిట్. ఆ నాటకంలోని గిరీశం, మధురవాణి పాత్రలు గ్రామీణుల నోళ్లలో నానిన గొప్ప పాత్రలు. పద్దెనిమిదేళ్ల వయసులో ఆ నాటకంలోని మధురవాణి పాత్ర పోషించి, ప్రేక్షకుల మన్ననలు పొందారు నాగభూషణశర్మ. ఆ పాత్రలో ఆయన యాబైకి పైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. పద్దెనిమిదో ఏటనే ఆయన రాసిన తొలి నాటిక ‘అన్వేషణ’ నాటి సుప్రసిద్ధ సాహిత్య పత్రిక ‘భారతి’లో ప్రచురితమైంది. ఆకాశవాణి నిర్వహించిన నాటక రచన పోటీల్లో ఇరవయ్యేళ్ల వయసులోనే బహుమతి అందుకున్నారు.

తెలుగు నాటకరంగంలో అనేక ప్రయోగాలకు ఆయన శ్రీకారం చుట్టారు. సాధారణ వేదికలనే కాకుండా పరిసరాలను సైతం వేదికలుగా చేసుకుని, నాటక ప్రదర్శనలిచ్చే పద్ధతిని పరిచయం చేశారు. గిరీశ్ కర్నాడ్ రచించిన ‘తుగ్లక్’తో పాటు ‘నరజాతి చరిత్ర సమస్తం’, ‘దొరా! నీ చావు మూడింది’ మొదలైన నాటకాలకు పరిసరాలే వేదికగా ప్రదర్శించారు. పాశ్యాత్య నాటకాలకు తెలుగు సాంప్రదాయాలను, స్థానిక కళారూపాలను మిళితం చేయడం ఆయన చేసిన మరో ప్రయోగం. పలు అమెరికన్ నాటకాలతో పాటు ఇతర భాషల నాటకాలను తెలుగులో ప్రయోగించినప్పుడు ఒగ్గు కథ, శారద కథ మొదలైనవాటిని మిళితం చేసి, ప్రదర్శించి, ప్రేక్షకుల మన్ననలు పొందారు. నాటకం సర్వకళల సమాహారం అంటారు. ఆ నానుడిని నిజం చేస్తూ ‘కాయితం పులి’ మొదలైన నాటకాలలో మైమ్, ఆట, పాటలను కలగలిపి ప్రదర్శించారు.

టంగుటూరి ప్రకాశంపంతులు ఆత్మకథను ‘ప్రజా నాయకుడు ప్రకాశం’ అనే పేరుతో నాటకీకరించి, దేశమంతటా వందలాది ప్రదర్శనలిచ్చారు. ఇతర భాషలకు చెందిన ‘రాజా ఈడిపస్’, ‘ది విజిట్’, ‘మ్యాడ్ విమెన్ ఆఫ్ చల్లియట్’, హయవదన’, ‘మృచ్ఛకటిక’ మొదలైన నాటకాలను ఆంధ్రీకరించడంతో పాటు ప్రదర్శించారు. ఇబ్సన్ నాటకాన్ని ‘డాల్స్ హౌజ్’గా, బెర్తోల్ట్ బ్రెక్ట్ రాసిన నాటకాన్ని ‘తెల్ల సున్నా’గా తెలుగులోకి అనువదించి, తెలుగు ప్రేక్షకులకు కానుకగా అందించారు. సుమారు 80కి పైగా నాటకాలకు ఆయన దర్శకత్వం వహించారు. వాటిలో ఇరవైకి పైగా ఆంగ్ల నాటకాలు కాగా అరవైకి పైగా తెలుగు నాటకాలు. ‘మన్మథుడు మళ్లీ పుట్టాడు’, ‘సంభవామి’, ‘విషాదాంతం’, ‘జంట పక్షులు’, ‘నరజాతి చరిత్ర’ మొదలైన నాటకాలు; ‘జననీ జన్మభూమి’, ‘అన్వేషణ’, ‘ఆగస్టు 15’, ‘అడ్డదారి’, ‘రాజదండం’ మొదలైన నాటికలు 70కి పైగా నాగభూషణ శర్మ రాశారు. స్వతంత్ర నాటకాల రచనతో పాటు రాజా ఈడిపస్ మొదలైన అనువాద నాటకాలను కూడా ఆయన తెలుగులోకి అనువదించారు. డజను ఆంగ్ల నాటకాలను తెలుగులోకి అనువదించడంతో పాటు మూడు సంస్కృత నాటకాలను, ఎనిమిది ఇతర భారతీయ భాషా నాటకాలను కూడా తెలుగులోకి తర్జుమా చేశారు.

సుప్రసిద్ధ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణతో కలిసి 300 కు పైగా గ్రామాల్లో పర్యటించి, 750 మంది కళాకారులు 1975లో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ జానపద కళోత్సవాల్లో పాల్గొనేలా చేశారు నాగభూషణ శర్మ. తోలు బొమ్మలాట బృందాన్ని జపాన్ దేశానికి తీసుకువెళ్లారు. ఆ దేశంలో తోలు బొమ్మలాటను 15 పట్టణాల్లో ప్రదర్శింపజేసి, తెలుగు ప్రదర్శన కళలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించేలా కృషి చేశారు.

తెలుగు కళారంగ చరిత్ర రచనలో శర్మ కృషి అనన్య సామాన్యం. సాహిత్య, నాటక, నృత్య, జానపద ప్రక్రియల్లో పరిశోధనలు చేసి; 15 ఆంగ్ల గ్రంథాలను, 22 తెలుగు గ్రంథాలను వెలువరించారు. ‘వంద సంవత్సరాల తెలుగు నాటక రంగ చరిత్ర’కు సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తించారు శర్మ. తెలుగు నాటకరంగానికి ఎనలేని సేవలందించిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు, ఈలపాట రఘురామయ్య, స్థానం నరసింహారావు, బళ్లారి రాఘవ, ఆచార్య ఆత్రేయ మొదలైనవారి జీవితచరిత్రలను పరిశోధనాత్మకంగా రచించారు. ‘సురభి నాటక సమాజాల చరిత్ర’, ‘కన్యాశుల్కం నూరేళ్ల సమాలోచనం’, ‘నాటక శిల్పం’ మొదలైన గ్రంథాలతో తెలుగు నాటకరంగ చరిత్రను ప్రేక్షకులకు అందజేశారు. ‘నాటక రంగ పారిభాషిక పదకోశం’ అనే పేరుతో నాటకరంగంపై పారిభాషిక పదకోశాన్ని కూడా ఆయన రూపొందించారు. పురాణం సూరి శాస్త్రి రచించిన ‘నాట్యాంబుజము నాట్య అశోకము’ అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించారు.

64 కళారూపాలను ‘ఫోక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అనే పరుతో గ్రంథస్థం చేశారు. ‘తెలుగు సాహిత్యం గాంధీజీ ప్రభావం’, ‘తెలుగు నవలావికాసం’ అనే గ్రంథాలను వెలువరించి, తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. ‘లోచన’ అనే వ్యాస సంపుటిని రచించారు. ‘ఇండియన్ థియేటర్ జర్నల్’ అనే సుప్రసిద్ధ సాంస్కృతిక పత్రికకు నాగభూషణ శర్మ సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య పరిశోధనా త్రైమాసిక పత్రిక ‘నర్తనం’కు ప్రధాన సంపాదకుడిగా 2001 నుండి 2007 వరకు పనిచేసి; ఎంతోమంది నాట్యాచార్యులు, నృత్య కళాకారుల సేవలను తన ప్రత్యేక వ్యాసాల ద్వారా వెల్లడించారు. తెలుగు జానపద కళారూపాలపై పరిశోధనలు చేశారు. క్షేత్ర పర్యటనల ద్వారా ఆయన చేపట్టిన పరిశోధనల పర్యవసానంగా అంతర్జాతీయ వేదికల్లో తెలుగు జానపద కళలకు గుర్తింపు సాధ్యమైంది.

అమెరికాలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో రంగస్థల కళల్లో ఎం.ఎఫ్.ఏ. చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి అమెరికన్ నాటకంపై డాక్టరేటు స్వీకరించిన మొదలి నాగభూషణ శర్మ తెలుగు నాట రంగస్థల కళలకు తొలి ఆచార్యుడయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖలో ఆచార్యుడిగా పదహారేళ్లపాటు పనిచేసిన తర్వాత అదే విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రంగస్థల కళల శాఖలో తొలి ఆచార్యుడిగా, తొలి శాఖాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 1988లో సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్‌ను ప్రారంభించినప్పుడు తొలి డీన్‌గా నియమితులయ్యారు. తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళల శాఖను ప్రారంభించినప్పుడు ఆ విశ్వవిద్యాలయంలోనూ ఆచార్యుడిగా పనిచేశారు. తెలుగు నాటకరంగ ప్రముఖులు డి.ఎస్.ఎన్.మూర్తి, తనికెళ్ల భరణి, తల్లావఝల సుందరం, ఎన్.జె.భిక్షు, భాస్కర్ షెవాల్కర్, విద్యాసాగర్, జి.ఎస్. ప్రసాదరెడ్డి తదితరులు ఆయన ప్రత్యక్ష శిష్యులే. తెలుగునాట టిక్కెట్ కొని, నాటకం చూసే అలవాటును పెంపొందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ‘రసరంజని’ మూలస్తంభాల్లో నాగభూషణశర్మ ఒకరు.

తెలుగు నాటక రంగానికి విశిష్ట సేవలందించిన ఆచార్య మొదలి నాగభూషణ శర్మ అనేక గౌరవాలు, పురస్కారాలు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభామూర్తి పురస్కారం, ఎన్టీరామారావు రంగస్థల పురస్కారం, తానా జీవిత సాఫల్య పురస్కారం, కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘టాగోర్ రత్న’ పురస్కారం, కళారత్న పురస్కారం, అప్పాజోస్యుల విష్ణుట్ల కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభావైజయంతి జీవితకాల సాధన పురస్కారం మొదలైనవి ఆయన పొందారు. వీరేశలింగం, ఆచార్య ఆత్రేయ, బళ్లారి రాఘవ, ధర్మవరం రామకృష్ణమాచార్యులు మొదలైన ప్రముఖుల పేరిట ఏర్పాటు చేసిన పలు పురస్కారాలను ఆయన స్వీకరించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మొదలైన సంస్థలు ఆయనను తమ కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక చేసుకున్నాయి.

తెలుగు నాటక రంగ చరిత్రను ఆంధ్రాంగ్ల భాషల్లో రూపొందించడం, ‘సాహితి’ పేరుతో ద్వైమాసిక పత్రిక ఏర్పాటు, కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో తెలుగునాట నటనాపాఠశాల ఏర్పాటు మొదలైన నాగభూషణశర్మ స్వప్నాలు పూర్తి కాకముందే ఆయన అస్తమయం చెందడం తెలుగు సాంస్కృతిక లోకానికి పూడ్చలేని విషాదం. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీకి సంపాదకుడిగా వ్యవహరించిన ఎ.ఎస్.రామన్ జీవిత చరిత్ర, కూచిపూడి నాట్య చరిత్ర మొదలైన అంశాల్లో ఆయన పరిశోధనలు ముద్రణారూపంలోకి రాకపోవడం కూడా సాంస్కృతిక రంగానికి లోటు. ఆయన అసంపూర్ణంగా వదిలివేసిన ఈ పనులను పూర్తి చేయడమే ఆచార్య మొదలి నాగభూషణశర్మకు మనం అందజేసే నివాళి.

Sharma has done editorial role of Telugu drama history