హైదరాబాద్ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పోటీ చేయనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది వరకు ఆమె రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. అనంతరం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమెను ఎంపిగా పోటీ చేయించేందుకు జగన్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒంగోలు లేదా విశాఖపట్నం నుంచి ఆమెను ఎంపిగా బరిలోకి దించాలన్న యోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి జగన్ తల్లి విజయమ్మ ఎంపిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ నియోజకవర్గం నుంచి షర్మిలను రంగంలోకి దించాలన్న ఆలోచనతో జగన్ ఉన్నట్టు పార్టీలోని కొందరు నేతలు చెబుతున్నారు.
ఈ నియోజకవర్గం కాకపోతే, ఒంగోలు నుంచి , లేని పక్షంలో రాయలసీమలోని పలు నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి షర్మిలను బరిలో ఉంచాలన్న ఆలోచనతో జగన్ ఉన్నట్టు వైసిపి శ్రేణులు చెబుతున్నాయి. ఒంగోలు ఎంపిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి సేవలను పార్టీకి వినియోగించుకోవాలని, ఈ స్థానం నుంచే షర్మిలను ఎన్నికల బరిలోకి దించాలన్న ఆలోచనతో పార్టీ అధినేత జగన్ ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఏతావాతా వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేయడం ఖాయమన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.