Wednesday, April 24, 2024

ఐసిసి చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ గుడ్‌బై..

- Advertisement -
- Advertisement -

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఐసిసి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. శశాంక్ స్థానంలో ఐసిసి డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా తాత్కాలిక చైర్మన్ బాధ్యతలను చేపడుతారు. దీనికి ఐసిసి బోర్డు అంగీకరించింది. కొత్త చైర్మన్ ఎన్నికయ్యే వరకు ఇమ్రాన్ తాత్కాలిక చైర్మన్ పదవిలో కొనసాగుతారు. కాగా, ఐసిసి చైర్మన్ పదవికి ఎప్పుడూ ఎన్నికలు నిర్వహించాలనే విషయంపై వచ్చే నెలలో ఐసిసి సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక, భారత్‌కు చెందిన శశాంక్ మనోహార్ వరుసగా రెండు సార్లు ఐసిసి చైర్మన్‌గా వ్యవహరించారు. మనోహర్ పదవి కాలం ఇప్పటికే ముగిసింది. అయితే కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా అస్తవ్యస్త వాతావరణం ఏర్పడడంతో ఐసిసి చైర్మన్ పదవి ఎన్నిక నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో మనోహర్ పదవి కాలాన్ని ఐసిసి పాలక మండలి పొడిగించింది.

కాగా, మనోహర్‌కు మరో రెండేళ్ల పాటు ఐసిసి చైర్మన్ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అయితే శశాంక్ మాత్రం దీనికి ఇష్టపడకుండా మధ్యలోనే చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. ఇక, చైర్మన్‌గా మనోహర్ ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. మనోహర్ తీసుకున్న నిర్ణయాలతో భారత క్రికెట్ బోర్డు(బిసిసిఐ)కి ఉన్న ఎన్నో అధికారాలకు చెక్ పడింది. అంతేగాక ఒక మాటలో చెప్పాలంటే ఐసిసిపై బిసిసిఐకి ఉన్న ఆధిపత్యానికి ఒక రకంగా మనోహర్ చెక్ పెట్టారనే చెప్పాలి. దీంతో మనోహర్ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని భారత క్రికెట్ బోర్డు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే అవి చాలా వరకు ఫలించలేదనే చెప్పాలి. ఇదిలావుండగా ఐసిసి చైర్మన్‌గా ప్రస్తుత బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని నియమించాలనే డిమాండ్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనను బిసిసిఐ తోసి పుచ్చింది.

Shashank Manohar steps down as ICC Chairman

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News