Home ఎడిటోరియల్ పాలనాదీక్షాదక్షురాలు…

పాలనాదీక్షాదక్షురాలు…

Sheila Dixit

 

కేవలం తన అభివృద్ధి నమూనాతో, పాలనా దక్షతతో వరుసగా 15 ఏళ్లపాటు ఢిల్లీని, ఆ మహా నగర ప్రజల హృదయాలను ఆమె గెలుచుకున్నారు” శనివారం నాడు 81 ఏళ్ల వయసులో ఆఖరి శ్వాస విడిచిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాకలుదీరిన రాజకీయవేత్త షీలా దీక్షిత్ గురించి ఒక వ్యాస కర్త చేసిన వ్యాఖ్యానమిది. 1998 నుంచి 2013 వరకు మూడు పదవీ కాలాలపాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఢిల్లీని పాలించిన షీలా దీక్షిత్ ఆధునిక ఢిల్లీ నగర రూప శిల్పి అనడానికి వెనుకాడవలసిన పని లేదు.

ఢిల్లీ ఈఫెల్ టవర్ అనిపించుకుంటున్న వజీరా బాద్ సిగ్నేచర్ బ్రిడ్జి సహా ఆ నగరంలో అనేక ప్లై ఓవర్లు, అండర్ పాస్‌లు (లో మార్గాలు), రిసార్టులు, రహదారులు, విందు మందిరాలు, మోటెల్స్, హోటల్స్, మాల్స్, న్యూఢిల్లీ సెక్రటేరియట్, అంతర్రాష్ట్ర బస్ స్టేషన్లు, సరికొత్త ప్రభుత్వ కార్యాలయాలు, కొత్త విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వైద్య కళాశాలలు వంటి వెన్నో ఆమె హయాంలోనే వెలిసి మొఘలులేలిన ఢిల్లీ మహా నగరాన్ని దేశ ఆధునిక రాజధానిగా రూపాంతరం చెందించాయి. అందుకే గొప్ప పాలనాదక్షురాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఢిల్లీ అభివృద్ధికి ఆమె చేసిన కృషి మరువలేనిదని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు.

ఇందులో ఆవంత కూడా అతిశయోక్తి లేదు. “నేను ఈ నగరంలోనే పెరిగాను. నా కళ్ల ముందే ఇది ఇంత మార్పు చెందడం ఆనందం కలిగిస్తున్నది. ఢిల్లీ నగరంలో హరిత ప్రాంతాన్ని 89 శాతం నుంచి 33 శాతం వరకు, ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో కృతార్థతను 33 శాతం నుంచి 97 శాతానికి పెంచగలిగాము” అని షీలా దీక్షిత్ తన పాలనా విజయాలను గురించి చెప్పుకున్న మాటలూ ముమ్మాటికీ నిజమే. కొత్త విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులను నెలకొల్పడమే గాక చదువుకునే బాలికలకు, వితంతువులకు ఆర్థిక సహాయాన్ని అందించిన ముఖ్యమంత్రిగా దీక్షిత్ పేరు తెచ్చుకున్నారు. ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో పని చేసిన ఉమా శంకర్ దీక్షిత్ కోడలుగా షీలా ఆ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టడమే గాక దానికి వన్నె తెచ్చారు.

వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన తొలి మహిళ ఆమె. విద్యాధికురాలు, సాహిత్యవేత్త, ప్రపంచ బ్యాంకు చోదిత అభివృద్ధి నమూనాను నమ్మి ఆచరించిన ముఖ్యమంత్రి. పార్లమెంటు సభ్యురాలుగా, కేంద్ర మంత్రిగానూ ఉన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున యుపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆమెను మొదట ప్రతిపాదించారు. 2004లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో పోటీ పడి ఓడిపోయినంత వరకు ఆమె ఒక వెలుగు వెలిగారు. మిగతా రాష్ట్రాలకు ఢిల్లీ రాష్ట్రానికి తేడా ఉంది. మిగతా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు స్వతంత్రాధికారాలు కలిగి ఉంటారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి మాత్రం అటు కేంద్ర ప్రభుత్వంతో, దాని ఏజెంటుగా వ్యవహరించే లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌తో, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌తో సమన్వయం సాధించుకొని పని చేయాల్సి ఉంటుంది. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువ కాలం కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నందున ఆ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోగలిగారు. అందుకే ఢిల్లీకి పరిపూర్ణమైన ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం పోరాడి విసిగిపోయిన ఆమె కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ డిమాండ్ మాత్రం సాధ్యం కాదని ఒకసారి అన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్‌కు, ఆప్‌కు ఎన్నికల పొత్తు కుదరకపోడానికి షీలా దీక్షిత్ వ్యతిరేకతే కారణమని చెప్పుకుంటారు, అంటే ఆ పార్టీలో ఆమె ఎంతటి ప్రాముఖ్యాన్ని పొందుతూ వచ్చారో తెలుస్తున్నది.

ఇంతటి పరిపాలనాదక్షురాలికి కూడా అవినీతి ఆరోపణలెదుర్కోవడం తప్పలేదు. ముఖ్యంగా కామన్ వెల్త్ క్రీడా నగరానికి దీపాలంకరణ వంటి వ్యవహారాల్లో అవినీతికి పాల్పడ్డారనే నిందను ఆమె మోయాల్సి వచ్చింది. రాజకీయాలంటే పన్నీరే కాదు, పంకాన్ని కూడా భరించవలసి వస్తుంది. ఈ విషయాన్ని ఆమె గ్రహించారు. ఢిల్లీ శివారు రిసార్ట్‌లో జెస్సి కలాల్ అనే మహిళా మోడల్ దారుణంగా హతమార్చిన మనుశర్మకు పెరోల్ మంజూరు చేసిన ఉదంతంలోనూ ఆమె విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.

రాజకీయాల్లో రాణించడం వేరు ఒక మహిళ అందులో ఊహించని ఎత్తులకు చేరుకొని ఔరా అనిపించడం వేరు. షీలా దీక్షిత్ అటువంటి ఒక అరుదైన నాయకురాలు. దేశ రాజధాని నగర సిగలో భాసించిన అత్యంత ప్రభావశీలమైన రాజకీయ పారిజాతం. ప్రజల నేత కావడానికి పుర ప్రజల అభిమాన పాలకురాలు కాగలగడానికి తేడా ఉంది. షీలా దీక్షిత్ దేశ రాజధానీ నగర ప్రజానీకం అభిమాన నాయకురాలు. ఆమె మరణం ఆధునిక అభివృద్ధి, ప్రధాన రాజకీయాలకు తీరని లోటు.

Sheila Dixit Passes Away