Wednesday, April 17, 2024

అకాలీదళ్ నిష్క్రమణ

- Advertisement -
- Advertisement -

Shiromani Akali Dal exits NDA

 

కేంద్రంలోని పాలక జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) నుంచి శిరోమణి అకాలీదళ్ నిష్క్రమించడం పంజాబ్‌లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ కూటమిలోని భాగస్వామ్య పక్షాల పట్ల భారతీయ జనతా పార్టీ చూపుతున్న వల్లమాలిన నిర్లక్షం కూడా ఇందులో ప్రస్ఫుటమవుతున్నది. గత ఏడాది మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి విషయంలో బిజెపితో విభేదించి శివసేన దానికి దూరమై ఎన్‌డిఎ నుంచి తప్పుకున్నది. ఇప్పుడు అకాలీదళ్ కూడా అదే బాటపట్టింది. ఎన్‌డిఎ ఏర్పడిన నాటి నుంచి బిజెపితో ఉన్న దాని చిరకాల మిత్ర పక్షం అకాలీదళ్. నూతన వ్యవసాయ చట్టాల పట్ల అసంతృప్తితో అకాలీదళ్ ఎన్‌డిఎ నుంచి నిష్క్రమించింది. శివసేనను గాని అకాలీదళ్‌ను గాని ఎంతో కొంత సంతృప్తి పరచడం ద్వారా అవి కూటమిలో కొనసాగేలాచేసుకోడానికి బిజెపి చొరవ చూపకపోడం గమనించవలసిన విషయం. నరేంద్ర మోడీ అమిత్ షా సారథ్యంలో బిజెపి అసహాయ శూరత్వాన్ని చాటుకోడానికే ప్రాధాన్యమిస్తున్నది.

ఇతరుల అవసరం లేకుండా ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఎదురులేని శక్తిగా తయారై ఏకచ్ఛత్రాధిపత్యం వహించాలని చూస్తున్నది. 2019 ఎన్నికల్లో లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ సిద్ధించిన తర్వాత బిజెపిలో ఈ ధోరణి మరింత గట్టిపడింది. అయితే ఇతర బిజెపియేతర పక్షాలకు శివసేన, అకాలీదళ్ పార్టీలకు మౌలికమైన ఒక తేడా ఉన్నది. మిగతావి మైనారిటీల ఓట్ల కోసం సెక్యులర్ పార్టీలు అనిపించుకుంటాయి. శివసేన, అకాలీదళ్ పూర్తిగా మత ప్రాతిపదిక పక్షాలు. ఆ విధంగా అవి భారతీయ జనతా పార్టీకి సహజ మిత్రులు. ఎన్‌డిఎను వీడిన తర్వాత ఈ రెండు పార్టీలు బిజెపి వ్యతిరేక శిబిరంలో చేరిపోయి దేశంలో రాజకీయ పునరేకీకరణకు దోహదం చేస్తాయా? ఇప్పటికే శివసేన మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్‌సిపిల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి నడుపుతున్నది. కనుక దాని మతతత్వ పునాది సెక్యులర్ పార్టీలతో కూటమి కట్టడానికి అడ్డుకాదు అని నిరూపణ అయిపోయింది. అకాలీదళ్ పరిస్థితి ఇందుకు విరుద్ధం.

పంజాబ్‌లో అది కాంగ్రెస్‌తో ఢీ కొంటున్నది. కాంగ్రెస్‌ను ఓడించడం ద్వారానే అక్కడ అకాలీదళ్ అధికారంలోకి రాగలుగుతుంది. అందుచేత కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ శిబిరంలో అది చేరడం ప్రస్తుతానికి జరిగే పని కాదు. అయితే నూతన వ్యవసాయ చట్టాలపై జాతీయ స్థాయిలో రగులుతున్న ఉద్యమానికి అకాలీదళ్ చేరిక మరింత ఊపునిస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు వ్యవసాయ ప్రధానమైనవి. ప్రధాని మోడీ ప్రభుత్వం జూన్ నెలలో ఆర్డినెన్స్‌ల రూపంలో కార్పొరేట్ వ్యవసాయ విధానాలను ప్రవేశపెట్టినప్పుడే ఈ రెండు రాష్ట్రాలలోని రైతులు నిరసన వెల్లువై ఉవ్వెత్తున లేచారు. ఈ రాష్ట్రాల్లో గోధుమ, వరి పండించే రైతులు విశేషంగా ఉన్నారు. వీరు కమిషన్ ఏజెంట్ల ద్వారా ప్రభుత్వ రంగంలోని వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థతో గట్టిగా పెనవేసుకున్నారు. అధికారిక మద్దతు ధరల విధానంతో ముడిపెట్టుకొని సాగు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు ఈ వ్యవస్థను నిర్మూలించడానికి ఉద్దేశించినవనే గాఢాభిప్రాయంతో వారు వాటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చిన సమయంలో వాటికి అనుకూలంగా స్పందించిన అకాలీదళ్ స్వరాష్ట్రంలో రైతు ఉద్యమం ప్రబలం కావడంతో తన రాజకీయ పునాదులు కదిలిపోతాయనే భయం కలిగి వాటిని పార్లమెంటులో ప్రవేశపెట్టిన దశలో వైఖరి మార్చుకున్నది. కేంద్ర మంత్రి వర్గం నుంచి తన ఏకైక మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్‌ను తప్పించింది. అంతేగాని ఆ దశలో ఎన్‌డిఎ నుంచి నిష్క్రమించలేదు. రైతు ఉద్యమం మరింత ఉధృతం కావడంతో మొన్న శనివారం నాడు ఎన్‌డిఎ నుంచి కూడా తప్పుకున్నది. కేంద్రంలో బిజెపి అధికారానికి ఎటువంటి ఢోకా లేదు. మిత్రులు కూటమి నుంచి తప్పుకున్నా నిశ్చింతగా కొనసాగగలుగుతుంది. కాని రాష్ట్రాల్లో అధికార కైవసానికి మిత్ర పక్షాల అవసరం దానికి తప్పనిసరి. అలాగే రాజ్యసభలో బిల్లులు ఆమోదింప చేసుకోడానికి కూడా మిత్రుల అవసరముంది.

అయితే మొన్న వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ ఆమోద ముద్ర వేయించుకోడానికి ఓటింగ్ నియమాన్ని కూడా ఉల్లంఘించి మూజువాణీ మార్గాన్ని తొక్కిన బిజెపి దుస్సాహసాన్ని గమనించే వారికి అక్కడ కూడా మిత్ర పక్షాల అవసరం లేకుండా నిరంకుశంగా కథ నడిపించుకోడానికి అది వెనుకాడదనే అభిప్రాయం కలగడం సహజం. అయితే కేవలం మెజారిటీ మత ఓటు మీద భరోసాతో ఎటువంటి వివాదాస్పద నిర్ణయాలనైనా అమల్లో పెట్టగలననే అతి ధీమా బిజెపికి మేలు చేయదు. ప్రజలు మతం కంటే మనుగడకు ప్రాధాన్యమిచ్చే మలుపును అది త్వరితం చేస్తుంది. అందుచేత ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా చూసుకోవలసిన అవసరాన్ని కమల నాథులు గుర్తించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News