మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్
హైదరాబాద్: చిన్నారుల హక్కులకు భంగం కలగకుండా ఉండేలా అందరూ కృషి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కోరారు. శనివారం అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆమె చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనాధ పిల్లలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని, తల్లిదండ్రులు లేని పిల్లలకు ప్రత్యేక వైద్యం అందించేందుకు నిలోఫర్ లో శిశువిహార్ వార్డును ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలోనూ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కార్యచరణ చేస్తున్నామని తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో బాలల హక్కులు, ఆరోగ్యం, భద్రత కోసం. ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. బాల్యాన్ని పిల్లలు ఆనందంగా, అద్భుతంగా గడిపేలా దోహదపడాలని కోరారు. రాష్ట్రంలో బాలల కోసం ప్రత్యేకమైన హోమ్స్, బాలల హక్కుల రక్షణకు, భద్రతకు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, బాలల సంక్షేమ కమిటీలు అద్భుతంగా పని చేస్తున్నాయన్నారు.