Home ఎడిటోరియల్ సంపాదకీయం: శివసేన ఎంపిల దురుసుతనం

సంపాదకీయం: శివసేన ఎంపిల దురుసుతనం

Sampadakeeyam-Logoఎయిర్ ఇండియా అధికారిని చెప్పుతోకొట్టిన ఆరోపణకు గురై విమానయాన సంస్థలనుంచి బహిష్కరణకు గురైన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ వివాదం ఎట్టకేలకు ముగిసింది. తన చర్యకు ‘విచారం’ వ్యక్తం చేస్తూ అతడు పౌర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతిరాజుకు లేఖ రాయటం, దాన్ని ఆయన అంగీకరించటంతో గైక్వాడ్‌కు విమానయాన సౌలభ్యం పునరుద్ధరించ బడింది. అయితే గురువారం నాడు లోక్‌సభలో శివసేన మంత్రి అనంత్ గీతె, ఆ పార్టీ ఎంపిల ప్రవర్తన కడు జుగుప్సాకరం, గర్హనీయం. గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలంటూ వారు ఆగ్రహంతో మంత్రివైపు దూసుకెళ్లారు. టిడిపి, ఇతర ఎంపిలు మరికొందరు మంత్రికి రక్షణగా వచ్చారు. హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్, జౌళిశాఖామంత్రి స్మృతి ఇరానీ జోక్యం చేసుకుని రాజును బయటకు తీసుకెళ్లారు.

స్పీకర్ కొద్దిసేపు సభను వాయిదా వేశారు. మంత్రిపై వారికెందుకీ ఆగ్రహం? గైక్వాడ్‌పై విమానయాన నిషేధం ఎత్తివేయాలన్న వారి డిమాండ్‌కు ఆయన సానుకూలంగా స్పందించలేదు. “ఈ సమస్యపై కేసు ఉంది. దాని సమయం అది తీసుకుంటుంది. ఎంపి కూడా ఒక ప్రయాణీకుడే. విమానం మనుషుల్ని మోసుకెళ్లే ఒక యంత్రం. భద్రత ముఖ్యం. భద్రతను నీరుగార్చలేము’ అన్నది మంత్రి సమాధానం. తమ అహం దెబ్బతిన్నట్లు శివసేన ఎంపిలు మంత్రిపైకి దూసుకొచ్చారు, బయటకు వెళ్లబోతున్న ఆయన్ను అడ్డగించారు. శివసేన ఎన్‌డిఎ ప్రభుత్వంలో భాగస్వామి. ఆ విషయాన్ని కూడా మరిచిపోయి సభలో రభసచేయటం, ఆ పార్టీ మంత్రి సహా ఎంపిలు మరో మంత్రిపట్ల ఇంత దురుసుగా, సభ్యతారహితంగా ప్రవర్తించటం సభను దిగ్భ్రాంతి పరిచింది. వారు తమ దౌర్జన్యపూరిత రాజకీయాలకు ‘ప్రజాస్వామ్య ఆలయం’గా పరిగణించే లోక్‌సభను వేదిక చేసుకోవటం దురదృష్టకరం.

మార్చి 23న ఎయిర్ ఇండియా విమానంలో ఘటన తదుపరి తొలిసారి సభకు వచ్చిన గైక్వాడ్ తానే బాధితుణ్ణని చెప్పుకుంటూ జరిగిన ఘటనకు సభకు తన క్షమాపణ తెలియచేశారు. కాని తాను కొట్టిన ఎయిర్ ఇండియా అధికారికి మాత్రం క్షమాపణ చెప్పనన్నారు. ప్రైవేటు విమానయాన సంస్థలపై ఎయిర్ ఇండియా సిఎండి అశ్వనీ లోహాని ఒత్తిడి తెచ్చి నిషేధం విధింపచేశాడని ఆరోపిస్తూ అతనిపై చర్యను డిమాండ్ చేశాడు. ఇదిలావుండగా, తమ ఎంపిపై నిషేధం ఎత్తివేయకపోతే ముంబై, పూనేల్లో ఎయిర్‌ఇండియా కార్యకలాపాలను అడ్డుకుంటామని శివసేన హెచ్చరించింది. మార్చి 23 ఘటన నాటినుంచీ శివసేన నాయకత్వం తమ ఎంపికి సమర్థనగా నిలబడింది. జరిగిన ఘటనకు తమ ఉస్మానాబాద్ ఎంపి చేత విచారం వ్యక్తం చేయించి ఉంటే ఈ సమస్య ఇంతకుముందే పరిష్కారమై ఉండేది. మహారాష్ట్రలో సంబంధాలు బెడిసి ఉన్నందున బిజెపి నాయకత్వం కూడా జోక్యం చేసుకోలేదు. పర్యవసానంగా శివసేన ఎంపిల అసహనం టిడిపి రాజుగారి మీదకు మళ్లింది.

హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చొరవతో తెరవెనుక చరల పర్యవసానంగా గైక్వాడ్ గురువారం సాయంత్రం మంత్రి అశోక్ గజపతిరాజుకు ‘క్షమాపణ’ లేఖ పంపారు. అది అతనిపై నిషేధం ఎత్తివేతకు ప్రాతిపదిక కల్పించింది. అయితే నాటి ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తు కొనసాగుతుంది. బిజినెస్ క్లాస్ లేని విమానమెక్కిన గైక్వాడ్ తనకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించనందుకు ఆగ్రహించి విమానంనుంచి తోటి ప్రయాణీకులతో పాటు దిగనందున ఆయన దగ్గరకు వెళ్లి నచ్చజెప్పటానికి ప్రయత్నించిన అధికారిని స్లిప్పర్‌తో 20దెబ్బలు కొట్టాడన్నది అభియోగం. తాను ఎంపినని చెప్పినా ఆ అధికారే తన పట్ల దురుసుగా ప్రవర్తించి అవమానపరిచాడనేది గైక్వాడ్ ప్రత్యారోపణ. ఎంపి దాడిని తీవ్రంగా పరిగణించిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారులు అతని విమాన ప్రయాణంపై నిషేధం విధించారు. ప్రైవేటు ఎయిర్‌లైన్స్ అనుసరించాయి. కేసును లోతుగా దర్యాప్తు చేయాలి. దోషి ఎవరో తేల్చాలి. కాని ఒక ఎంపి ప్రయాణంపై ఏకంగా నిషేధం విధించటం, అది ఇన్ని రోజులు కొనసాగటం అరుదైన విషయం. పాలక బిజెపి చొరవ తీసుకుని ఉంటే ఎప్పుడో పరిష్కారమయ్యేది.