Home లైఫ్ స్టైల్ కార్తీక దీపం… సకాల పాపహరణం

కార్తీక దీపం… సకాల పాపహరణం

Shiva Is Worshipped During Karthika Masam with Bhilapathas

కార్తీక మాసంలో బిల్వపత్రాలతో శివుని పూజించిన వారికి ఇహంలో సుఖ సంపదలు, పరంలో శివసాయుజ్యం కలుగుతాయట. మొగలి పూవులతో శ్రీమన్నారయణుని అర్చిస్తే వేద వేదాంగాలు అభ్యసించగలిగే అర్హత కలుగుతుందట. తాజా ఫలాలను దానం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ పటాపంచలవుతాయట. అన్నదానం తిలదానం చేసేవారికి సకల దేవతారాధన చేసిన ఫలితం, ప్రాప్తిస్తుందంటారు. ఈ మాసంలో కనీసం ఒక్క రోజైనా నదీస్నానం చేసి, ఆవు నేతితో ఆ దేవ దేవుని ముందు దీపారాధన చేయాలి. నదీ స్నానం కుదరకపోతే కనీసం ఒక్కరోజైనా ప్రాతఃకాలాన లేచి చన్నీటి స్నానం చేస్తే విశేష పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో  చిత్తశుద్ధితో చేసే ఏ దానమైనా అనేక రెట్లు పుణ్యం కలిగిస్తుంది. పుణ్యతీర్ధాలను సేవిస్తే సమస్త పాపాలు తొ లగిపోతాయి. శివునికి జిల్లేడు పూలు, మారేడు దళాలతోనూ, విష్ణువుకు తులసి, మల్లె, తామర, జాజి, దర్భలతో పూజ చేయడం వల్ల భోగభాగ్యాలతో తులతూగుతారని శాస్త్రోక్తి. అయితే ఇన్నాళ్లూ  పని ఒత్తిళ్ల కారణంగానో,  అనారోగ్యం వల్లనో, మరేదైనా ఇతర కారణాల వల్లనో వీటిని ఆచరించ లేక పోయినందుకు విచారించకుండా మిగిలిన ఈ కొద్ది రోజులైనా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

ఈ మాసంలో అన్ని తిథులూ పుణ్యప్రదమైనవే. కార్తీక పూర్ణిమకు ఎంతటి  పవిత్రత, విశిష్టత ఉందో,కార్తీక బహుళ అమావాస్యకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ఈ మాసమంతా దీపారాధన చేసిన భక్తులు అమావాస్యనాడు “పోలిని స్వర్గానికి పంపడం”అనే ప్రక్రియతో కార్తీక దీపాలకు స్వస్తి చెబుతారు. కార్తీక బహుళ అమావాస్యనే పోలాల అమావాస్య లేదా పోలిని  స్వర్గానికి  పంపే అమావాస్య అంటారు. ఈ అమావాస్యనాడు గుడిలో రకరకాల ఆకారాలతో దీపాలు పెడతారు. ప్రమిదల్లో నూనె పోసి, వొత్తు లేసి వెలిగిస్తే ఆ కార్తీక దీపాలు పాపాల చీకట్లను పారదోలతాయని విశ్వాసం. ఎవరెన్ని దీపాలు పెడితే  అంత పుణ్యం లభిస్తుందని నమ్మకం. కార్తీక మాసంలో లక్ష వత్తుల నోము నోచుకోవడం పరిపాటి. అరటి చెట్లు కొట్టి, అరటి బోదెలు తెచ్చి ఒక్కొక్క పొరను వొలుస్తారు. అలా ఆకుపచ్చ పట్టలు పోయి తెల్లటి పట్టలు వచ్చే వరకూ వొలుస్తారు. వాటిని కత్తిరించి అడుగు పొడవున దొన్నెల్లా చేస్తారు. ఈ దొన్నెలకు ఇరువైపుల మైదా పిండి ముద్ద లేదా చలిమిడితో అంచులను మూసి, పడవ వలె తయారు చేసి, దీపారాధన చేస్తారు.

ఈ అరటి దొన్నెల్లో చిన్నచిన్న ప్రమిదల నుంచి దీపాలు వెలిగించి, పసుపు, కుంకుమ, పువ్వులతో పూజించి ఏరు, కాలువ, చెరువు లేదా బావిలో వదులుతారు. అరటి దొన్నెలు లభ్యం కాకపోతే నిమ్మడిప్పల్లో కూడ దీపాలు పెట్టవచ్చు. పట్నాలలో బావులు,ఏరులలో వదలడం కుదరదు కాబట్టి ఇంట్లోనే వెడల్పాటి పాత్రలో నీరు పోసి, దానిలోనైనా వదలవచ్చు. ఇలా చేస్తే నిశ్చయంగా స్వర్గప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. పూర్వం పోలి అనే మహాభక్తురాలు, పతివ్రత. ఆమె ఈ విధంగా చేసి,బొందితో స్వర్గానికి వెళ్ళిందని కార్తీక పురాణం చెబుతుంది. కాబట్టి భక్తులు తమకు వీలయిన విధంగా ఈ దీపారాధన ఆచరించి, పుణ్యఫలాలు పొందగలరు. కార్తీక అమావాస్య నాడు పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేయడం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంబారాలను దానం చేయడం వల్ల పెద్దలు స్వర్గ సుఖాలు పొందుతారని ప్రతీతి.

బిల్వ పత్రం సమర్పయామి…

Shiva Is Worshipped During Karthika Masam with Bhilapathas

బిల్వ వృక్షానికి తెలుగులో మారేడు చెట్టు అంటారు. పరమశివునికి ప్రీతికరమైనది మారేడుదళం. ఈశ్వరుడికి ఎన్నో రకాల పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించినా, వాటిలో మారేడుదళం లేకపోతే ఆ పూజ సంపూర్ణం కానట్లే! ఎందుకంటే వెయ్యి యజ్ఞాలు చేసిన ఫలం, కోటి మంది కన్యలను దానం చేసిన ఫలం, నూరుగోవులను దానం చేసిన ఫలం ఒక్క బిల్వదళం సమర్పించడం వల్ల వచ్చే ఫలం కన్నా స్వల్పం! చెంబెడు నీటిని నెత్తిన పోసి, ఒక్క మారేడు దళాన్ని భక్తితో సమర్పిస్తే చాలు, ఆ పరమశివుడు ఆనందంతో తబ్బిబ్బై ఇంటి ముంగిట కల్పవృక్షాన్ని పాతి, కామధేనువును పెరట్లో కట్టేసి వెళతాడట. బిల్వవృక్షం సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి హృదయం నుంచి ఉద్భవించిందని పురాణాలు పేర్కొంటున్నాయి. బిల్వదళాలు త్రిశూలాకారంలో ఉండి, ఆ త్రినేత్రుని మూడు కన్నుల్లా, ఓంకారానికి ప్రతీకగా భాసిస్త్తాయి. శివ పార్వతులను బిల్వపత్రాలతో పూజించిన వారికి సకల సిద్ధులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. బిల్వవృక్షాన్ని చూసినా, తాకినా, గాలి పీల్చినా మనస్సు, శరీరం పవిత్రమవుతాయి. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ వృక్షం కింద శివలింగాన్ని ఉంచి పూజిస్తే సకల పాపాలూ పటాపంచలవుతాయని ప్రతీతి. దీర్ఘరోగాలతోనూ, దుష్టగ్రహలతోనూ పీడించబడుతున్నవారు, అపమృత్యుదోషం కలవారు మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ బిల్వదళాలతో ఈశ్వరుని అర్చిస్తే అన్ని అరిష్టాలూ తొలగిపోతాయని పురాణోక్తి.

Shiva is Worshipped During Karthika Masam with Bhilapathas

Telangana Latest News