Home రాష్ట్ర వార్తలు కాల్పుల్లో డాక్టర్‌కు గాయాలు

కాల్పుల్లో డాక్టర్‌కు గాయాలు

docterకార్పొరేట్ వైద్యుల వ్యాపారణం
హిమాయత్‌నగర్: రాజధాని నగరం నడిబొడ్డున ఓ డాక్టర్ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో తోటి డాక్టర్‌కు బుల్లెట్ గాయమైంది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన సోమవారం మధ్యా హ్నం 3 గంటలకు హిమాయత్‌నగర్‌లోని స్ట్రీట్ నెంబర్ ఆరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయినికేతన్ ఆసుపత్రి యజమా ని డాక్టర్ శశికుమార్ (45), మాదాపూర్‌కు చెందిన డాక్టర్లు ఉదయ్ (46), సాయికుమార్(51)లు భాగస్వామ్యంతో మాదా పూర్‌లో రెల్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి)గా ఉదయ్, సిఈఓగా సాయికుమార్, డైరెక్టర్‌గా శశికుమార్‌లు ఉన్నారు. ఆసుపత్రి ప్రారంభమైనప్పటి నుంచి లావాదేవీల విషయంలో ఈ ముగ్గురు డాక్టర్ల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. లారెల్ ఆసుపత్రి పెట్టేసమయంలో పెట్టుబడుల విషయంలో కూడా ఈ ముగ్గురి మధ్య వివాదం తలెత్తింది. తనను కేవలం డైరెక్టర్‌గా పెట్టడాన్ని శశికుమార్ జీర్ణించుకోలేదు. అంతేకాకుండా ఎన్‌ఆర్‌ఐ వర్గాల నుంచి తనకు తెలియకుండా ఉదయ్, సాయికుమార్‌లు పెట్టుబడులు తీసుకున్నారని శశికుమార్ తెలుసుకున్నాడు. దీంతో పెట్టుబడుల విషయంలో ఉదయ్, సాయికుమార్‌లపై శశికుమార్ అనుమానాలు పెంచుకున్నాడు. దీంతో తాను పెట్టుబడిన డబ్బులు తిరిగి తనకు ఇచ్చివేయాలని తరచు ఉదయ్, సాయికుమార్‌లపై శశికుమార్ ఒత్తిడి పెంచాడు. ఈ నేపథ్యంలోనే లావాదేవీల విషయంపై చర్చించేందుకు సోమవారం నగరంలో సమావేశం అవుదామని ముగ్గురు అంగీకరించారు. ఈ మేరకు హిమాయత్‌నగర్ బ్లూఫాక్స్ హోటల్‌లో శశికుమార్, డాక్టర్లు ఉదయ్, సాయికుమార్‌లు సుమారు అరగంటపాటు మాదాపూర్‌లోని లారెల్ ఆసుపత్రి లావాదేవీల గురించి చర్చింకున్నారు. ముగ్గురి మధ్య చర్చలు వాడివేడిగా సాగడంతో హోటల్‌లో చర్చించుకోవడం మంచిదికాదని భావించిన ఆ ముగ్గురు శశికుమార్ కారులో లావాదేవీల గురించి మరోసారి చర్చ ప్రారంభించారు. చర్చ ప్రారంభమైన నిముషానికే వెనకసీట్లో ఉన్న శశికుమార్ డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని హెచ్చరించాడు. వెనువెంటనే తన వద్ద ఉన్న లైసెన్స్ గన్‌తో డ్రైవర్ సీట్లో కూర్చున్న ఉదయ్‌పై కాల్పులు జరిపాడు. కాల్పులను పసిగట్టిన సాయికుమార్ కారులోంచి బయటికి పెరిగెత్తి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి పారిపోయాడు. కాల్పులకు తెగబడ్డ శశికుమార్ కూడా కారు దిగి పారిపోయాడు. బుల్లెట్ గాయాలైన ఉదయ్ తనంతట తాను కారులోంచి బయటికి వచ్చి ఆటో మాట్లాడుకుని హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి వచ్చాడు. అప్పటికే తీవ్ర రక్తస్త్రావంతో కిందపడిపోయిన ఉదయ్‌ను అక్కడి డాక్టర్లు వెంటనే స్పందించి ఎమర్జెన్సీ వార్డ్‌కు తరలించారు. అనంతరం అపోలో ఆసుపత్రిలోని ముగ్గురు డాక్టర్ల బృందం అరగంటపాటు ఉదయ్‌కు శస్త్రచికిత్స జరిపారు. ఎడమ చెవి నుంచి దవుడ భాగంలోకి బుల్లెట్ దూసుకుపోయిందని వైద్యులు తెలిపారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిసిపి
కాల్పుల ఘటన తెలియగానే సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్‌రెడ్డి, అదనపు డిసిపి రామ్మోహన్‌రావు, ఎసిపి రాఘవేంద్రారెడ్డి, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్ భీంరెడ్డి, క్లూస్ టీం బృందాలతో హిమాయత్‌నగర్‌లోని స్ట్రీట్ నెంబర్ ఆరులో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. కాల్పులు జరిపి పారిపోయిన శశికుమార్‌ను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపామని డిసిపి కమలాసన్‌రెడ్డి తెలిపారు.
తెగబడతాడని అనుకోలేదు… ప్రత్యక్ష సాక్షి డాక్టర్ సాయికుమార్
మాదాపూర్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన లారెల్ ఆసుపత్రి లావాదేవీల గురించి చర్చింకునేందుకు మాదాపూర్ నుంచి ఉదయ్‌తో కలిసి వచ్చాను. దిల్‌సుఖ్‌నగర్ నుంచి మరో కారులో జనరల్ సర్జన్, డాక్టర్ శశికుమార్ హిమాయత్‌నగర్‌లోని బ్లూఫాక్స్ హోటల్‌కు వచ్చాడు. లావాదేవీల గురించి ముగ్గురం చర్చింకున్నాము. తన డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా శశికుమార్ ఉదయ్‌పై ఒత్తిడి తెచ్చాడు. హోటల్‌లో గొడవ ప్రారంభమైంది. ఒక్కసారిగా శశికుమార్ తన వద్ద ఉన్న గన్‌తో కాల్పులు జరిపాడు.
రూ.౩ కోట్లతో పెట్టుబడి
డాక్టర్లు శశికుమార్, ఉదయ్, సాయికుమార్‌లో సుమారు రూ.3 కోట్లు పెట్టు బడులు పెట్టి మాదాపూర్‌లో లారెల్ ఆసుపత్రి నిర్మించినట్లు తెలిసింది. ఆసు ప త్రి పెట్టకముందు దిల్‌సుఖ్‌నగర్‌లో శశికుమార్‌కు చెందిన సాయినికేతన్ ఆసు పత్రిలో ఉదయ్, సాయికుమార్‌లు డాక్టర్లుగా పనిచేశారు. మాదాపూర్‌లో భాగ స్వామ్యంతో ఆసుపత్రి ప్రారంభించినప్పటి నుంచి ముగ్గురి మధ్య డబ్బుల విష యంలో మనస్పర్దలు వచ్చాయి. ఆసుపత్రి యజమానులుగా ఉదయ్, సాయికు మార్‌లో వ్యవహరిస్తుండగా శశికుమార్‌ను కేవలం డైరెక్టర్‌గా నియమించారు.