Home తాజా వార్తలు తొలి రోజు మనదే..

తొలి రోజు మనదే..

Shreyas iyer, ravindra jadeja half centuries

 

రాణించిన గిల్, జడేజా, శ్రేయస్ జోరు, భారత్ 258/4, కివీస్‌తో మొదటి టెస్టు

కాన్పూర్: న్యూజిలాండ్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ముగ్గురు బ్యాటర్లు అర్ధ సెంచరీలతో కదం తొక్కడంతో తొలి రోజు ఆటలో భారత్ పైచేయి సాధించింది. తొలి సెషన్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించగా, రెండో సెషన్‌లో కివీస్ బౌలర్లు సత్తా చాటారు. ఇక మూడో సెషన్‌లో మళ్లీ భారత్ పుంజుకుంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. దీంతో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి పటిష్టస్థితికి చేరుకుంది.

గిల్ అర్ధ శతకం..
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. రెండు ఫోర్లతో 13 పరుగులు చేసి జేమిసన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 21 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాతో కలిసి మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పోరాటం కొనసాగించాడు. కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన గిల్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించాడు. మరోవైపు పుజారా తన మార్క్ డిఫెన్స్‌తో అతనికి అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ 93 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 52 పరుగులు చేసి జేమిసన్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కొద్ది సేపటికే పుజారా కూడా ఔటయ్యాడు. 88 బంతుల్లో రెండు బౌండరీలతో 26 పరుగులు చేసిన అతన్ని సౌథి వెనక్కి పంపాడు. దీంతో 106 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది.

రహానె జోరు..
ఈ దశలో అరంగేట్రం టెస్టు ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచాడు. కెప్టెన్ అజింక్య రహానెతో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు కుదురుగా ఆడడంతో భారత్ కోలుకున్నట్టే కనిపించింది. రహానె దూకుడుగా ఆడుతూ స్కోరును పరిగెత్తించాడు. అతనికి అయ్యర్ సహకారం అందించాడు. ఆరు ఫోర్లతో 35 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపిస్తున్న రహానెను జేమిసన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో 39 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

ఆదుకున్న శ్రేయస్, జడేజా
దీంతో భారత్ 145 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచే బాధ్యతను శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా తమపై వేసుకున్నారు. ఇద్దరు కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలతో తరలిస్తూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు అయ్యర్, అటు జడేజా అసాధారణ బ్యాటింగ్‌తో అలరించారు. ఇద్దరు కుదురు కోవడంతో భారత్ మళ్లీ పైచేయి సాధించింది. అరంగేట్రం మ్యాచ్‌లో అయ్యర్ ఆకట్టుకున్నాడు.

కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అయ్యర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 136 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికి జడేజా తనవంతు సహకారం అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జడేజా 100 బంతుల్లో ఆరు బౌండరీలతో 50 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ స్కోరు 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 258 పరుగులకు చేరింది. ఇక వెలుతురు లేని కారణంగా నాలుగు ఓవర్లు మిగిలివుండగానే తొలి రోజు ఆటను నిలిపి వేశారు. కాగా, కివీస్ బౌలర్లలో జేమిసన్ మూడు, సౌథి ఒక వికెట్ పడగొట్టారు.