Home తాజా వార్తలు సింధుకు షాక్

సింధుకు షాక్

PV Sindhu

చాంగ్‌జౌ : చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో సింధు థాయిలాండ్ షట్లర్ పోర్న్‌పవి చోచువాంగ్ చేతిలో అనూహ్య పరాజయం చవిచూసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి జోరు మీదున్న సింధు చైనా ఓపెన్‌లో కూడా టైటిల్ సాధించాలనే పట్టుదలతో కనిపించింది. కానీ పోర్న్‌పవితో జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలై అభిమానులను నిరాశకు గురి చేసింది. నువ్వానేనా అన్నట్టు సాగిన సమరంలో సింధు 2112, 1321, 1921 తేడాతో పోర్న్‌పవి చేతిలో కంగుతిన్నది. ఆరంభంలో సింధు బాగానే ఆడింది. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. దూకుడుగా ఆడుతూ ముందుకు సాగింది. సింధు జోరుకు ప్రత్యర్థి పోర్న్‌పవి కనీస పోటీ కూడా ఇవ్వలేక పోయింది. కీలక సమయంలో ఒత్తిడికి గురై సింధుకు మరింత కోలుకునే అవకాశం కల్పించింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన సింధు అలవోకగా తొలి సెట్‌ను సొంతం చేసుకుంది.

కానీ, రెండో గేమ్‌లో సీన్ రివర్స్ అయ్యింది. ఈసారి సింధుకు ప్రత్యర్థి నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. పోర్న్‌పవి అద్భుత ఆటతో సింధును ఉక్కిరిబిక్కిరి చేసింది. కళ్లు చెదిరే షాట్లతో అలరించిన పోర్న్‌పవి సునాయాసంగా సెట్‌ను గెలిచి స్కోరును సమం చేసింది. ఇక, ఫలితాన్ని తేల్చే కీలకమైన మూడో సెట్‌లో పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు సింధు, అటు పోర్న్‌పవి ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో హోరాహోరీ తప్పలేదు. ఒక దశలో సింధు పైచేయి సాధించింది. అయితే కీలక సమయంలో ఒత్తిడికి గురై వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలగా మార్చుకున్న ప్రత్యర్థి షట్లర్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ముందంజ వేసింది.
ప్రణీత్ ఇంటికి
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కూడా భారత్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో సాయి ప్రణీత్ పోరాడి ఓడాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో చైనా ఆటగాడు గ్వాంగ్ జు చేతిలో ఓటమి పాలయ్యాడు. చివరి వరకు ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చినా సాయికు ఓటమి తప్పలేదు. ఆఖరు వరకు నిలకడగా ఆడిన గ్వాంగ్‌జు 2119, 2119 తేడాతో ప్రణీత్‌పై చెమటోడ్చి నెగ్గాడు. కీలక సమయంలో ఒత్తిడికి గురైన సాయి వరుస తప్పిదాలకు పాల్పడ్డాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో గ్వాంగ్‌జు సఫలమయ్యాడు. చివరి వరకు నిలకడగా ఆడిన గ్వాంగ్‌జు వరుసగా రెండు సెట్లు గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇదిలావుండగా మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్‌లో కూడా భారత్‌కు చుక్కెదురైంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్‌చిరాగ్ జోడీ రెండో రౌండ్‌లోనే ఓటమి పాలైంది. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో కూడా సాత్విక్ సాయిరాజ్‌అశ్విని పొన్నప్ప జంట పరాజయం చవిచూసింది.

Shuttler PV Sindhu crashes out of China Open