Home రాష్ట్ర వార్తలు ప్రధాని బందోబస్తు విధి నిర్వహణలోని… ఎస్‌ఐ శ్రీధర్ ఆత్మహత్య

ప్రధాని బందోబస్తు విధి నిర్వహణలోని… ఎస్‌ఐ శ్రీధర్ ఆత్మహత్య

si

మన తెలంగాణ/ సిటీబ్యూరో: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ శ్రీధర్ తన సర్వీస్ రివా ల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శివరాంపల్లి సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్‌పిఎ) సమీపంలో జర గడం కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు శ్రీధర్ తన ప్రియురాలితో చివరిసారిగా మాట్లాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రేమ వ్యవహా రమే ఆత్మహత్యకు కారణమని పోలీసులులు అంటున్నారు. రాజేంద్రనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2012 సబ్‌ఇన్‌స్పెక్టర్ బ్యాచ్‌కు చెందిన శ్రీధర్ కొమురంభీమ్ జిల్లా చింతనమనేపల్లి స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

ఎన్‌పిఎలో మూడు రోజుల జరుగనున్న అఖిలభారత డిజిపిల 51వ వార్షిక సమావేశాలకు ప్రధాన నరేంద్రమోదీ రావడంతో రెండు రోజుల ముందే శ్రీధర్‌ను బందోబస్తు నిమిత్తం పిలిపించారు. మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్లే పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే 174వ నెంబర్ పిల్లరు వద్ద ఉప్పర్‌పల్లి సమీపంలో నిర్మాణంలో 22 అంతస్థుల భవనంలో 19వ అంతస్థులో శ్రీధర్ ఆబ్జర్వేషన్‌గా విధినిర్వహణలో ఉన్నాడు. శనివారం ఉదయం 9.30 గంటలకు తన ప్రియురాలికి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ వెనువెంటనే తన సర్వీస్ రివాల్వర్‌తో గుండెకు గురిపెట్టుకుని కాల్చుకుని కుప్పకూలిపోయాడు.తుపాకీ శబ్దం వినగానే ప్రధాని బందోబస్తు కోసం వచ్చిన మిగతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికి శ్రీధర్ రక్తం మడుగులో పడి మృతి చెంది ఉన్నాడు. విషయం తెలియగానే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఘటనా స్థలంలో శ్రీధర్ ఛాతిలో ఎవరో ఫైర్ చేసి చంపారనే అనుమానాలు కలిగాయి ముందుగా. దీంతో అధికారులు ఘటనా స్థలాన్ని సీజ్ చేశారు. ఆ ప్రాంతానికి మీడియా ప్రతినిధులు ఎవరిని లోనికి అనుమతించలేదు. డాగ్ స్కాడ్, క్లూస్ టీం కూడా ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించారు. చివరకు ప్రేమ వ్యవహారం మూలంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలియడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. శ్రీధర్‌కు సన్నిహితంగా ఉండే సందీప్ అనే హోంగార్డ్ ఆయన ఆత్మహత్య గురించి పలు విషయాలు వెల్లడించాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని శ్రీధర్ తరచూ తనతో చెప్పేవాడని వెల్లడించాడు. అయితే, తన పెళ్లికి ఇంట్లోవాళ్లు ఒప్పుకోవడం లేదని శ్రీధర్ బాధపడడేవాడని తెలిపాడు.‘నిన్నే చనిపోతానని నాకు చెప్పాడు, వద్దని వారించాను, రాత్రి ఎనిమిది గంటల సమయంలో శ్రీధర్‌తో మాట్లాడి వెళ్లిపోయాను, ఉదయం కాల్ చేశాను, లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి వెళ్లాను, అప్పటికే శ్రీధర్ చనిపోయి ఉన్నాడు” అని హోంగార్డ్ సందీప్ తెలిపాడు. ప్రేమించిన అమ్మాయితో చివరి సారిగా ఫోన్‌లో మాట్లాడుతూనే తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చకుని శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే నా చివరి ఫోన్ అని శ్రీధర్ తన ప్రియురాలికి చెప్పాడు.

ఆ తరువాత ఫోన్ కట్ చేశాడు. భయపడ్డ ప్రియురాలు శ్రీధర్ సెల్‌కు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆందోళన చెందిన ప్రియురాలు చింతనమనేపల్లి పోలీసు స్టేషన్‌లోని రైటర్‌కు ఫోన్ చేసింది. రైటర్ వెంటనే హైదరాబాద్‌లో శ్రీధర్‌తో పాటు బందోబస్తుకు వెళ్లిన హోంగార్డు సందీప్‌కు ఫోన్ చేశారు. సందీప్ హుటాహుటీనా శ్రీధర్ విధినిర్వహణలో ఉన్న 19వ అంతస్థుకు వెళ్లాడు. అప్పటికే జరగరాని తప్పిదం జరిగిపోయింది. శ్రీధర్ ఆత్మహత్య విషయం తెలియగానే అతని ప్రియురాలు సృహతప్పి పడిపోయిందని, ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. శ్రీధర్ ఆత్మహత్య విషయం తెలియగానే వరంగల్‌లో ఉన్న అతని కుటుంబ సభ్యులు నగరానికి చేరుకుని బోరున విలపించారు. రేపోమాపో పెళ్లి కావాల్సిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా చనువు చాలించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.

వరంగల్ జిల్లా పైడిపల్లికి చెందిన శ్రీధర్ వృత్తి జీవితం అంత స్థిరంగా లేదని తెలుస్తోంది. నాలుగేళ్లలో నాలుగు పోలీసు స్టేషన్లు మారారు. గతంలో గుడిహత్నూర్, ముధోల్, కాగజ్‌నగర్ స్టేషన్‌లలో చేసిన ఆయన ఇప్పుడు చింతమనేపలి పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఎస్‌ఐ శ్రీధర్ మృతదేహాన్ని పంచనామ అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి తల్లిదండ్రులకు అందజేశారు. ఆదివారం వారి స్వగ్రామంలో ఎస్‌ఐ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎస్‌ఐ శ్రీధర్ ఆత్మహత్య విషయం తెలియగానే అతని తోటి ఎస్‌ఐలు, స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో మార్చురి వద్దకు చేరుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి.