*అభివృద్ధికి ప్రత్యేక నిధులు
*కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు, మున్సిపల్ కమిషనర్ శృతిఓజా
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : హన్మకొండలోని సిద్ధేశ్వర గుండంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా ) చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పోలీసు కమిషనర్ జి. సుధీర్‌బాబు, వరంగల్ మున్సిపల్ కమిషనర్ శృతిఓజాలు అన్నారు. గుండం అభివృద్ధికై గ్రేటర్ మున్సిపల్ అధికారులు సహకారం అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు ఈ సందర్భంగా కోరారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగం దత్తత చేపట్టిన సిద్ధేశ్వర గుండం అభివృద్ధి పనులను వరంగల్ పోలీస్ కమిషనర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ శృతిఓజా, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డితో కలిసి శనివారం పర్యవేక్షించారు. మిషన్ కాకతీయలో భాగంగా సిద్ధేశ్వర గుండాన్ని దత్తత చేపట్టిన వరంగల్ పోలీస్ కమిషనర్ గుండం అభివృద్ధికి నడుం బిగించడంతో పాటు ఈ ప్రాంతాన్ని టూరిజం స్థలంగా గుర్తింపు తీసుకరావడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా గుండం మరింత అభివృద్ధి చేయడం కోసం వరంగల్ పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, కుడా చైర్మన్‌తో కలిసి ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ముఖ్యంగా ఈ గుండం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన నిర్మాణాలతో పాటు, గుండం పరిసర ప్రాంతాలను సుందరీకరణకై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించడంతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఈ ముగ్గురు అధికారులు పద్మాక్షి దేవాలయానికి వెళ్లి మార్గంలోని జైన్ కొండపై ఉన్న జైన్ విగ్రహాన్ని నగర ప్రజలు సందర్శించే విధంగా కుడా ఆధ్వర్యంలో కొండపై నిర్మిస్తున్న మెట్ట నిర్మాణాన్ని అధికారులు పర్యవేక్షించడంతో పాటు, ఈ ప్రాంతాన్ని టూరిజంగా అభివృద్ది కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలను కుడా చైర్మన్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్‌తో చర్చించారు. ఇలాంటి ప్రాంతాలను అభివృద్ధి పరచడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రజలు ఈ స్థలాలను సందర్శించేందుకు ఆసక్తి కనబరుస్తానని, అదేవిధంగా టూరిజం అభివృద్ధి కోసం ఈ ప్రాంతాలకు వచ్చే సందర్శకులకు మరింత భద్రత కల్పించడం కోసం మరిన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. అధికారులతో పాటు కుడా ప్లానింగ్ ఆఫీసర్ అజిత్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భీంరావు, హన్మకొండ ఇన్స్‌పెక్టర్ సంపత్‌రావు అన్నారు.